రోడ్లకు 7లక్షల కోట్లు

Cabinet Clears Rs. 7 Lakh Crore Investment For Highway Projects - Sakshi

భారత్‌మాల సహా.. 83,677 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం

భారీ ప్రాజెక్టుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదం

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక భారత్‌మాల ప్రాజెక్టు, ఇతర జాతీయ రహదారుల నిర్మాణం కోసం రూ. 7 లక్షల కోట్ల విడుదలకు ఆమోదముద్ర పడింది.  మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఈఏ) ఈ భారీ ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపింది. భారత్‌మాల ప్రాజెక్టులో దేశ సరిహద్దులతోపాటుగా కోస్తా, ఇతర ప్రాంతాలను కలుపుతూ (దాదాపు 50 వేల కిలోమీటర్లు) జాతీయ రహదారులను నిర్మించనున్నారు.

ఈ ప్రాజెక్టును కలుపుకుని ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 83,677 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించాలని మోదీ ప్రభుత్వం సంకల్పిస్తోంది. మంగళవారం కేబినెట్‌ ఆమోదం పొందిన ప్రాజెక్టుల్లో కార్గోలు వేగవంతంగా చేరేలా ఎకనమిక్‌ కారిడార్‌ల అభివృద్ధి కూడా ఉంది. ఈ ఎకనమిక్‌ కారిడార్లలో ముంబై–కొచ్చిన్‌–కన్యాకుమారి, బెంగళూరు–మంగళూరు, హైదరాబాద్‌–పణజీ, సంబల్‌పూర్‌–రాంచీ వంటి 44 ప్రాజెక్టులున్నాయి.

భారత్‌మాల ప్రాజెక్టుల తొలి దశలో 20 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఇటీవలే వెల్లడించారు. భారత్‌మాల ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యేందుకు 10 లక్షల కోట్లు ఖర్చవుతాయని కేంద్రం అంచనా వేసింది.

అనుసంధానత, ఉపాధి కల్పన
మౌలిక వసతులను పెంచటం ద్వారా ఉపాధి కల్పన, ఆర్థిక ప్రగతి పెంచాలనేది ప్రభుత్వ ఆలోచన అని, అందుకు భారీగా నిధులను కేటాయిస్తున్నామని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. సమర్థవంతమైన రవాణా కోసం రోడ్ల రంగంలో ఉన్న ప్రతిబంధకాలను ప్రభుత్వం తొలగించిందని జైట్లీ తెలిపారు. దీని ద్వారా భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. 2021–22 నాటికి ఈ ప్రతిపాదిత భారత్‌మాల ప్రాజెక్టు పనులను ఎన్‌హెచ్‌ఏఐ, ఎన్‌హెచ్‌ఐడీసీఎల్, మోర్త్, రాష్ట్రాల పీడబ్ల్యూడీ శాఖల సహకారంతో పూర్తి చేస్తామన్నారు.

‘ఈ ప్రాజెక్టు కోసం రూ.2.09 లక్షల కోట్లను మార్కెట్‌ నుంచి సేకరించనున్నాం. రూ.1.06 లక్షల కోట్లను ప్రైవేట్‌ పెట్టుబడులు (పీపీపీ ద్వారా), రూ.2.19 లక్షల కోట్లను సెంట్రల్‌ రోడ్‌ ఫండ్, టీవోటీ మానిటైజేషన్, ఎన్‌హెచ్‌ఏఐ టోల్‌ కలెక్షన్ల ద్వారా సేకరిస్తాం’ అని ప్రభుత్వం తెలిపింది. భారత్‌మాల ప్రాజెక్టు.. గతంలో ఎన్నడూ లేనట్లుగా భారత్‌ను అనుసంధానం చేస్తుందని ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది.

ఇందులో భాగంగా 9వేల కిలోమీటర్ల ఎకనమిక్‌ కారిడార్లు, 6వేల కిలోమీటర్ల ఇంటర్‌ కారిడార్, 5వేల కిలోమీటర్ల నేషనల్‌ కారిడార్‌ల సామర్థ్యం పెంపు.. 2వేల కిలోమీటర్ల సరిహద్దు అనుసంధానత, 800 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వేలు, 10వేల కిలోమీటర్ల మేర మిగిలిన జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టునకు రూ.5.35లక్షల కోట్లు ఖర్చవుతుందని వెల్లడించింది. 6 ఐఐటీలకు క్యాంపస్‌ల నిర్మాణం కోసం రూ.7వేల కోట్ల విడుదలకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది. ఇందులో తిరుపతి, పాలక్కడ్, ధార్వాడ్, జమ్మూ, భిలాయ్, గోవా ఐఐటీలున్నాయి.

గోధుమలు, పప్పుధాన్యాల మద్దతు పెంపు
పెరుగుతున్న ఆహారోత్పత్తుల ధరలను అదుపులోకి తెచ్చేందుకు వీటి ఉత్పత్తిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 2017–18 రబీ సీజన్‌లో పలు పంటల కనీస మద్దతు ధరను పెంచుతూ సీసీఈఏ నిర్ణయం తీసుకుంది. గోధుమల కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.110 పెంచగా.. కందిపప్పుపై క్వింటాలుకు రూ.400, మసూర్లపై క్వింటాలుకు రూ. 300 పెంచినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధా మోహన్‌ సింగ్‌ పేర్కొన్నారు.

ఈ నిర్ణయంతో  రబీ సీజన్‌లో ఉత్పత్తి పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. పెరిగిన మార్పులతో క్వింటాలు గోధుమలకు రూ. 1,735లు చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. మారిన ధరలతో కందిపప్పుకు రూ.4,400, మసూర్లకు రూ.4,250 లను ప్రభుత్వం చెల్లించనుంది.

ఆవాలు, కుసుమ నూనె ఉత్పత్తిని పెంచేందుకు వీటి కనీస మద్దతు ధరను కూడా గణనీయంగా పెంచింది. ఆవాలు క్వింటాలుకు రూ.300 (మొత్తం ధర రూ.4 వేలు), కుసుమలపై క్వింటాలుకు రూ.400 (మొత్తం ధర రూ.4,100), బార్లీ మద్దతు ధరను క్వింటాలుకు రూ. 85 పెంచినట్లు మంత్రి తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top