
బాధితుల బాధలను వివరిస్తూ ఓ ఎన్జీవో స్ట్రీట్ ప్లే
భోపాల్: 1984 డిసెంబరు 2 అర్ధరాత్రి భోపాల్ వాసులకు కాళరాత్రి. మధ్యప్రదేశ్ రాజధాని నగరంలో యూనికార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి విడుదలైన భయంకర విషవాయువు వేల మందిని పొట్టనబెట్టుకుని, లక్షలాది మంది జీవితాల్లో చీకట్లు నింపింది. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి విడుదలైన మిథైల్ ఐసోసైనేట్ వాయువు కారణంగా లక్షలాది మంది జీవచ్చవాలుగా మారారు.
ఈ ఘటన జరిగి శనివారంనాటికి 33 ఏళ్లు పూర్తయినా దీని ప్రభావం మాత్రం ఇంకా కొనసాగుతోంది. నేటి తరం పిల్లలపై కూడా దుష్ప్రభావం కనిపిస్తూనే ఉంది. ఈ దుర్ఘటన బాధితులకు ఇప్పటికి కూడా సరైన వైద్య, వసతి సదుపాయాలు, ఉపాధి కల్పించకపోవడం గమనార్హం. నాడు విషవాయువు ప్రభావంతో పిల్లల అవయవాలు సక్రమంగా పనిచేయక నరకయాతన అనుభవించారు. నేటికీ అనుభవిస్తున్నారు.
పుట్టే బిడ్డనూ వదలని ‘విషం’..
ఇక మహిళల సంగతి మరీ దారుణంగా ఉంది. ఈ వాయువు వల్ల కొత్తగా పెళ్లైన మహిళలకు రోజులు గడిచేకొద్దీ అనారోగ్య సమస్యలు తలెత్తడంతో వారిని అత్తింటి వారు నిర్దాక్షిణ్యంగా గెంటేశారు. విష వాయువు కారణంగా రోగాల బారినపడి ఇప్పటికీ అక్కడి వారికి వివాహాలు జరగడం లేదు. వివాహం జరిగినా సంతానం లేమి, ఒకవేళ గర్భం దాల్చినా పుట్టిన బిడ్డల ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతోంది. బాధితుల్లో చాలా మంది తల్లిదండ్రులను, పిల్లలను కోల్పోయారు. 33 ఏళ్లు గడుస్తున్నా బాధితులకు సరైన న్యాయం జరగలేదు.
తప్పించుకున్న కారకులు..
ప్రధాన నిందితుడు, కర్మాగారం యజమాని ఆండర్సన్ పట్టుబడినా, చాకచక్యంగా తప్పించుకున్నాడు.మరోవైపు ఆండర్సన్‌ను అప్పగించాల్సిందిగా ఆరేళ్ల కిందట భారత్ చేసిన అభ్యర్థనను అమెరికా తోసిపుచ్చింది. ఒక్కో బాధితుడికి పరిహారం కింద కేవలం రూ.25 వేలు ఇచ్చి ప్రభుత్వాలు చేతులు దులుపుకున్నాయి. ఈ ఘటనకు కారణమైన ఏ ఒక్కరినీ ఇప్పటివరకూ శిక్షించలేదని, తమ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతటి నిర్లక్ష్యంగా వ్యవహరించాయో ఇదే నిదర్శనమని బాధితులు వాపోతున్నారు. ఈ ఘటనలో కేవలం 3000 మంది మాత్రమే మరణించారని అధికారికంగా ప్రకటించినా, ఈ సంఖ్య 25 వేల వరకు ఉంటుందని అంచనా.