
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం–1956లోని సెక్షన్–3 ప్రకారం విచారించేలా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ వినతిపై కేంద్ర జల శక్తి శాఖ న్యాయ శాఖ సలహా కోరినట్లు తెలిసింది. అపెక్స్ కౌన్సిల్‌లో ఇచ్చిన హామీ మేరకు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను తెలంగాణ ఉపసంహరించుకున్న నేపథ్యంలో దీనిపై ఏవిధంగా ముందుకెళ్లాలో తెలపాలని న్యాయ శాఖ కార్యదర్శి అనూప్‌కుమార్‌కు జలశక్తి శాఖ కార్యదర్శి లేఖ రాసినట్లుగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర న్యాయ శాఖ ఇచ్చే సూచనల మేరకు జలశక్తి శాఖ ఈ విషయంలో ముందుకు వెళ్లనుంది.
కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్–2 ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను.. విభజన చట్టంలోని సెక్షన్–89 ప్రకారం కాకుండా అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టంలోని సెక్షన్–3 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు పంపిణీ చేసేలా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని గత నెల 16న రాష్ట్రం కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే, న్యాయ నిపుణుల సలహాతో ట్రిబ్యునల్ ఏర్పాటుపై తగిన చర్యలు తీసుకుంటామని అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ సమావేశంలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఇచ్చిన హామీని లేఖలో తెలంగాణ ప్రస్తావించింది.