ఆర్మీ వాహనంపై ఉగ్ర దాడి

9 soldiers injured in IED blast targeting Army vechile - Sakshi

పుల్వామాలో తొమ్మిది మంది భద్రతా సిబ్బందికి గాయాలు

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని అరిహల్‌లో ఆర్మీ అధికారుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు బాంబు దాడి చేశారు. ఈ దాడిలో తొమ్మిది మంది భద్రతా సిబ్బంది, ఇద్దరు పౌరులు గాయపడ్డారు. ఈ దాడికి ఉగ్రవాదులు శక్తిమంతమైన ఇంప్రొవైస్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైస్‌ (ఐఈడీ)ని వినియోగించారు. ఫిబ్రవరి 14న ఓ సూసైడ్‌ బాంబర్‌ 40 మంది సీఆర్‌పీఎఫ్‌ అధికారులను బలితీసుకున్న ప్రాంతానికి ఇది కేవలం 27 కిలోమీటర్ల దూరంలోనే జరగడం గమనార్హం.

44 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఈ ఆర్మీ వాహనం బుల్లెట్, మైన్‌ ప్రూఫ్‌ కావడంతో సైన్యానికి పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. దక్షిణ కశ్మీర్‌ జిల్లాలోని అరిహల్‌ లస్సిపురా రోడ్డు మీద ఈ దాడి జరిగింది. అనంతరం పరిస్థితిని అదుపులోకి తేవడానికి మరికొంత మంది సిబ్బందిని రప్పించి, గాల్లోకి కాల్పులు జరిపామని అధికారులు తెలిపారు. చిన్నగాయాలు మినహా ఏ నష్టమూ జరగలేదని, ఉగ్రవాదులు చేసిన దాడి విఫలమైందని కల్నల్‌ రాజేష్‌ కలియా అన్నారు. బాంబుదాడి అనంతరం కూడా సోదాలు కొనసాగాయని అన్నారు. అయితే పుల్వామాలో ఉగ్రవాదులు దాడి చేయనున్నారని పాకిస్తాన్‌ ముందే హెచ్చరించడం గమనార్హం.  

పాక్‌ చెప్పడానికి కారణాలేంటి?
అల్‌కాయిదాకు అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రవాది జకీర్‌ మూసాను చంపినందుకు ప్రతీకారంగా భారత్‌లో దాడులు చేయాలని ఉగ్రవాదులు నిర్ణయించుకున్నట్లు తమకు సమాచారం అందిందని పాక్‌ ఇటీవల భారత ప్రభుత్వానికి తెలిపింది. ఈ దాడులు అమర్‌నాథ్‌ యాత్రకు ముందుగానీ, తర్వాతగానీ దాడులు చేసేందుకు ఉగ్రమూకలు సిద్ధంగా ఉన్నారంది. 2016లో కూడా పాక్‌ జాతీయ భద్రతా సలహాదారు నసీర్‌ జాంజువా అప్పటి భారత జాతీయ భద్రతా సలహాదారు ధోవల్‌కు గుజరాత్‌లో 26/11 లాంటి దాడులు నిర్వహించేందుకు ఉగ్రవాదులు పథకం పన్నారని తెలిపారు. పాక్‌ ఇలాంటి హెచ్చరికలు చేయడంపై పలు అనుమానాలు వెల్లువెత్తున్నాయి. అంతర్జాతీయ సమాజంలో తాము ఉగ్రవాదానికి వ్యతిరేకులమన్న సందేశాన్ని వ్యాప్తి చేయడమే పాక్‌ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top