మద్యనిషేధంతో బిహార్‌ ఇలా..

Alcohol Ban Making Bihar As Milk Hub - Sakshi

సాక్షి, పట్నా : బిహార్‌లో 2016 నుంచి మద్యనిషేధం అమలు తర్వాత రాష్ట్రంలో నేరాల రేటు గణనీయంగా తగ్గిందని, బిహార్‌ పాలు, తేనెలకు హబ్‌గా మారిందని అథ్యయనాలు స్పష్టం చేశాయి. మద్యనిషేధం విధించిన క్రమంలో 2016-17లో బిహార్‌లో పాల ఉత్పత్తుల విక్రయం అంతకుముందు ఏడాదితో పోలిస్తే 17.5 శాతం పెరిగిందని డెవలప్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్‌ (డీఎంఐ) చేపట్టిన అథ్యయనం వెల్లడించింది. ఫ్లేవర్డ్‌ మిల్క్‌, సుధా స్పెషల్‌ లస్సీ, ప్లెయిన్‌ దహీ వంటి పాల ఉత్పత్తుల విక్రయం మరింతగా వృద్ధి చెందాయని వెల్లడైంది. ప్రైవేట్‌ వర్తకుల విక్రయాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ గణాంకాలు మరింత అధికమని అధికారులు పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో తేనె విక్రయాలు 380 శాతం, వెన్న విక్రయాలు 200 శాతం పెరిగాయి. మద్యపాన ప్రియులు మద్యంపై వెచ్చించే మొత్తాన్ని ఇతర వినిమయ ఉత్పత్తులపై వెచ్చించినట్టు ఈ అథ్యయనంలో వెల్లడైంది.

ఖరీదైన చీరల విక్రయాలు ఏకంగా పది రెట్లు, ఖరీదైన డ్రెస్‌ మెటీరియల్‌ అమ్మకాలు తొమ్మిది రెట్లు, ప్రాసెస్ట్‌ ఫుడ్‌ విక్రయాలు 46 శాతం మేర పెరిగాయని తేలింది. బిహార్‌లో మద్యనిషేధం అమలైనప్పటి నుంచీ వినోద పన్ను వసూళ్లు 29 శాతం పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అథ్యయనం పేర్కొంది. కొనుగోలు శక్తి పెరగడంతో కార్లు, ట్రాక్టర్ల విక్రయాలు 30 శాతం, ద్విచక్ర వాహనాల విక్రయాలు 32 శాతం పెరిగాయి.

2011 గణాంకాల ప్రకారం బిహార్‌లో మద్యనిషేధం ప్రకటించిన సమయంలో రాష్ట్రంలో 44 లక్షల మంది మద్యపాన ప్రియులున్నారు. వీరంతా నెలకు రూ 1000 ఖర్చు చేసినా ఏటా రూ 5,280 కోట్లు మద్యానికి వెచ్చించాల్సి వచ్చేది. ఇక మద్యనిషేధంతో బిహార్‌లో నేరాల రేటు గణనీయంగా తగ్గిందని పట్నాకు చెందిన ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ నిర్వహించిన అథ్యయనం పేర్కొంది. దోపిడీల కోసం జరిగే కిడ్నాప్‌ ఘటనలు 66 శాతం, హత్యలు 28 శాతం, దోపిడీలు 22 శాతం మేర తగ్గుముఖం పట్టాయని ఈ అథ్యయనంలో వెల్లడైంది. సమాజంలో అణగారిన వర్గాలకు మద్యనిషేధం ద్వారా మేలు చేకూరిందని ఈ అథ్యయనాలు పేర్కొన్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top