నాలుగు నదుల అనుసంధానం!


* జల్ మంథన్‌లో ముమ్మర చర్చ

* మహానది, గోదావరి, కృష్ణా, కావేరి

* అనుసంధానంపై అభిప్రాయ సేకరణ

ఏపీ, తెలంగాణలో 24 లక్షల హెక్టార్ల భూమి అదనంగా సాగులోకి!


 

 సాక్షి, న్యూఢిల్లీ: జీవనదుల అభివృద్ధి పథకం కింద మహానది, గోదావరి, కృష్ణా, కావేరి నదులను అనుసంధానించాలని కేంద్రం యోచిస్తోంది. హిమాలయాలేతర జీవ నదుల అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 18 లక్షల హెక్టార్లు, తెలంగాణలో 6 లక్షల హెక్టార్ల భూమి అదనంగా సాగులోకి వస్తుందని అంచనా. అలాగే ఏపీలో 552 మెగావాట్లు, తెలంగాణలో 975 మెగావాట్ల జలవిద్యుత్‌కు నీటి లభ్యత ఉంటుంది. ఢిల్లీలో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ‘జల్ మంథన్’లో శుక్రవారం నదుల అనుసంధానంపై చర్చ జరిగింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నాలుగు నదుల అనుసంధానాన్ని ప్రస్తావించింది. మహానది (మణిభద్ర రిజర్వాయర్)-గోదావరి (ధవళేశ్వరం), గోదావరి (ఇచ్చంపల్లి)- కృష్ణా (పులిచింతల), గోదావరి (ఇచ్చంపల్లి)- కృష్ణా (నాగార్జునసాగర్), గోదావరి (పోలవరం)-కృష్ణా (విజయవాడ), కృష్ణా (ఆల్మట్టి)-పెన్నా, కృష్ణా (శ్రీశైలం)-పెన్నా, కృష్ణా (నాగార్జునసాగర్)- పెన్నా (సోమశిల), పెన్నా (సోమశిల)-కావేరి (గ్రాండ్ ఆనికట్) ... అనుసంధాన ప్రతిపాదనల్లో ఉన్నాయి.

 

 

లబ్ధి ఇలా...

మహానది (మణిభద్ర)- గోదావరి (ధవళేశ్వరం) అనుసంధానంతో ఏపీ, ఒడిశాల్లో 4.43 లక్షల హెక్టార్లకు అదనంగా సాగు నీరు అందుతుంది. 802 మిలియన్ క్యూబిక్ మీటర్ల (ఎంసీఎం) నీటి లభ్యత ఉంటుంది. 445 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం. 

గోదావరి (ఇచ్చంపల్లి)-కృష్ణా (పులిచింతల) అనుసంధానం ద్వారా.. ఏపీ, తెలంగాణల్లో 6.13 లక్షల హెక్టార్ల అదనపు సాగుకు అవకాశం. 

గోదావరి (ఇచ్చంపల్లి)- కృష్ణా (నాగార్జునసాగర్) అనుసంధానంతో.. తెలంగాణలో 2.87 లక్షల హెక్టార్ల భూమి అదనంగా సాగులోకి వస్తుంది.

 

గృహాలు, పరిశ్రమలకు 237 ఎంసీఎంల నీటిని సరఫరా చేయవచ్చు. 975 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తికి అవకాశం.

గోదావరి (పోలవరం)-కృష్ణా (విజయవాడ) అనుసంధానం ద్వారా ఏపీలో 5.82 లక్షల హెక్టార్ల సాగు పెరగడంతో పాటు గృహాలు, పరిశ్రమలకు 162 ఎంసీఎంల నీటిని సరఫరా చేయవచ్చు.

కృష్ణా (ఆల్మట్టి)-పెన్నా అనుసంధానంతో ఏపీలో 1.09 లక్షల హెక్టార్లు, కర్ణాటకలో 0.6 లక్షల హెక్టార్లకు అదనంగా సాగు నీరు అందుతుంది. గృహాలు, పరిశ్రమలకు 56 ఎంసీఎంల నీటి సరఫరాకు అవకాశం. 

కృష్ణా (శ్రీశైలం)-పెన్నా నది అనుసంధానంతో ఏపీలో 17 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తికి నీటి లభ్యత ఉంటుంది.

 

కృష్ణా (నాగార్జునసాగర్)-పెన్నా (సోమశిల) అనుసంధానంతో ఏపీలో 5.81 లక్షల హెక్టార్లకు అదనంగా సాగునీరు అందడంతో పాటు గృహ, పారిశ్రామిక అవసరాలకు 124 ఎంసీఎంల నీటి లభ్యత ఉంటుంది. 90 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తికి అవకాశం.

పెన్నా (సోమశిల)-కావేరీ (గ్రాండ్ ఆనికట్) అనుసంధానంతో ఏపీలో 0.49 లక్షల హెక్టార్లకు అదనంగా సాగునీరు అందుతుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top