వినూత్న నిరసన తెలిపిన పెళ్లికొడుకు

Bride Groom Arrived Wedding Hall With Anti CAA Card In Kerala - Sakshi

తిరువంతనంతపురం: నిరసనలు రోజుకో రూటు మారుతున్నాయి. మౌనదీక్ష, రాస్తారోకో, రైల్‌రోకో, వంటావార్పు, బైఠాయింపు, నిరాహార దీక్ష, ర్యాలీ ఇలా ఎన్నోరకాలుగా జనాలు తమ వ్యతిరేకతను తెలుపుతూ ఉంటారు. కానీ ఓ పెళ్లికొడుకు వినూత్న నిరసనతో పెళ్లిమండపానికి హాజరైన ఘటన సోమవారం కేరళలో జరిగింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)లను వ్యతిరేకిస్తూ కొన్నినెలలుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. కేరళకు చెందిన వ్యాపారి హజా హుస్సేన్‌ సైతం వీటిని తీవ్రంగా వ్యతిరేకించేవాడు. కాగా ఆయనకు సోమవారం వివాహం జరగనుంది. (కేరళ: నల్లాల్లో మద్యం వరద..!)

ఈ నేపథ్యంలో పెండ్లి కొడుకుగా ముస్తాబైన హుస్సేన్‌.. తిరువంతనపురం నుంచి వాజిముక్కు(వివాహం జరిగే ప్రాంతం) వరకు సుమారు 20 కిలోమీటర్లు ఒంటెపై ఊరేగింపుగా బయలుదేరాడు. ఆ సమయంలో ‘సీఏఏ, ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌లను వ్యతిరేకిద్దాం’ అన్న ప్లకార్డును చేతపూని నిరసన తెలిపాడు. అతనితోపాటు స్నేహితులు, బంధుగణం అంతా కలిసి వెళ్లడంతో రహదారులపై స్వల్ప రద్దీ కనిపించింది. ఈ వినూత్న నిరసనపై ఆయన మాట్లాడుతూ.. సీఏఏపై తన వ్యతిరేకతను ప్రదర్శించడానికే ఈ మార్గాన్ని ఎంచుకున్నానని తెలిపాడు. ఈ చట్టాన్ని నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాడు. ఈ పెండ్లికొడుకు తన భార్యకు కట్నకానుకలతోపాటు రాజ్యాంగం ప్రతిని కూడా అందించడం విశేషం. (‘భారత్‌ ఇష్టం లేదంటే.. పాకిస్తాన్‌ ఉందిగా’)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top