తల్లి పాలకు ఓ బ్యాంక్ వస్తోంది

brest feeding bank in banglore

సాక్షి, బెంగళూరు : బ్లడ్‌ బ్యాంక్, ఐ బ్యాంక్, చివరికి స్కిన్‌ బ్యాంక్‌ గురించి కూడా విన్నాం. కానీ నగరంలో మొట్టమొదటి సారిగా తల్లి పాల కోసం ఓ బ్యాంక్‌ ఏర్పాటు కాబోతోంది. తల్లి పాలు చిన్నారి పూర్తి శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనవి. అంతేకాదు చిన్నారిలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు పూర్తి మానసిక వికాసానికి కూడా అవసరం. అయితే అందరు చిన్నారులు తల్లిపాలను పొందలేరు. కొంతమంది తల్లుల్లో పాలు చాలా తక్కువగా ఉండడంతో బిడ్డలకు వాటిని అందించలేరు. అంతేకాదు తల్లులు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో కూడా బిడ్డలకు పాలిచ్చేందుకు ఆస్కారం ఉండదు. అలాంటి చిన్నారులకు సైతం అమృతంలాంటి తల్లిపాలను అందజేసేందుకు ఈ తల్లి పాల బ్యాంక్‌ నగరంలో ఏర్పాటవుతోంది.

బ్రెస్ట్‌ మిల్క్‌ ఫౌండేషన్‌ నేతృత్వంలో..
ప్రతి చిన్నారికి తల్లిపాలను అందజేసే లక్ష్యంతో పనిచేస్తున్న ‘బ్రెస్ట్‌ మిల్క్‌ ఫౌండేషన్‌’ సంస్థ ఫోర్టిస్‌ లా ఫెమ్మె సంస్థతో కలిసి నగరంలో ఈ తల్లిపాల బ్యాంక్‌ను ఏర్పాటు చేయనుంది. నగరంలో మొట్టమొదటి సారిగా తల్లిపాల బ్యాంక్‌ను ఈ సంస్థ ఏర్పాటు చేస్తోంది. ఈనెల 10న ఈ బ్యాంక్‌ లాంఛనంగా ప్రారంభం కానుంది. ‘అమరా’ బ్రాండ్‌ నేమ్‌తో ఈ తల్లిపాలు అందుబాటులోకి రానున్నాయి. ఎవరైతే తమ బిడ్డకు తల్లిపాలను అందజేసేందుకు ఇబ్బంది పడుతున్నారో అటువంటివారు ఈ బ్యాంకు నుండి బిడ్డకు అవసరమైన తల్లిపాలను తీసుకునేందుకు నిర్వాహకులు అవకాశం కల్పిస్తున్నారు.

ఎలా సేకరిస్తారు..
ఇక ఈ బ్యాంక్‌లో తల్లి పాలను భద్రపరిచేందుకుగాను తల్లిపాలను సేకరించే విధానం కూడా చాలా జాగ్రత్తలతో కూడుకొని ఉంటుంది. ముందుగా సేకర్త రక్తనమూనాలను సేకరించి, వారు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా? లేదా? హెచ్‌ఐవీ వంటి సమస్యలు ఏవైనా ఉన్నాయా? వారికి ధూమపానం, మధ్యపానం వంటి అలవాట్లు ఏవైనా ఉన్నాయా? వంటి పరీక్షలన్నింటిని నిర్వహిస్తారు. తర్వాత తన బిడ్డకు పాలను ఇవ్వాల్సిందిగా చెప్పి బిడ్డ పాలను తాగిన తర్వాత బ్రెస్ట్‌ పంప్‌ ద్వారా మిగిలిన పాలను సేకరిస్తారు. ఇక మైక్రోబయాలజీకి సంబంధించిన అన్ని పరీక్షల ఫలితాలు వెల్లడయ్యే వరకు పాలను పాశ్చరైజ్‌ చేసి 20డిగ్రీల వద్ద భద్రపరుస్తారు. ఫలితాలన్నీ సానుకూలంగా ఉంటే ఆ పాలను 30 ఎం.ఎల్‌ చొప్పున ప్యాకెట్‌లుగా మార్చి తల్లిపాలు అవసరమైన బిడ్డలకు ఉచితంగా అందజేస్తారు.

దానం చేయడం ద్వారా పాలు తగ్గుతాయా?
తల్లిపాల బ్యాంకుకు తమ పాలను దానం చేస్తే ఎక్కడ పాలు తగ్గిపోతాయో అని భయపడాల్సిన అసవరం లేదని వైద్యులు చెబుతున్నారు. ఈ విషయం పై అమరా సంస్థ ప్రతినిధి డాక్టర్‌ అంకిత్‌ శ్రీవాత్సవ మాట్లాడుతూ....‘సాధారణంగా ఆరోగ్యవంతురాలైన తల్లి తన బిడ్డకు పూర్తి స్థాయిలో పాలను ఇచ్చిన తర్వాత కూడా మరో ముగ్గురు బిడ్డలకు పాలిచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల పాలను దానం చేయడం ద్వారా తమ బిడ్డకు పాలు తక్కువవుతాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఎంత ఎక్కువగా పాలను ఇస్తూ ఉంటే అంతగా పాలు ఉత్పత్తి అవుతాయన్న విషయాన్ని కూడా తల్లులు తెలుసుకోవాలి’ అని వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top