ఆందోళన వద్దు

1023 Confirmed Cases Linked To Tablighi Jamaat In 17 States - Sakshi

కోవిడ్‌–19పై కేంద్రం భరోసా

దేశవ్యాప్తంగా కేసులు: 3,072, మృతులు: 75

17 రాష్ట్రాల్లో 1,023 ‘తబ్లిగీ’ కేసులు, మొత్తం కేసుల్లో ఇవి 30 శాతం

న్యూఢిల్లీ: దేశంలో వెలుగుచూసిన కోవిడ్‌–19 నిర్థారిత కేసుల్లో 30 శాతం వరకు ఒక ప్రాంతానికి సంబంధించినవే కాబట్టి, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తబ్లిగీలో పాల్గొని వ్యాధి బారిన పడిన వారిని, వారి ద్వారా సోకిన 22 వేల మందిని క్వారంటైన్‌లో ఉంచగా మిగతా వారిని కూడా గుర్తించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తబ్లిగీ జమాత్‌ కార్యక్రమంలో పాల్గొన్న వారి కారణంగా 17 రాష్ట్రాల్లో 1,023 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయన్నారు.

మొత్తం నిర్ధారిత కేసుల్లో ఇవి 30 శాతం వరకు ఉంటాయని పేర్కొన్నారు. తబ్లిగీలో పాల్గొని వ్యాధి బారిన పడిన వారిని, వారి ద్వారా సోకిన ఇతరులను గుర్తించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామన్నారు. తబ్లిగీ జమాత్‌ సభ్యులతోపాటు వారితో సంబంధం ఉన్న తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు చెందిన 22 వేల మందిని ఇప్పటివరకు క్వారంటైన్‌కు తరలించామన్నారు. ‘గత 24 గంటల్లో 601 కొత్త కేసులతోపాటు 12 మరణాలు చోటుచేసుకున్నాయి.

దీంతో బాధితుల సంఖ్య 3,072కు, మృతుల సంఖ్య 75కు చేరుకుంది. కేరళ, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో 58 మందిæ బాధితుల పరిస్థితి విషమంగా ఉండగా, ఈ వ్యాధి నుంచి 183 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు’అని తెలిపారు. దేశంలోని 211 జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయనీ, దీనిని కట్టడి చేయకుంటే మరింతగా విస్తరించే ప్రమాదముందన్నారు. బాధితుల్లో అత్యధికంగా 42 శాతం 21–40 ఏళ్లలోపు వారు కాగా, 33 శాతం 41–60, 17 శాతం 60 ఏళ్లకుపైబడినవారు, 9శాతం 0–20 ఏళ్లలోపు వారేనని ఆయన వివరించారు.

‘రోజుకు 10వేల చొప్పున నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రతి 25 పరీక్షల్లో ఒక పాజిటివ్‌ కేసు బయట పడుతుండగా ప్రతి 30 పాజిటివ్‌ కేసుల్లో ఒక్కరు కంటే తక్కువగా మాత్రమే చనిపోతున్నారు’అని వెల్లడించారు. అదేవిధంగా, ఈ వ్యాధి బాధితుల్లో వైరస్‌పై యుద్ధంలో గెలుపు కోసం లాక్‌డౌన్‌ నిబంధనలను, ముఖ్యంగా వ్యక్తిగత దూరాన్ని పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంట్లోనే ఫేస్‌ మాస్కులు తయారు చేసుకుని ధరించాలంటూ ఇచ్చిన సలహా.. ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రతా చర్యలను పాటించేందుకేనని వివరించారు.

పీటీఐ అంచనా ప్రకారం.. దేశవ్యాప్తంగా కోవిడ్‌ కారణంగా 94 మంది చనిపోగా శనివారం సాయంత్రానికి నిర్ధారిత కేసుల సంఖ్య 3,473గా ఉంది. ఇందులో 275 మంది కోలుకుని, ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రాల వివరాలతో పోలిస్తే కేంద్రం వెలువరించిన గణాంకాలు వెనకబడి ఉండటానికి.. విధానపరమైన ప్రక్రియలో ఆలస్యమే కారణమని భావిస్తున్నారు. ఇలా ఉండగా, దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు సంబంధించిన అన్ని అంశాలపై హోం శాఖ ఆధ్వర్యంలోని కంట్రోల్‌ రూం ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని హోం శాఖ జాయింట్‌ సెక్రటరీ పుణ్యసలిల శ్రీవాస్తవ మీడియాకు తెలిపారు. ఇందుకోసం నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌(ఎన్‌డీఆర్‌ఎఫ్‌), కేంద్ర సాయుధ బలగాల(సీఏపీఎఫ్‌)కు చెందిన 200 మంది సిబ్బంది పని చేస్తున్నారన్నారు. కోవిడ్‌తో మహారాష్ట్రలో 19, గుజరాత్‌ 10, మధ్యప్రదేశ్, ఢిల్లీలో ఆరుగురు చొప్పున, పంజాబ్‌లో ఐదుగురు మరణించారన్నారు. నిర్థారిత కేసులు మహారాష్ట్రలో 490,∙ఢిల్లీ 445, తమిళనాడు 411, కేరళ 295, రాజస్తాన్‌ 220, ఉత్తరప్రదేశ్‌ 174 ఉన్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top