పీవోకేను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధం

Army Chief General Bipin Rawat warns Pakistan - Sakshi

ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ స్పష్టీకరణ

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)ను తిరిగి అధీనంలోకి తెచ్చుకునేందుకు ఎలాంటి చర్యకైనా సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రకటించారు. పీవోకే రాజధాని ముజఫరాబాద్‌లో 13న జరిగే జల్సా (ర్యాలీ)కి వెళ్తున్నట్లు పాక్‌ ప్రధాని ప్రకటించిన నేపథ్యంలో ఆర్మీ చీఫ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.    –

న్యూఢిల్లీ/గ్వాలియర్‌: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)ను తిరిగి అధీనంలోకి తెచ్చుకునేందుకు ఎలాంటి చర్యకైనా సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రకటించారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో జల్సా పేరుతో భారీ ర్యాలీ నిర్వహించాలన్న పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నిర్ణయం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పీవోకేను తిరిగి భారత్‌లో అంతర్భాగంగా చేసుకోవడమే ప్రభుత్వం తదుపరి లక్ష్యమంటూ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ చేసిన ప్రకటనపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పీవోకేను స్వాధీనం చేసు కోవడంతోపాటు దేనికైనా మేం సంసిద్ధంగా ఉన్నాం’అని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పీవోకే రాజధాని ముజఫరాబాద్‌లో 13వ తేదీన జరిగే జల్సా(ర్యాలీ)కి వెళ్తున్నట్లు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ప్రకటించిన నేపథ్యంలో ఆర్మీ చీఫ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

పీవోకేపై ప్రత్యేక వ్యూహం ఉంది
పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)కు సంబంధించి ప్రభుత్వం వద్ద ప్రత్యేక వ్యూహం ఉందని కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వీకే సింగ్‌ వెల్లడించారు. మన బలగాలు పీవోకేలోకి ప్రవేశించేందుకు సదా సన్నద్ధంగా ఉన్నాయి.. అయితే, ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాయన్న ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ..‘పీవోకే విషయంలో ప్రభుత్వం వద్ద ప్రత్యేక వ్యూహం ఉంది. దాని ప్రకారం చర్యలు తీసుకుంటుంది. ఇటువంటి విషయాలను బహిర్గతం చేయరాదు’అని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top