పోలీసులపై కాల్పులు.. 8 మంది మృతి

8 Policemen Were Killed In The Firing Of Rowdy Sheeters In Kanpur - Sakshi

కాన్పూర్‌: ఉత్తరప్రదేశ్‌లో రౌడీషీటర్లు రెచ్చిపోయారు. డీఎస్పీతో పాటు 8 మంది పోలీసులను కాల్చి చంపారు. కాన్పూర్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఈ కిరాతక ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో డీఎస్పీ దేవేంద్ర మిశ్రా సహా ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారని యూపీ ప్రభుత్వం తెలిపింది. కాన్పూర్‌ శివారులోని చౌబెపూర్‌లోని పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బిక్రూ గ్రామంలో రౌడీ షీటర్‌ వికాస్‌ దూబేను పట్టుకునేందుకు పోలీసుల బృందం కాన్పూర్‌ వెళ్లింది. పోలీసులపై రౌడీషీటర్లు అనూహ్యంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఎనిమిదిమంది పోలీసులు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. అదనపు డీజీపీ(శాంతి భద్రతలు), కాన్పూర్‌ ఎస్పీ, ఐజీ సహా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.


పోలీసుల మృతి ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాల్పులు జరిపిన వారిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి (హోం), డీజీపీతో మాట్లాడిన ఆయన ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని కోరారు. హంతకులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని కాన్పూర్‌ ఏడీజీ జేఎన్‌ సింగ్‌ తెలిపారు. ఇతర జిల్లాల నుంచి అదనపు సిబ్బందిని రప్పించామన్నారు. గాయపడిన నలుగురు పోలీసులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు.


బీజేపీకి చెందిన మంత్రి సంతోష్ శుక్లా హత్యతో సహా రౌడీషీటర్‌ వికాస్‌ దూబేపై 57 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. 2001లో శివలి పోలీస్ స్టేషన్‌లో సంతోష్ శుక్లాను హత్య చేసినట్లు దుబేపై ఆరోపణలు ఉన్నాయి. రాజ్‌నాథ్ సింగ్ కేబినెట్‌లో శుక్లా మంత్రిగా పనిచేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top