‘ఆమె’ కోసం దేశవ్యాప్తంగా గాలింపు | Sakshi
Sakshi News home page

‘ఆమె’ కోసం దేశవ్యాప్తంగా గాలింపు

Published Tue, Mar 6 2018 9:24 AM

Bharati Ghosh: Once Mamata Government Top Cop Now Most Wanted - Sakshi

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వంలో సూపరిటెండెంట్‌ ఆఫ్‌ పోలీసుగా విధులు.. మావోయిస్ట్‌ ప్రభావితం ప్రాంతం మిడ్నాపూర్‌లో కూడా కీలక పోలీసాఫీసర్‌. కానీ ప్రస్తుతం ఆమె మోస్ట్‌ వాంటెడ్‌ . దీంతో సీఐడీ ఆమె కోసం దేశమంతా జల్లెడ వేసి మరీ వెతుకుతోంది. కానీ ఆచూకీ మాత్రం లభ్యం కావడం లేదు. ఆమెనే భారతీ ఘోష్‌. లెక్కల్లో చూపని ఆస్తుల కేసులో భారతీ ఘోష్‌ బుక్కయ్యారు. దీంతో అప్పటి నుంచి భారతీ ఘోష్‌, ఆమె భర్త ఎంఏవీ రాజు, వ్యక్తిగత గార్డుగా ఉన్న కానిస్టేబుల్‌ తో సహా ఆదృశ్యమైపోయారు.  

ఘోష్‌ కేవలం ఆడియో మెసేజ్‌ల ద్వారా మీడియాను కాంటాక్ట్‌ అవుతున్నారు. కానీ ఆ మెసేజ్‌లు ఎక్కడి నుంచి పంపుతున్న ప్రాంతాన్ని మాత్రం పోలీసులు గుర్తించలేకపోతున్నారు. ఈ మాజీ పోలీస్‌ ఆఫీసర్‌ విషయంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నిర్లక్ష్యం వహించవద్దంటూ.. సీబీఐ విచారణ జరుపాలంటూ విపక్షాలు బీజేపీ, కాంగ్రెస్‌లు పట్టుబడుతున్నాయి. డీమానిటైజేషన్‌ అనంతరం జరిపిన దాడుల్లో భారీ మొత్తంలో  బంగారు లావాదేవీలపై సమాచారంతో పాటు, సీనియర్‌ మావోయిస్ట్‌ నేత కిషన్జీ అలియాస్ కోటేశ్వరరావు మరణానికి సంబంధించి కీలక సమాచారం కూడా ఆమె వద్ద ఉన్నాయి. అంతేకాక ఘోస్‌ తన వద్ద ఉన్న కోట్ల రూపాయల నగదును కూడా లెక్కలో చూపలేదని, వాటిని సీజ్‌ చేసినట్టు సీఐడీ డీఐజీ(ఆపరేషన్స్‌) నిషాత్ పర్వేజ్ తెలిపారు. 

పశ్చిమ మిడ్నాపూర్‌కు చెందిన ఘటల్ సబ్‌ డివిజనల్‌ కోర్టులో ఫిబ్రవరి 1న చందన్‌ అనే వ్యక్తి  చేసిన ఫిర్యాదు మేరకు భారతీ ఘోష్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ పోలీసాఫీసర్‌కు వ్యతిరేకంగా చీటింగ్‌ కేసు నమోదు అయింది. రద్దయిన నోట్ల ద్వారా మొత్తం 375 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసాఫీసర్‌కి విక్రయించినట్లు చందన్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే వాటికి సంబంధించిన నగదు చెల్లించలేదని తన ఫిర్యాదులో తెలిపాడు. దీంతో గత నెల 7న పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అలాగే ఉత్తర 24 పర్‌గనాస్‌ నివాస్‌ యునల్‌ అలీ మండల్‌ అనే వ్యక్తి కూడా ఘటల్‌ కోర్టులో ఘోష్‌కు వ్యతిరేంగా ఫిర్యాదు చేశాడు.

ఈ రెండు ఫిర్యాదుల అనంతరం భారతీ ఘోష్‌కు చెందిన నివాసాలపై పశ్చిమ బెంగాల్‌లో పలు ప్రాంతాల్లో సీఐడీ తనిఖీలు చేపట్టింది. రూ.300 కోట్ల విలువైన 50 ఒరిజినల్‌ ల్యాండ్‌ సేల్‌ డీడ్స్‌, టాబ్లెట్లు, పెన్‌ డ్రైవ్‌లు, హార్డ్‌ డిస్క్‌లు, గోల్డ్‌ జువెల్లరీ, దిగుమతి చేసుకున్న 57 విస్కీ బాటిళ్లను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఘోష్‌ లాకర్స్‌లో 1.1 కేజీల గోల్డ్‌, 2 కోట్ల నగదు, కోల్‌కత్తాకు దగ్గర్లో మదుర్‌దహలో రూ.2.4 కోట్ల ఫ్లాట్‌ను సీజ్‌ చేశారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు పోలీసులు కూడా అరెస్ట్‌ అయ్యారు. వీరిలో ఘటల్‌కు చెందిన సబ్‌ ఇన్పెక్టర్‌ రాథ్‌, అసిస్టెంట్‌ ఎస్‌ఐ దాస్‌, ఇద్దరు పోలీసు అధికారులు, ఘటల్‌ ఆఫీసర్‌-ఇన్‌-ఛార్జ్‌ చిత్త పాల్‌లు ఉన్నారు. 

అయితే ఘోష్‌ తరఫు న్యాయవాది పినాకి భట్టాచర్య మాత్రం సీఐడీపై పలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఘోష్‌ 1994 నుంచి 2017 వరకూ అన్ని రకాల ఫ్లాట్స్‌ను, లాకర్‌ గోల్డ్‌ను లెక్కల్లో చూపారని, ఇదంతా రాజకీయ కుట్రగా అభివర్ణించారు. కోర్టులో సీఐడీ కేసు గెలవదని తేల్చి చెబుతున్నారు. ఘోష్‌ కొనుగోలు చేసిన భూమి అంతా.. ప్రభుత్వ అనుమతితో, చట్టబద్ధంగానే జరిపినట్టు తెలిపారు.

కాగా భారతీ ఘోష్‌ పోలీసాఫీసర్‌గా పలు అంతర్జాతీయ మిషన్లకు సేవలందించారు. ఐపీఎస్‌గా కూడా ప్రమోట్‌ అయ్యారు. మమతా సీఎం అయ్యాక ఘోస్‌కు సూపరిటెండెంట్‌ ఆఫ్‌ పోలీసుగా ప్రమోషన్‌ వచ్చింది. డిసెంబర్‌ 25న 3వ బెటాలియన్‌ రాష్ట్ర సాయుధ దళాలకు కమాండింగ్‌ ఆఫీసర్‌గా బదిలీ అయ్యారు. అనంతరం ఆమె వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకున్నారు. రెండు నెలల తర్వాత ఘోష్‌ పై సీఐడీ ఈ కేసు నమోదు చేసింది. మరోవైపు ఈ వ్యవహారంపై  మాట్లాడేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ సుముఖంగా లేదు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement