ఆర్టీఐ కమిషనర్లను నియమించరా? | Sakshi
Sakshi News home page

ఆర్టీఐ కమిషనర్లను నియమించరా?

Published Tue, Jul 3 2018 2:29 AM

Centre, States Get Supreme Court Notice About Delay In Filling RTI Posts - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సమాచార హక్కు చట్టం పరిధిలోని కేంద్ర సమాచార కమిషన్‌(సీఐసీ), రాష్ట్రాల సమాచార కమిషన్ల(ఎస్‌ఐసీ)లో ఖాళీల్ని భర్తీ చేయకపోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేశారు. వేలాది అప్పీళ్లు, ఫిర్యాదుల పరిష్కారంపై ఈ జాప్యం ప్రభావం చూపుతుందని,  ఖాళీల్ని ఎందుకు భర్తీ చేయలేదో జవాబు చెప్పాలని కేంద్రంతో పాటు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు నోటీసులు జారీచేసింది. సమాచార హక్కు కమిషనర్లను భర్తీ చేయకపోవడంతో వేలాది అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేస్తూ ముగ్గురు పిటిషనర్లు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం సోమవారం విచారించింది.  

వెంటనే చర్యలు చేపట్టాలి: సుప్రీం  
ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఖాళీల్ని భర్తీ చేయకపోతే ఈ రాజ్యాంగ సంస్థల నిర్వహణ కష్ట సాధ్యంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఈ విభాగాల్లో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇతర చట్టబద్ధ సంస్థల్లోను ఇది అలవాటుగా మారిపోయింది. వందల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడానికి వీల్లేదు. మీరు ఏదొకటి చేయాలి’ అని అదనపు సొలిసిటర్‌ జనరల్‌  పింకీ ఆనంద్‌కు సుప్రీం స్పష్టం చేసింది.  

సీఐసీలో 23,500కు పైగా అప్పీళ్లు, ఫిర్యాదుల పెండింగ్‌
ఆర్టీఐ కార్యకర్త అంజలి భరద్వాజ్, మాజీ నేవీ అధికారి లోకేశ్‌ బాత్రా, అమ్రితా జోహ్రిల తరఫున న్యాయవాది కామిని జైస్వాల్‌ వాదిస్తూ.. ప్రస్తుతం సీఐసీలో 4 ఖాళీలున్నాయని, 23,500కు పైగా అప్పీళ్లు, ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ‘వేలాది అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నా బ్యాక్‌ల్యాగ్‌ పోస్టులు భర్తీ చేయడం లేదు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, బెంగాల్, కేరళ, కర్ణాటక, ఒడిషా తదితర రాష్ట్రాల్లో సమాచార హక్కు కమిషన్లలో బ్యాక్‌ లాగ్‌ పోస్టులను భర్తీ చేయకుండా ఆర్టీఐ చట్టాన్ని కాలరాస్తున్నారు. కేంద్ర సమాచార కమిషన్‌ వద్ద వేల అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. 2016లో వచ్చిన అప్పీళ్లూ పెండింగ్‌లో ఉన్నాయి’ అని జైస్వాల్‌ పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ సమాచార హక్కు కమిషన్‌లో ఒక్క కమిషనర్‌ను కూడా భర్తీ చేయలేదని, ఆ రాష్ట్ర ఎస్‌ఐసీ ప్రస్తుతం ఎలాంటి విధులూ నిర్వర్తించడం లేదని కోర్టుకు తెలిపారు. మహారాష్ట్ర కమిషన్‌లో నాలుగు ఖాళీలు ఉన్నాయని, అక్కడ 40 వేల అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని, కర్ణాటకలో ఆరు పోస్టుల ఖాళీగా ఉండగా.. 33 వేల అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.కేరళలో ఒకే ఒక్క కమిషనర్‌ విధుల్లో ఉన్నారని, అక్కడ 14 వేల అప్పీళ్లను పరిష్కరించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ఇన్ని పోస్టులు భర్తీ చేయాల్సి ఉన్నా ఎందుకు జాప్యం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంతో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, కేరళ, ఒడిశా, కర్ణాటక, ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.  

Advertisement

తప్పక చదవండి

Advertisement