సిద్ధూ రాజీనామాపై తుది నిర్ణయం నాదే..

Captain Amarinder Singh received Sidhu's resignation letter - Sakshi

సాక్షి, చండిఘడ్‌ : నవ్‌జోత్‌సింగ్‌ సిద్ధూ రాజీనామా లేఖ అందిందని, అయితే దాన్ని చదివాకే నిర్ణయం తీసుకుంటానని పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ వ్యాఖ్యానించారు.  ముఖ్యమంత్రితో సఖ్యత కుదరక ప్రముఖ మాజీ క్రికెటర్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నవ్‌జోత్‌సింగ్‌ సిద్ధూ ఆదివారం మంత్రి పదవికి రాజీనామ చేసిన సంగతి తెలిసిందే. అయితే సిద్ధూ జులై 10న రాజీనామా లేఖను రాహుల్‌గాంధీకి సమర్పించారు. ఆదివారం తన రాజీనామాపై ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. చివరిగా ముఖ్యమంత్రికి పంపారు. తన రాజీనామను చివరిగా ముఖ్యమంత్రికి పంపడంతోనే వీరి మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోంది. సిద్ధూ రాజీనామాపై అమరీందర్‌సింగ్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రిని నేనే కాబట్టి తుది నిర్ణయం నాదేనని, ఆ లేఖను చదివాకే స్పందిస్తానన్నారు. 

పంజాబ్‌లో కాంగ్రెస్‌పార్టీ గెలిచినప్పటి నుంచి సిద్ధూ, అమరీందర్‌ల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నట్లు పలు కథనాలు వచ్చాయి. రాజకీయ నాయకుడిగా మారిన ఈ మాజీ క్రికెటర్‌ సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్నాడు. కానీ చివరికి ముఖ్యమంత్రి పదవి కెప్టెన్‌కు వరించడంతో వీరి మధ్య చీలికలు మొదలయ్యాయి. అప్పటినుంచే ఉప్పు నిప్పులా ఉన్న వీరికి భారత్‌ పాక్‌ల మధ్య సిద్ధు వివాదాల తర్వాత మరింత దూరం పెరిగింది. తనకు కెప్టెన్‌ రాహుల్‌ గాంధీయేనని, తన కెప్టెన్‌(సీఎం)కు కూడా ఆయనే కెప్టెన్‌ అంటూ గత ఏడాది  సిద్ధూ వ్యాఖ్యానించడం తీవ్ర విభేదాలకు ఆజ్యం పోసింది. 

ఈ ఘటనల మధ్యనే పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ జూన్‌ 6వ తేదీన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఇందులో భాగంగా పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాలు, స్థానిక పాలన శాఖల బాధ్యతల నుంచి సిద్ధూను తప్పించి ఇంధనం, పునర్వినియోగ ఇంధన శాఖలను కేటాయించారు. దీంతోపాటు పలు ప్రభుత్వ కమిటీల్లో సిద్దూకు స్థానం కల్పించలేదు. ఈ పరిణామాలతో తీవ్ర అసంతృప్తి చెందిన సిద్దూ గత నెల 9వ తేదీన కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీని కలిసి, పరిస్థితిని వివరించడంతోపాటు ఒక లేఖను కూడా అందజేసినట్లు సమాచారం. అప్పటి నుంచి ఆయన తనకు కేటాయించిన కొత్త మంత్రిత్వశాఖల బాధ్యతలను చేపట్టలేదు. 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top