
చెన్నై: తమిళనాడులో నీటి కరువు తాండవిస్తోందని, ఈ సమయంలో నీటి సమస్యపై రాజకీయాలు చేయడం తగదని ఆ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డీ. జయకుమార్ మీడియాతో పేర్కొన్నారు. తాగునీటి వ్యవస్థలను చక్కదిద్దడం ఎంతో కీలకమైనందని, నీటి సమస్యను పరిష్కరించడాని సాధ్యమైనంత మేరకు కృషి చేస్తున్నామన్నారు. ఈ సంవత్సరం వర్షాలు తగినంతగా కురవకపోయినా.. ప్రజలందరికీ తాగు నీటి ఎద్దడి లేకుండా చూస్తామన్నారు.
చెన్నైలో దాదాపు 400 నీటి ట్యాంకుల ద్వారా తాగునీటిని ప్రజలకు అందిస్తామన్నారు. మున్సిపల్ మంత్రి వేలుమణి నీటి సమస్యపై ఓ ఉన్నత స్థాయి అధికారుల కమిటీని ఏర్పాటు చేసి పర్యవేక్షించనున్నారని వెల్లడించారు. నీటి సమస్య పరిష్కారమయ్యే వరకు కొన్ని హోటల్స్ తెరవకూడదని చెన్నై హోటల్ ఓనర్స్ అసోషియేషన్‌ను ఆయన కోరారు. ఇక, నీటి సమస్య తీవ్రతరం కావడంతో చెన్నైలోని ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ వెసులుబాటు కల్పిస్తున్న సంగతి తెలిసిందే.