విజిటింగ్‌ కార్డుల్లా చూడొద్దు

Childrens Report Cards Not Your Visiting Cards PM Modi  - Sakshi

పిల్లల రిపోర్టు కార్డులను

చిన్నారులను ఇతరులతో పోల్చకండి

 వారిని ప్రోత్సహించే రీతిలో వ్యవహరించండి 

విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రధాని మోదీ సూచన 

న్యూఢిల్లీ: తల్లిదండ్రులు తమ కలలను పిల్లలపై రుద్దవద్దని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ప్రతి చిన్నారిలోనూ ఏదో ఒక నైపుణ్యం ఉంటుందని, దానిని గుర్తించి ప్రోత్సహించే రీతిలో తల్లిదండ్రులు వ్యవహరించాలన్నారు. పిల్లల రిపోర్టు కార్డులను తమ విజిటింగ్‌ కార్డుల్లా పరిగణించవద్దని పేర్కొన్నారు. ‘పరీక్షా పే చర్చ’లో భాగంగా మంగళవారం ఢిల్లీలోని థాల్కాటోరా స్టేడియంలో దేశవ్యాప్తంగా ఎంపికైన దాదాపు 2 వేల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. పరీక్షల గురించి ఒత్తిడికి గురికావద్దని, పరీక్షలే జీవితం కాదని విద్యార్థులకు సూచించారు.

పరీక్షలు ముఖ్యమైనవే.. కానీ ఇవి జీవితానికి సంబంధించినవా? లేక 10వ తరగతికో, 12వ తరగతికో పరిమితమైనవా? అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలన్నారు. దీనికి సమాధానం వస్తే ఒత్తిడిని అధిగమించగలిగినట్లే అని పేర్కొన్నారు. చిన్నారులను పోత్సహించి, ప్రేరణనిచ్చే శక్తి తల్లిదండ్రులకు మాత్రమే ఉందని మోదీ స్పష్టం చేశారు. ఏ విషయంలోనూ చిన్నారులను ఇతరులతో పోల్చవద్దని దీనివల్ల వారి ఆత్యస్థైర్యం దెబ్బతినే ప్రమాదం ఉందని ప్రధాని హెచ్చరించారు. పిల్లలు సాధించిన చిన్న చిన్న విజయాలను కూడా తల్లిదండ్రులు అభినందిస్తూ ఉంటే వారు మరింత మెరుగ్గా రాణించగలరని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత విద్యా వ్యవస్థ ర్యాంకులకు మాత్రమే పరిమితమైందని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా దీనికి తగ్గట్టే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చిన్నారులకు తగినంత స్వేచ్ఛ ఇవ్వాలని.. ర్యాంకుల కోసం మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న విషయాలను చూసి నేర్చుకునేలా వారిని ప్రోత్సహించాలని మోదీ సూచించారు. నేర్చుకోవడాన్ని పరీక్షల వరకే పరిమితం చేయవద్దని, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే రీతిలో చిన్నారులను సన్నద్ధం చేయా లని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని, దానిని అధిగమించే దిశగా కృషిచేయాలని విద్యార్థులకు సూచించారు.  

దేశమే నా కుటుంబం.. 
మీరు రోజులో 17 గంటలు ఎలా పనిచేయగలుగుతున్నారని ఓ విద్యార్థి ప్రధానిని ప్రశ్నించగా.. ‘ఓ తల్లి తన కుటుంబం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది. అయినా అలసిపోదు. అలాగే నేను దేశాన్ని నా కుటుంబంగా భావిస్తాను. వారి కోసం ఎంతవరకైనా శ్రమిస్తూనే ఉంటాను’ అని మోదీ బదులిచ్చారు. మాకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకునేలా తల్లిదండ్రులను ఎలా ఒప్పించాలని ఓ విద్యార్థి ప్రశ్నించగా.. ‘మీ ప్యాషన్‌ గురించి వారికి చెప్పండి. అది సాధించడానికి మీ వద్ద ఉన్న నైపుణ్యాలను ప్రదర్శించండి. అవసరమైతే మీ టీచర్ల సాయం తీసుకోండి. వారి సాయం తో మీ తల్లిదండ్రులను ఒప్పించండి’ అని మోదీ సలహా ఇచ్చారు.    

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top