విమాన ప్రయాణాల్లో భారీ మార్పులు

Air Travel will Never be the Same After Lockdown - Sakshi

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను నిలువరించడంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను ఎత్తివేశాక రవాణా రంగంలో ముఖ్యంగా, విమానయాన రంగంలో పలు మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కరోనా వైరస్‌ వెలుగులోకి రాకముందు లక్షిత విమాన ప్రయాణానికి రెండు నుంచి నాలుగు గంటల ముందు విమానాశ్రయాలకు వెళ్లాల్సి వచ్చేంది. ఇక లాక్‌డౌన్‌ ఎత్తివేశాక కనీసం 12 గంటల ముందు విమానాశ్రయాలకు చేరుకోవాల్సి ఉంటుంది. హాంకాంగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రస్తుతం ప్రయాణికులకు కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వచ్చిన తర్వాతనే ప్రయాణానికి అనుమతిస్తున్నారు. ఆ విమానాశ్రయంలో కరోనా పరీక్షల ఫలితాలు రావడానికి 12 గంటలు కనీసంగా పడుతున్నట్లు తెల్సింది. ఎమిరేట్స్, దుబాయ్‌ విమానాశ్రయాలు కూడా ఇలాంటి వైద్య పరీక్షలనే నిర్వహిస్తున్నాయి.

అంటు వ్యాధులు ఉన్నాయో, లేదో తెలుసుకునేందుకు విమాన ప్రయాణానికి 72 గంటలకు ముందు జారీ చేసిన వైద్య సర్టిఫికెట్లు అడిగే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. బీమా సర్టిఫికెట్లను అడిగే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఎందుకంటే, థాయ్‌లాండ్‌ ఇప్పటికే కరోనా బీమా సదుపాయాన్ని కల్పిస్తోంది. విమానాశ్రయాల్లో శానిటైజ్‌ చేసే టన్నెళ్లను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయవచ్చు. పాస్‌పోర్టులు, ల్యాప్‌టాప్‌లను తనిఖీ చేయడానికి మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావచ్చు. ఏది ఏమైనా రెండేళ్ల వరకు ప్రతి ప్రయాణికుడు ముఖానికి మాస్క్‌ను ధరించడంతోపాటు రెండు మీటర్లు భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. విమానంలో మూడు సీట్ల వరుసలకు బదులు రెండు సీట్ల వరుసలే కనిపించే అవకాశం ఉంది. (తెరచుకున్న షాపులు.. ఇదంతా ప్రహసనం!)

కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 64 శాతం విమాన సర్వీసులను రద్దు చేశారు. అంటే దాదాపు 17వేల విమానాల సర్వీసులు రద్దయ్యాయి. ఈ కారణంగా ఈ రంగానికి ఈ ఏడాది 250 బిలియన్‌ పౌండ్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని ‘ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ అసోసియేషన్‌’ తెలియజేసింది. అలాగే రెండున్నర కోట్ల మంది ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. ఫలితంగా చార్జీలు పెరగుతాయి. విమానయాన సర్వీసుల సంఖ్య తగ్గుతుంది. ప్రయాణికులు వీలున్న చోట విమానాలకు బదులుగా రైళ్లను ఆశ్రయించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. (వలస కార్మికులపై ఎందుకింత ఆలస్యం?)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top