జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ, పీడీపీ పోటాపోటీగా దూసుకుపోతున్నాయి.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ, పీడీపీ పోటాపోటీగా దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం ఇరు పార్టీలు చెరో 23 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. అయితే ఆ రాష్ట్రంలో బీజేపీ, పీడీపీ ఒక్కో ప్రాంతానికే పరిమితం కావడం గమనార్హం. జమ్మూలో బీజేపీ దాదాపు మూడింటి రెండొంతుల స్థానాల్లో సత్తాచాటగా, కశ్మీర్లో పీడీపీ సగం స్థానాల్లో సొంతం చేసుకోనుంది. కశ్మీర్లో బీజేపీ కేవలం రెండు స్థానాల్లో, జమ్మూలో పీడీపీ కూడా రెండు చోట్ల మాత్రమే ముందంజలో ఉన్నాయి.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో 87 సీట్లుండగా, జమ్మూలో 37, కశ్మీర్లో 46 నియోజకవర్గాలున్నాయి. లడఖ్ ప్రాంతంలో 4 ఉన్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ మూడు, నాలుగు స్థానాలకు పరిమితమైనా.. .. రెండు ప్రాంతాల్లోనూ చెప్పుకోదగ్గ స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇక లడఖ్ ప్రాంతంలో నాలుగు పార్టీలు ఒక్కో స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.