
రూ.40.91 లక్షల పరిహారం ఇవ్వాలని ట్రిబ్యునల్ తీర్పు
న్యూఢిల్లీ: 2018లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం కారణంగా అబార్షన్ అయిన మహిళ(41)కు పరిహారంగా రూ.40.91 లక్షల పరిహారం చెల్లించాలని మోటారు వాహన ప్రమాదాల ట్రిబ్యునల్ తీర్పు వెలువరించింది. ఓ వ్యక్తి అజాగ్రత్తతో వేగంగా వాహనం నడిపి తనను ఢీకొట్టాడని అన్షు కశ్యప్ అనే మహిళా టీచర్ ఫిర్యాదు చేశారు. ఈమె అప్పటికే మరుగుజ్జుతనం కారణంగా 40 శాతం వైక్యలంతో ఉన్నారు. ప్రమాదం వల్ల ఆరు నెలల గర్భ విచ్ఛిత్తి జరగడంతోపాటు తన వైకల్యం శాతం 84 శాతానికి పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
విధులు నిర్వహించలేని స్థితికి చేరుకున్నానన్నారు. కేసును పరిశీలించిన ప్రిసైడింగ్ అధికారి షెల్లీ అరోరా..‘ఆమె వయస్సు, శారీరక వైకల్య తీవ్రత, మరోసారి గర్భం దాల్చేందుకు తక్కువగా ఉండే అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆమె ప్రస్తుతం సొంతంగా ఎక్కడికీ వెళ్లలేని స్థితిలోకి చేరుకున్నారని వివరించారు. ఆమెకు అన్ని విధాలుగా కలిగిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకుంటూ రూ.40.91 లక్షలు పరిహారంగా ఇవ్వాలని వాహన బీమా కంపెనీ అయిన ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్‌కు ఆదేశాలు జారీ చేశారు.