ఆధార్‌ సవరణ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం

Aadhaar Amendment Bill gets Cabinet approval - Sakshi

న్యూఢిల్లీ: బ్యాంకు అకౌంట్లు తెరిచేందుకు, మొబైల్‌ ఫోన్‌ కనెక్షన్లు పొందేందుకు ఆధార్‌ను గుర్తింపు ధ్రువీకరణగా వాడుకునేందుకు వీలు కల్పిస్తూ రూపొందించిన సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. మార్చిలో విడుదల చేసిన ఆర్డినెన్స్‌ స్థానంలో రూపొందించిన ఈ సవరణ బిల్లును 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలను కూడా బిల్లులో ప్రతిపాదించింది. అదేవిధంగా, 18 ఏళ్లు నిండిన వారు బయోమెట్రిక్‌ గుర్తింపు విధానం నుంచి బయటికి వచ్చేందుకు వీలు కల్పించే ప్రతిపాదన కూడా ఉంది.

కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన పొడిగింపు  
జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్‌ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ వెల్లడించారు. రాష్ట్రంలో 2018 జూన్‌ 20వ తేదీ నుంచి రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది. అమర్‌నాథ్‌ యాత్ర ముగిసిన తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తామంటూ ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రపతి పాలనకు ఇదే ఆఖరి పొడిగింపు కావచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత గడువు జూలై 2వ తేదీతో ముగియనుండగా తాజా పొడిగింపు జూలై 3వ తేదీ నుంచి అమలు కానుంది. రానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ మేరకు
ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టనుంది.

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు ఆమోదం
ట్రిపుల్‌ తలాక్‌ విధానంపై నిషేధం విధిస్తూ రూపొందించిన బిల్లును కేబినెట్‌ ఆమోదించింది. ఇందుకు సంబంధించి ఫిబ్రవరిలో జారీ చేసిన ఆర్డినెన్స్‌ స్థానంలో ఈ బిల్లును ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. 16వ లోక్‌సభ రద్దు కావడంతో రాజ్యసభ వద్ద పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లుకు కాలపరిమితి తీరింది. దీంతో ప్రభుత్వం మళ్లీ ఈ బిల్లు రూపొందించింది. ట్రస్టులకు ప్రత్యేక ఆర్థిక మండలా(ఎస్‌ఈజెడ్‌)లను ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పించే ఎస్‌ఈజెడ్‌ సవరణ బిల్లుపైనా కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top