బీమా కొరెగావ్‌ అల్లర్ల వెనుక..

Bhima Koregaon Riots Accused Organised Lectures In JNU - Sakshi

సాక్షి, పూణే : బీమా కొరెగావ్‌ అల్లర్లకు సంబంధించి పోలీసులు అరెస్ట్‌ చేసిన నలుగురు నిందితుల విచారణలో పలు అంశాలు వెలుగుచూస్తున్నాయి. వీరు ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జేఎన్‌యూలో పలుమార్లు ఉపన్యాసాలు ఏర్పాటు చేశారని, తమ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు విద్యార్థులను నియమించకునేందుకు ప్రయత్నించారని అధికారులు వెల్లడించారు. నిందితులు సుధీర్‌ ధావలె, మహేష్‌ రౌత్‌, షోమా సేన్‌, రోనా విల్సన్‌లు ఓ ఎన్‌కౌంటర్‌లో మరణించిన నక్సలైట్‌కు సంబంధించి స్మారక ఉపన్యాసాల పేరిట పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారని పూణే పోలీసులు గురువారం కోర్టుకు నివేదించినట్టు తెలిసింది. నిషేధిత సీపీఐ(మావోయిస్టు)లో చేరేందుకు విద్యార్థులను ప్రేరేపించారని పోలీసులు ఆరోపిస్తున్నారు.

మావోయిస్టు ఉద్యమంలో చేరాల్సిందిగా విద్యార్థులను కోరడం కుట్రపూరితమని నిందితుల కస్టడీని కోరుతూ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఉజ్వల పవార్‌ అడిషనల్‌ సెషన్స్‌ జడ్జ్‌ కేడీ వధానే దృష్టికి తీసుకువచ్చారు. వీరి చర్యలు జాతీయ భద్రతకు పెను విఘాతమని, దీనిపై లోతైన విచారణ అవసరమని ఆయన న్యాయమూర్తికి నివేదించారు.

నిందితులందరూ జాతి విద్రోహ కార్యకలాపాల్లో పాల్గొన్నట్టు తాము స్వాధీనం చేసుకున్న పత్రాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలను చేపట్టేందుకు నిధులు సమకూర్చుకున్నారని, ఢిల్లీలోని నిందితుడు విల్సన్‌ ఇంటిలో సోదాలు నిర్వహించిన క్రమంలో పోలీసులు రూ 80,000 నగదు స్వాధీనం చేసుకున్నారని కోర్టుకు వివరించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు వివరాలను వెల్లడించేందుకు విల్సన్‌ నిరాకరిస్తున్నాడని చెప్పారు. బీమా కోరెగావ్‌ అల్లర్లకు సంబంధించి నలుగురు నిందితులను ఈనెల 6న పూణే పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top