ఆర్మీ మేజర్‌ జనరల్‌కు జీవితఖైదు

7 armymen, including a Major General, given life sentence - Sakshi

ఇద్దరు కల్నల్‌లు సహా ఏడుగురికి శిక్ష విధించిన సైనిక కోర్టు

1994నాటి డంగారి నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో తీర్పు  

న్యూఢిల్లీ/గువాహటి: అస్సాంలో 1994లో జరిగిన సంచలన నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో ఓ ఆర్మీ మేజర్‌ జనరల్, ఇద్దరు కల్నల్‌లు సహా ఏడుగురికి జీవిత ఖైదు పడింది. డిబ్రూగఢ్‌ జిల్లాలోని దిన్జన్‌లో సైనిక కోర్టు విచారణ అనంతరం ఈ తీర్పు వెలువరించింది. మేజర్‌ జనరల్‌ ఏకే లాల్, కల్నల్‌లు థామస్‌ మాథ్యూ, ఆర్‌ఎస్‌ సిబిరెన్‌లతోపాటు జూనియర్‌ కమిషన్డ్, నాన్‌ కమిషన్డ్‌ అధికారులుగా ఉన్న దిలీప్‌ సింగ్, జగ్‌దేవ్‌ సింగ్, అల్బీందర్‌ సింగ్, శివేందర్‌సింగ్‌లను ఆర్మీ కోర్టు ఈ కేసులో దోషులుగా తేల్చింది.

1994 ఫిబ్రవరి 23న ఆల్‌ అస్సాం స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఏఏఎస్‌యు) కార్యకర్తలు ప్రవీణ్‌ సోనోవాల్, ప్రదీప్‌ దత్తా, దేవాజిత్‌ విశ్వాస్, అఖిల్‌ సోనోవాల్, భాబెన్‌ మోరన్‌లను దోషులు అపహరించి, నకిలీ ఎన్‌కౌంటర్‌ చేసి చంపారు. డంగారి ఫేక్‌ ఎన్‌కౌంటర్‌గా ఈ కేసు పేరుమోసింది. ఈ ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా నాటి ఏఏఎస్‌యు అధ్యక్షుడు, ప్రస్తుత బీజేపీ నేత జగదీశ్‌ భుయాన్‌ ఒక్కరే హైకోర్టులో పోరాడారు. ఈ కేసులో సీబీఐ విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. కొద్ది రోజులు సీబీఐ దర్యాప్తు జరిగిన అనంతరం ఈ కేసును తాము మిలిటరీ చట్టం కింద విచారిస్తామంటూ కోర్టు అనుమతిని ఆర్మీ పొందింది.

ఇప్పుడు ఏడుగురికి జీవితఖైదు విధించడంపై భుయాన్‌ స్పందిస్తూ ‘24 ఏళ్లలో ఒక్కసారి కూడా భారత ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ, సైన్యంపై నేను నమ్మకం కోల్పోలేదు. ఆర్మీ తన సొంత సిబ్బందికే గుణపాఠం నేర్పే శిక్ష వేసింది’ అని అన్నారు. ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ మాట్లాడుతూ తప్పుచేసే సైనికులపై తాము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ తీర్పును కోల్‌కతాలోని తూర్పు ఆర్మీ కమాండ్, ఢిల్లీలోని ఆర్మీ ప్రధాన కార్యాలయం ఆమోదించాల్సి ఉంది. ఇందుకు మూడు నెలల సమయం పట్టొచ్చు. దోషులు సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకోవచ్చు. దోషుల్లో ఒకరైన ఏకే లాల్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించారని సహోద్యోగిని 2007లో ఫిర్యాదు చేయడంతో ఆర్మీ విచారణ అనంతరం 2010లోనే ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top