సాక్షి,బెంగళూరు: గుండెను మెలిపెట్టే ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషాద ఘటనలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఉన్నత ఉద్యోగి ఒక్కగానొక్క కుమార్తె మరణించిన తర్వాత కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసేందుకు లంచాలు ఇచ్చారు. అంబులెన్స్ డ్రైవర్ నుంచి ఉన్నతస్థాయి పోలీసు అధికారి వరకు ఎలా లంచాలు అడిగారో? అందుకు తాను లంచాలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో?లింక్డిన్ పోస్టులో సుదీర్ఘంగా వివరించారు. ఆ పోస్టును కొద్దిసేపటికే డిలీట్ చేశారు. అప్పటికే ఆ పోస్టు వైరల్‌గా మారింది.
ఆ లింక్డిన్ పోస్టులో..బెంగళూరులో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)కె.శివకుమార్ కుమార్తె అక్షయ శివకుమార్(34). కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్, అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ప్రముఖ పెట్టుబడుల సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ ఎనిమిదేళ్లు పనిచేశారు. ఇతర సంస్థల్లో మూడేళ్లు పనిచేశారు.
అయితే ఈ క్రమంలో వర్క్‌ఫ్రమ్ హోమ్‌లో విధులు నిర్వహిస్తున్న అక్షయ గతనెల సెప్టెంబర్ 18 మెదడు రక్తస్రావం కారణంగా ఇంట్లోనే మరణించారు. అక్షయ మరణించిన తర్వాత అధికారిక లాంఛనాలను పూర్తి చేశారు. ఆ సమయంలో పలువురు తన వద్ద నుంచి లంచం డిమాండ్ చేశారని, మరికొందరు తనపట్ల దారుణంగా వ్యవహరించారని వాపోయారు.
— DCP Whitefield Bengaluru (@dcpwhitefield) October 30, 2025
‘నా కుమార్తె మరణం తర్వాత..అవసరమైన ఫార్మాలటీస్‌లను పూర్తిచేసేందుకు అవసరమైన పత్రాలను పొందడానికి అంబులెన్స్ ఆపరేటర్ నుంచి పోలీసు అధికారుల వరకు..శ్మశానవాటిక నుంచి బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) కార్యాలయ సిబ్బంది వరకు దాదాపు అందరికీ లంచాలు చెల్లించాల్సి వచ్చింది.
పోలీస్ స్టేషన్‌లో కూడా తనను నగదు రూపంలో చెల్లించమని బలవంతం చేశారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్,పోస్టుమార్టం నివేదిక కాపీని ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం పోలిస్‌స్టేషన్ చుట్టూ నాలుగు రోజులు తిరిగాం. పనికాలేదు. పోలీసులు స్టేషన్‌లోని బహిరంగంగా నన్ను లంచం డిమాండ్ చేశారు. ఆ లంచాన్ని కూడా పోలిస్ స్టేషన్‌లోనే ఇచ్చారు. నేను నా ఏకైక బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఖంతో ఉంటే.. ఈ సమాజం సానుభూతి లేకుండా నన్ను లంచం పేరుతో కాల్చుకు తిన్నది. ఇది దారుణం. నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను చెల్లించాను. మరి పేదల పరిస్థితి ఏంటి?
నా కుమార్తె భౌతికకాయాన్ని కసవనహళ్లిలోని ఓ ఆస్పత్రి నుంచి కోరమంగళలోని సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలించాల్సి ఉంది. ఇందుకోసం అంబులెన్స్ డ్రైవర్ రూ.3వేలు డిమాండ్ చేశాడు. పోలీసుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాపట్ల కుమార్తె చనిపోయిందన్న కనికరం కూడా చూపించలేదు పోలీసు అధికారులు లంచం అడిగారు. అసభ్యంగా మాట్లాడారు. ‘(తన గురించి మాట్లాడుతూ..)ఒక వ్యక్తి ఇప్పటికే మానసికంగా కుంగిపోయి, భావోద్వేగంగా తల్లడిల్లుతున్న సమయంలో పోలీసులు డబ్బులు డిమాండ్ చేయడం,నిర్లక్క్ష్యంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం. వాళ్లకు కుటుంబం లేదా? వారికి బావోద్వేగాలు ఉండవా?
ఇది అక్కడితో ఆగలేదు. బీబీఎంపీ నుంచి డెత్ సర్టిఫికెట్ పొందడానికి చాలా ఇబ్బంది పడ్డా. డెత్ సర్టిఫికెట్ కోసం బీబీఎంపీ కార్యాలయానికి ఐదురోజుల పాటు కాళ్లరిగేలా తిరగా. కొనసాగుతున్న ‘కుల సర్వే’ కారణంగా ఎవరూ అందుబాటులో లేరు. చివరికి బీబీఎంపీ సీనియర్ అధికారిని సంప్రదించిన తర్వాతే డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇందుకోసం సదరు అధికారి నా వద్ద నుంచి ప్రభుత్వం నిర్ధేశించిన రుసుము కంటే ఎక్కువ మొత్తంలో వసూలు చేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
చివరిలో.. ఈ అరాచకం నుంచి బెంగళూరును రక్షించగలరా? నారాయణ మూర్తి, అజీమ్ ప్రేమ్‌జీ, మజుందార్ షాలు బిలియన్ల కొద్దీ డబ్బున్న పెద్దలు ఈ నగరాన్ని రక్షించగలరా? వారు చాలా మాట్లాడతారు కానీ...అని ముగించారు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బెంగళూరు వైట్‌ఫీల్డ్ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. శివకుమార్ ట్వీట్‌లో పేర్కొన్న సంఘటనకు సంబంధించి, బెల్లందూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ పీఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి అసభ్యకరమైన లేదా అనుచితమైన ప్రవర్తనను సహించదు’అని పోలీసులు తెలిపారు.


