అత్యంత తీవ్రమైన తుపాను ‘అంఫన్‌’

Amphan is The Most Intense Cyclone, Says IMD Chief - Sakshi

న్యూఢిల్లీ: ‘అంఫన్‌’ అత్యంత తీవ్రమైన తుపాను అని, 1999 తరువాత బంగాళాఖాతంలో ఏర్పడిన రెండో అతి పెద్ద తుపానుగా భారత వాతావరణ శాఖ(ఐఎండీ) చీఫ్‌ మత్యుంజయ్‌ మహాపాత్ర పేర్కొన్నారు. ఇది ఉత్తర వాయువ్య దిశ వైపు కదులుతోందని, సముద్రంలో దాని గాలి వేగం ప్రస్తుతం 200-240 కిలోమీటర్లుగా ఉందని వెల్లడించారు. జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్‌) చీఫ్‌ ఎస్‌ఎన్ ప్రధాన్‌, టెలికం కార్యదర్శి అన్షు ప్రకాశ్‌తో కలిసి మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, తూర్పు, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలతో పాటు కోల్‌కతా, హుగ్లీ, హౌరా ప్రాంతాల్లో ‘అంఫన్‌’ తుపాను తీవ్రత ఉండే అవకాశముందన్నారు. ఈ ప్రాంతాల్లో గరిష్టంగా 135 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు. ఉష్ణమండల తుపాను కారణంగా కేరళకు రుతుపవనాలు కొంచెం ఆలస్యంగా రానున్నాయని, జూన్ 5 నాటికి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని మత్యుంజయ్‌ మహాపాత్ర వివరించారు.

రెండు సవాళ్లు ఎదుర్కొంటున్నాం
కరోనా, అంఫన్‌ తుపానులతో రెండు సవాళ్లను ఎదుర్కొంటున్నామని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ చీఫ్‌ ఎస్‌ఎన్ ప్రధాన్ అన్నారు. అంఫన్‌ తుపాను అతి తీవ్రంగా మారిన నేపథ్యంలో తమ బృందాలను బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాలకు పంపించినట్టు చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో 19, ఒడిశాలో 15 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను మొహరించినట్టు వెల్లడించారు. అదనంగా మరో 6 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బెటాలియన్లను కూడా సిద్ధంగా ఉంచామన్నారు. ప్రతి బెటాలియన్‌లో నాలుగు బృందాలు ఉంటాయని చెప్పారు. (అంఫన్‌ బీభత్సం మామూలుగా ఉండదు!)

జనరేటర్లు సిద్ధం చేసుకోండి
అంఫన్‌ తుపాను నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లోని టెలికం సర్వీసు ప్రొవైడర్లు అప్రమత్తంగా ఉండాలని టెలికం కార్యదర్శి అన్షు ప్రకాశ్‌ సూచించారు. ఈదురు గాలులతో విద్యుత్‌ సరఫరాకు ఆటంకం కలిగే అవకాశం ఉన్నందున తగినంత సంఖ్యలో జనరేటర్ సెట్లను ఏర్పాటు చేసుకుని, సరిపడా డీజిల్‌తో సన్నద్దంగా ఉండాలన్నారు. విద్యుత్‌కు అంతరాయం ఏర్పడితే ఈ జనరేటర్ల సహాయంతో టెలికం టవర్లను పనిచేయించవచ్చని తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఎంఎంఎస్‌ల ద్వారా సమాచారం చేరవేయనున్నట్టు తెలిపారు. స్థానిక భాషల్లో, ఉచితంగా ఈ సేవలు అందిస్తామన్నారు. తుపాను తీరం దాటేవరకు ఇంట్రా-సర్కిల్ రోమింగ్ కొనసాగుతుందని వెల్లడించారు. (అంఫన్‌తో జాగ్రత్త)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top