
న్యూఢిల్లీ: అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంలో మధ్యవర్తిగా ఉన్న బ్రిటన్ పౌరుడు క్రిస్టియన్ మిషెల్‌కు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ ఢిల్లీలోని ఓ కోర్టును కోరింది. భారత్ తరఫున సరైన సాక్ష్యాలను సమర్పించకపోవడంతోనే ఇటలీలోని ఓ న్యాయస్థానం అగస్టా కేసును కొట్టివేసిందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ధర్మాసనం మిషెల్‌ను 10 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ ఉత్తర్వులు జారీచేసింది. మిషెల్‌కు విధించిన నాలుగు రోజుల సీబీఐ కస్టడీ ముగియడంతో అధికారులు ఆయన్ను బుధవారం కోర్టు ముందు హాజరుపరిచారు. మిషెల్ న్యాయవాది జోసెఫ్ వాదిస్తూ.. ఆయన డిస్లెక్సియా వ్యాధితో బాధపడుతున్నందున బెయిల్ మంజూరు చేయాలని కోరారు.