
సాక్షి, న్యూఢిల్లీ: తమకు ఒక సీటు కేటాయిస్తామని హామీ ఇచ్చి ఢిల్లీ పిలిపించిన కాంగ్రెస్ పెద్దలు.. సీటు ఇవ్వకుండా అవమానించారని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ మండిపడ్డారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి పొత్తులో భాగంగా ఒక సీటు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి కుంతియా ఇప్పుడు మొహం చాటేసి కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తమను ఢిల్లీకి పిలిపించి సీటు ఇవ్వకుండా అవమానించడంలో ఉన్న ఆంతర్యం ఏంటని ఆయన ప్రశ్నించారు.
నేడు ఎన్నికల కార్యాచరణ..
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో పోటీపై ఇంటి పార్టీ బుధవారం కార్యాచరణను ప్రకటించనుంది. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, పార్టీ నేత యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. టీఆర్‌ఎస్, మహాకూటమి పార్టీల్లో టికెట్ ఆశించి భంగపడ్డ 52 మంది నేతలతో ఈ ఎన్నికల్లో పోటీలో నిలిచే అవకాశాలున్నాయి.