మేము చచ్చేంత వరకు ఇలాగేనేమో!

UP Banda Electricity Employees Wear Helmets To Work Here Is Why - Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లాకు చెందిన విద్యుత్‌ శాఖ ఉద్యోగులు ప్రతిరోజూ హెల్మెట్‌ ధరించే ఆఫీసుకు వెళ్తారు. అంతేకాదు కార్యాలయానికి చేరుకున్న తర్వాత కూడా హెల్మెట్‌ పక్కన పెట్టకుండానే పనిచేసుకుంటారు. కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన మోటార్‌ వాహన సవరణ చట్టం-2019 మీద ఉన్న భయం వలనో, భక్తి వలనో వీరిలా చేస్తున్నారనుకుంటే పొరబాటే. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే పడే జరిమానాల నుంచి తప్పించుకునేందుకు వారు ఇలా చేయడం లేదు. పనిచేసే చోట ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు వేరే గత్యంతరంలేక ఈ మార్గం ఎంచుకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే... విద్యుత్‌ శాఖకు చెందిన బాందా జిల్లాలోని ఓ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. కప్పు ఎప్పుడు ఊడి మీద పడుతుందో తెలియని దుస్థితి. కాస్త వర్షం పడినా పైనుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. ఈ విషయం గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఉద్యోగులే ఈ ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకున్నారు. కాగా హెల్మెట్లు ధరించి ఆఫీసులో పనిచేసుకుంటున్న ఉద్యోగుల ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండటంతో యోగి ఆదిత్యనాథ్‌ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ విషయం గురించి విద్యుత్‌ ఉద్యోగి ఒకరు మాట్లాడుతూ... ‘ మమ్మల్ని మేము రక్షించుకోవడానికి గత్యంతరం లేక ఇలా హెల్మెట్‌తో కాలం వెళ్లదీస్తున్నాం. ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు. ఫైళ్లు భద్రపరుచుకునేందుకు సరైన అల్మారాలు లేవు. కుర్చీలు కూడా చిరిగిపోయి ఉన్నాయి. వర్షం వస్తే గొడుగులు పట్టుకుని పనిచేస్తాం. ఇంతా జరుగుతున్నా సీనియర్లకు మా బాధలు పట్టవు. కప్పు కూలి మాలో ఎవరో ఒకరు చచ్చిన తర్వాత ఈ సమస్యకు పరిష్కారం వెదుకుదామని వాళ్లు ఆలోచిస్తున్నారేమో. అప్పుడే భవనాన్ని రిపేరు చేస్తారు కావొచ్చు అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ విషయంపై ఉన్నతాధికారులు ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top