మావోల మారణకాండ | 25 CRPF men killed in Maoist attac | Sakshi
Sakshi News home page

మావోల మారణకాండ

Apr 25 2017 3:16 AM | Updated on Oct 9 2018 2:53 PM

మావోల మారణకాండ - Sakshi

మావోల మారణకాండ

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు బరితెగించారు. తమ కంచుకోటలో మాటువేసి మెరుపుదాడి చేసి మరీ 25 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను అతిదారుణంగా చంపేశారు.

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో విరుచుకుపడిన మావోయిస్టులు
25 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు మృతి
భోజనానికి సిద్ధమవుతుండగా గుట్టపైనుంచి కాల్పులు
తేరుకునేలోపే గ్రనేడ్లతో దాడి.. జవాన్ల నుంచి ఆయుధాల అపహరణ
♦  గాయపడిన వారిని హెలికాప్టర్‌లో తరలింపు 
నేడు రాయ్‌పూర్‌కు రాజ్‌నాథ్‌


రాయ్‌పూర్‌/చర్ల/చింతూరు: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు బరితెగించారు. తమ కంచుకోటలో మాటువేసి మెరుపుదాడి చేసి మరీ 25 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను అతిదారుణంగా చంపేశారు. దక్షిణ బస్తర్‌లోని సుక్మా జిల్లాలో సోమవారం మధ్యాహ్నం 12.30 సమయంలో ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆరుగురు జవాన్లను హెలికాప్టర్‌లో రాయ్‌పూర్‌కు తరలించి చికిత్సనందిస్తున్నారు. 74వ బెటాలియన్‌ చింతగుహ అటవీ ప్రాంతంలోని కాలాపత్తర్‌ ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణానికి భద్రతగా వచ్చిన సమయం లో ఈ దాడి జరిగిందని సీఆర్పీఎఫ్‌ డీఐజీ ఎం. దినకరన్‌ తెలి పారు.

మొదట 11 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకోగా మరో జవాన్‌ చికిత్సపొందుతూ మరణించాడన్నారు. తర్వా త మావోల కోసం గాలిస్తుండగా మరో 13 మంది జవాన్ల మృతదేహాలు లభించాయన్నా రు. ‘25 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను కోల్పోయాం. మావోల కోసం గాలింపు కొనసాగుతోంది’ అని దినకరన్‌ తెలిపారు. గతంలోనూ ఈ ప్రాంతంలో మావోయిస్టలు పలుమార్లు పోలీసులు, భద్రతా బలగాలపై దాడులకు పాల్పడ్డారు. 2010లోనూ మావోల మెరుపుదాడిలో 76 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అమరులైంది కూడా ఇక్కడే.

ఆయుధాలు ఎత్తుకెళ్లిన మావోలు
తాజా ఘటనలో 300కు పైగా మావోయిస్టు గెరిల్లా సభ్యులు పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు. పలువురు మహిళా మావోయిస్టులను చూశామని.. నల్లని దుస్తుల్లో ఏకే–47 ఆయుధాలతో వీరు కూడా కాల్పులకు తెగబడ్డారని చికిత్సపొందుతున్న జవాన్లు తెలిపారు. మావోయిస్టులు ఎత్తైన ప్రాంతం నుంచి కాల్పులు జరపటంతో తప్పించుకునే క్రమంలో జవాన్లు చెల్లాచెదురయ్యారని.. ఇదే అదునుగా.. అన్ని వైపుల నుంచి మావోయిస్టుల కాల్పులు జరిపారని మరో జవాను తెలిపారు. మృతిచెందిన జవాన్ల దగ్గరినుంచి మావోయిస్టులు ఆయుధాలు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కాసేపటికి తేరుకున్న జవాన్లు మావోలపై ఎదురుకాల్పులు ప్రారంభించారు.

ఈ కాల్పుల్లో కనీసం 10–12 మంది మావోయిస్టులు హతమై ఉంటారని గాయపడ్డ జవాన్లు తెలిపారు. కంపెనీ కమాండర్, ఇన్‌స్పెక్టర్‌ రఘుబీర్‌సింగ్‌తో సహా ఎస్‌ఐ కేకే దాస్, ఏఎస్‌ఐలు సంజయ్‌కుమార్, రామేశ్వర్‌లాల్, నరేష్‌కుమార్‌లు కూడా ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. కోబ్రా కమాండోలు సహా.. సుక్మా సమీపంలో మావోయిస్టు ఆపరేషన్లలో పాల్గొంటున్న జవాన్లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని కూంబింగ్‌ కొనసాగిస్తున్నారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్‌ మెహర్షి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కాగా, మావోయిస్టులు కూడా పెద్ద సంఖ్యలోనే మృతిచెంది ఉండొచ్చని భావిస్తున్నప్పటికీ దీనిపై పోలీసులు, ప్రభుత్వం అధికారిక ప్రకటనేమీ చేయలేదు.

300 మంది దాడి చేశారు.: ‘షేర్‌’ మహ్మద్‌
‘ముందు గ్రామస్తులను మా ప్రాంతానికి పంపించారు. ఆ తర్వాత దాదాపు 300 మంది నక్సలైట్లు మాపై దాడి చేశారు. మేం 150 మంది వరకున్నాం. వారు 300 మంది. నేను 3–4 మావోయిస్టులను ఛాతీలో కాల్చాను. వాళ్లు కూడా పెద్ద సంఖ్యలోనే చనిపోయారు. దాడి చేసిన వారిలో గ్రామస్తులు, మహిళలు కూడా ఉన్నారు.

వాళ్ల దగ్గర ఏకే 47, ఇన్సాస్‌ రైఫిల్స్‌  కనిపించాయి’ అని గాయపడిన షేర్‌ మహ్మద్‌ అనే సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ వెల్లడించారు. ‘నక్సల్స్‌ నలువైపులనుంచి మమ్మల్ని చుట్టుముట్టాలనుకున్నారు. అయితే మాలో కొందరం మావోయిస్టుల కాల్పులను ప్రతిఘటిస్తూ.. వారివైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశాం. దీంతో చుట్టుముట్టాలన్న ఆలోచనను వాళ్లు మానుకున్నారు. లేదంటే భారీ నష్టం జరిగేది’ అని సౌరభ్‌ మాలిక్‌ అనే గాయపడిన జవాన్‌ తెలిపారు.

‘మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఐఏఎఫ్‌ యాంటీ–నక్సల్స్‌ టాస్క్‌ఫోర్స్‌ కమాండర్‌కు ఘటన సమాచారం అందింది. వెంటనే రెండు ఐఏఎఫ్‌ ఎమ్‌ఐ–17 వీ5 హెలికాప్టర్లు బుర్కపాల్‌కు బయలుదేరాయి. ముందుగా గాయపడిన ఏడుగురు జవాన్లను రాయ్‌పూర్‌కు తరలించాం. అందులో ఒకరు హెలికాప్టర్‌లోనే ప్రాణాలువిడిచారు. ఐదు గంటల సమయంలో బాధితులను రాయ్‌పూర్‌ ఆసుపత్రికి చేర్చాం. జవాన్ల మృతదేహాలను తరలించేందుకు మరిన్ని హెలికాప్టర్లను రంగంలోకి దించాం’ అని భారత వైమానిక దళం వెల్లడించింది.

ఎలా జరిగింది?
సుక్మా జిల్లాలోని బుర్కపాల్‌ గ్రామం సమీపంలో ఓ రోడ్డు నిర్మాణానికి భద్రతగా 74వ బెటాలియన్‌కు చెందిన దాదాపు 100 మంది జవాన్లు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మావోలు వీరిని మట్టుబెట్టేందుకు వ్యూహం పన్నారు. గ్రామస్తుల ద్వారా జవాన్ల సంఖ్య, వీరి ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు సేకరించారు.

ఈ సమయంలోనే జవాన్లు మధ్యాహ్న భోజనానికి సిద్ధమవుతున్నారు. అందరూ తమ ఆయుధాలను పక్కనపెట్టడాన్ని గమనించిన మావోయిస్టులు సరైన సమయం చూసుకుని జవాన్లు బసచేసిన ప్రాంతానికి పక్కనున్న గుట్టపైనుంచి విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. బిత్తరపోయిన జవాన్లు తేరుకునేలోపే.. గ్రనేడ్లతో దాడిచేయటంతో తప్పించుకునేందుకు కూడా వీల్లేకపోయిందని గాయపడిన జవాను ఒకరు తెలిపారు. అయినప్పటికీ కొందరు జవాన్లు వెంటనే అప్రమత్తమై ప్రతిదాడులను ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. మార్చి 12న మావోయిస్టుల దాడిలో 12 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే.

మృతులు వీరే
సీఆర్పీఎఫ్‌ 74వ బెటాలియన్‌కు ఇన్‌స్పెక్టర్‌ రఘుబీర్‌సింగ్, ఎస్‌ఐ కేకే దాస్, ఏఎస్‌ఐలు సంజయ్‌కుమార్, రామేశ్వర్‌లాల్, నరేష్‌కుమార్, హెడ్‌ కానిస్టేబుళ్లు సురేంద్రకుమార్, బన్నారాం, ఎల్పీ సింగ్, నరేష్‌యాదవ్, పద్మనాభన్, రాం మెహర్, కానిస్టేబుళ్లు సౌరభ్‌కుమార్, అభయ్‌మిశ్రా, బన్మాలీరాం, ఎన్పీ సోంకర్, కేకే పాండే, వినయ్‌చంద్ర బర్మన్, అలగుపండి, అభయ్‌కుమార్, సెంథిల్‌కుమార్, తిరుమురుగన్, రంజిత్‌కుమార్, ఆసిష్‌సింగ్, మనోజ్‌కుమార్, అనూప్‌ కర్మాకర్‌.

మీ త్యాగాలు వృథా కావు: ప్రధాని
సుక్మా జిల్లా ఘటనపై యావద్భారతం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌సహా పలురాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ‘ఇది మావోయిస్టుల పిరికిపంద చర్య. అమరుల బలిదానం వృథాకాదు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని ప్రధాని ట్వీటర్లో పేర్కొన్నారు.

ఘటన వివరాలను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి వివరించారు. తీవ్రవిచారం వ్యక్తం చేసిన రాజ్‌నాథ్‌ సింగ్‌ ‘ఇది చాలా దురదృష్టకర ఘటన.మావోల దుశ్చర్యను సవాల్‌గా తీసుకుంటున్నాం. ఎవరినీ ఇకపై ఉపేక్షించం’ అని   ప్రకటించారు. అంతకుముందు రాజ్‌నాథ్‌.. ప్రధాని మోదీకి ఘటన జరిగిన తీరును, తాజా పరిస్థితిని వివరించారు. పరిస్థితిని సమీక్షించేందుకు హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్‌ ఆహిర్, హోంశాఖ సంయుక్త కార్యదర్శి (మావోయిస్టు ఆపరేషన్స్‌) ప్రవీణ్‌ వశిష్ట్‌ను ఛత్తీస్‌గఢ్‌కు పంపించారు.

తనే స్వయంగా మంగళవారం రాయ్‌పూర్‌కు వెళ్లనున్నారు. అంతకుముందు, ఢిల్లీ పర్యటనలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌ సీఎం రమణ్‌సింగ్‌ తన పర్యటనను మధ్యలోనే ముగించుకుని నయా రాయ్‌పూర్‌ చేరుకున్నారు. ‘ఈ ఘటన చాలా బాధాకరం’అని ఆయన పేర్కొన్నారు. రాయ్‌పూర్‌ రాగానే తాజాపరిస్థితిపై ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. అనంతరం ఈ వివరాలను హోం మంత్రి రాజ్‌నాథ్‌కు   వెల్లడించారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా కూడా ఈ దుర్ఘటనను ఖండించారు.

నెత్తుటి మరకలు
గత దశాబ్దకాలంలో భద్రతా బలగాలపై మావోల భారీ దాడుల్ని ఒకసారి పరిశీలిస్తే...
జూన్‌ 29, 2008: ఒడిశాలోని బలిమెల రిజర్వాయర్‌లో బోటులో వెళ్తున్న గ్రేహౌండ్‌ కమాండోలపై మావోయిస్టులు మెరుపు దాడిచేశారు. 38 మంది గ్రేహౌండ్స్‌ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
జూలై 16, 2008: ఒడిశాలోని మల్కనగిరి జిల్లాలో మావోలు అమర్చిన ల్యాండ్‌మైన్‌ పేలడంతో పోలీసు వ్యాన్‌లో ప్రయాణిస్తోన్న 21 మంది పోలీసులు అక్కడికక్కడే మరణించారు.
ఏప్రిల్‌ 22, 2009: జార్ఖండ్‌లో 300 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలును హైజాక్‌ చేసిన మావోయిస్టులు.. అనంతరం లతేహర్‌ జిల్లాలో రైలును వదిలి పారిపోయిన మావోలు.
మే 22, 2009: మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని అడవుల్లో పోలీసులపై మావోయిస్టుల ఆకస్మిక దాడి. 16 మంది పోలీసుల మృతి
⇒  జూన్‌ 10, 2009: జార్ఖండ్‌లోని సరంద అటవీ ప్రాంతంలో పోలీసులు, సీఆర్పీఎఫ్‌ బలగాలపై మావోల దాడి. 9 మంది మృతి
⇒  జూన్‌ 13, 2009: జార్ఖండ్‌లోని బొకారోలో రెండు ల్యాండ్‌మైన్‌ పేలుళ్లలో 10 మంది పోలీసుల మృత్యువాత
జూలై 27, 2009: ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో నక్సల్స్‌ అమర్చిన ల్యాండ్‌మైన్‌ పేలుడులో ఆరుగురు సాధారణ పౌరుల దుర్మరణం.
అక్టోబర్‌ 8, 2009: మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని లహేరి పోలీసు స్టేషన్‌పై మావోయిస్టుల మెరుపు దాడి.. 17 మంది పోలీసుల మృతి
ఫిబ్రవరి 15, 2010: పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నాపూర్‌ జిల్లా శీల్దాలోని ఈస్ట్రన్‌ ఫ్రాంటియర్‌ రైఫిల్స్‌ (ఈఎఫ్‌ఆర్‌) క్యాంప్‌పై విరుచుకుపడ్డ మావోలు.. 24 మంది ఈఎఫ్‌ఆర్‌ సిబ్బంది మృతి.
⇒  ఏప్రిల్‌ 4, 2010: ఒడిశా కోరాపుట్‌ జిల్లాలో ల్యాండ్‌మైన్‌ పేలి స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూపుకు చెందిన 11 మంది మరణం.
ఏప్రిల్‌ 6, 2010: మావోల చరిత్రలో ఇదే అతిపెద్ద, అత్యంత పాశవిక దాడి... చత్తీస్‌గఢ్‌ లోని దంతేవాడ జిల్లాలో సీఆర్పీఎఫ్‌ బృందంపై ఒక్కసారిగా విరుచుకుపడ్డ మావోలు... వారు తేరుకునేలోపే విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 76 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల దుర్మరణం..
జూన్‌ 29, 2010: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌ జిల్లాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై మావోల దాడిలో 26 మంది జవాన్లు మృతి
మే 25, 2013: మావోల మరో భయంకర దాడి.. కాంగ్రెస్‌ నేతలతో వెళ్తున్న కాన్వాయ్‌పై ఛత్తీస్‌గఢ్‌ దర్భా లోయలో మావోల మెరుపుదాడి.. ఛత్తీస్‌గఢ్‌ మాజీ మంత్రి మహేంద్ర కర్మ, పీసీసీ అధ్యక్షుడు నందకుమార్‌ పటేల్‌ సహా 25 మంది కాంగ్రెస్‌ పార్టీ నాయకుల మృతి.
⇒  ఫిబ్రవరి 28, 2014: ఛత్తీస్‌గఢ్‌ దంతేవాడలో మావోయిస్టుల కాల్పుల్లో ఆరుగురు పోలీసు సిబ్బంది మృతి
మార్చి 11, 2014: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా సిబ్బందిపై విరుచుకుపడ్డ నక్సల్స్‌ 15 మంది సిబ్బంది మత్యువాత.
మార్చి 12, 2017: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోల దాడిలో 12 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల మృతి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement