ఈ వారం యూట్యూబ్‌ హిట్స్‌ | Youtube hits in this week | Sakshi
Sakshi News home page

ఈ వారం యూట్యూబ్‌ హిట్స్‌

Oct 8 2018 12:33 AM | Updated on Oct 8 2018 12:33 AM

Youtube hits in this week - Sakshi

మా అబ్బాయి బి.టెక్‌ – షార్ట్‌ఫిల్మ్‌
నిడివి : 10 ని.46సె
హిట్స్‌ : 203,930

చదువు ఏం చదవాలి అనేదానికి ఆల్రెడీ సొసైటీలో ఒక టెంప్లెట్‌ ఫిక్స్‌ అయి ఉంది. ఆ టెంప్లెట్‌ పేరు బి.టెక్‌. మెడిసిన్‌ చేయాలనుకునేవారు వేరేగా తిప్పలు పడుతుంటారు. కాని తక్కినవాళ్లందరిని బి.టెక్‌లోకి తోస్తుంటారు తల్లిదండ్రులు. బి.టెక్‌లో కూడా మళ్లీ ఏ కోర్సు చేసినా చివరకు వాళ్లు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా సాఫ్ట్‌వేర్‌ ఆఫీసుల్లో కంప్యూటర్ల ముందు తగలడాలని కూడా ఒక నియమం  ఉంది. ఆ ఉద్యోగంలో ఆ అబ్బాయికి/అమ్మాయికి ఆసక్తి ఉందా లేదా అనేది తల్లిదండ్రులకే కాదు సదరు అబ్బాయి/అమ్మాయికి కూడా పట్టదు. ఈ షార్ట్‌ఫిల్మ్‌లో కుర్రాడు మెకానికల్‌ చేసి ఉంటాడు. డిస్టింక్షన్‌లో పాసయ్యి మూడు నెలలే అయి ఉంటుంది. ఈలోపే చుట్టుపక్కల వారి నుంచి ప్రెజర్‌. ఏం ఇంకా జాబ్‌లో జాయిన్‌ కాలేదు.. ఏం ఇంకా జాబ్‌లో జాయిన్‌ కాలేదు అని. అది కూడా మామూలు జాబ్‌ కాదు. సాఫ్ట్‌వేర్‌ జాబ్‌. ఆ కుర్రాడికి మెకానికల్‌ ఇంజనీర్‌ అయ్యి ఏదైనా కొత్తరకం ఇంజన్‌ కనిపెట్టి జీవితంలో ఏదైనా సాధించాలని ఉంటుంది. కాని గర్ల్‌ఫ్రెండ్, ఫాదర్, ఫ్రెండ్‌... అందరూ అతణ్ణి మూసలో పోయాలని చూడటమే. చివరకు ఆ కుర్రాడు ఏం చెప్పాడనేది క్లయిమాక్స్‌. సరదాగా స్పీడుగా ఉన్న ఈ షార్ట్‌ఫిల్మ్‌ ‘తమడ మీడియా’ వాళ్లది. రవి గంజం ముఖ్యపాత్రధారి.

థియేటర్‌లో అంతే– షార్ట్‌ఫిల్మ్‌
నిడివి  :10 ని. 7 సె.
హిట్స్‌  :506,072

సినిమా చూసేవాళ్ల కష్టాలను కూడా సరదాగా తీయవచ్చా? తీశారు. హైదరాబాద్‌లో మల్టిప్లెక్సుల్లో సినిమా చూడటం అంటే అందుకు ప్రత్యేకమైన తర్ఫీదు ఉండాలి. ముందు ఒక వందా రెండొందల యాడ్స్‌ను భరించగలగాలి. ఆ తర్వాత జనగణమనకు ఎలాగూ లేచి నిలబడక తప్పదు. ఆపై నో స్మోకింగ్‌ ప్రచారం కోసం రాహుల్‌ ద్రావిడ్‌ ఒక అయిదు నిమిషాలు ఉపన్యాసం ఇస్తాడు. ఇవన్నీ అయ్యి సినిమా వేసే లోపు ఉత్సాహం నీరుగారి పోతుంది. ఇక ఇంటర్‌వెల్‌లో పాప్‌కార్న్‌ తినాలంటే ఆస్తులు అమ్మాల్సి వస్తుంది. కొంచెం లేటుగా హాల్లో ఎంటరయ్యి రాంగ్‌ సీట్‌లో కూచుంటే అసలు సీట్‌ వాడొచ్చి లేపీ.. లేపీ.. లేపీ... చివరకు మనల్ని థియేటర్‌ బయటకు వెళ్లేదాకా తరుముతూనే ఉంటాడు. మన పక్క సీట్‌లో చక్కటి బ్యూటీ వచ్చి కూచుంటే కళ్లు స్క్రీన్‌ మీద పెట్టాలా పక్క సీటు మీద పెట్టాలా అనేది ఒక టెన్షన్‌. అర్థం కాని హిందీ సినిమాకు వెళితే పరిస్థితి వర్ణన్‌ కే బాహర్‌ హై. హారర్‌ సినిమాలో మనల్ని మనం కంపోజ్‌ చేసుకొని భయం అంటే లెక్కే లేనట్టుగా పోజు కొట్టడం అదో సమస్య. ఇలాంటి సరదా కష్టాలన్నింటినీ స్క్రీన్‌ మీద నవ్విస్తూ చూపిన షార్ట్‌ఫిల్మ్‌ ఇది. షణ్ముఖ్‌ జస్వంత్‌ ప్రధాన పాత్రధారి.

బెజవాడ మాస్‌ – షార్ట్‌ఫిల్మ్‌
నిడివి :  8 ని. 31 సె.
హిట్స్‌ : 161,587 

హైదరాబాద్‌ జనాలు నిప్పులు కురుస్తున్నాయని భావించిన రోజు అక్కడ సెటిలైన బెజవాడ జనాలు వెన్నెల్లో విహరిస్తున్నట్టు ఫీలవుతారట. అదేమని అడిగితే ‘మా ఎండల ముందు ఈ ఎండలు ఏపాటి’ అని చెమట తుడుచుకోకుండా నవ్వేస్తారట. బెజవాడ వారి మీద జగాన ఇష్టాలు అయిష్టాలు సత్ప్రచారాలు దుష్ప్రచారాలు చాలానే ఉన్నాయి. ‘మీది బెజవాడే మాది బెజవాడే’ అని ముందు జట్టు కడతారని ఆ వెంటనే ‘మీరేమిటోళ్లు’ అని క్యాస్ట్‌ను ఆరా తీస్తారని. కాని చివరకు ఈ షార్ట్‌ఫిల్మ్‌లో బెజవాడ వాళ్లు తెలుగువారందరినీ ఇష్టపడే తెలుగువారు అని తేల్చి చెబుతారు. వీళ్లకున్న సినిమా పిచ్చి, వీళ్లకున్న పునుగుల వెర్రి, పాలిటిక్స్‌ అంటే పూనకం... వీటన్నింటిని ఈ షార్ట్‌ఫిల్మ్‌లో చర్చించారు. ‘చాయ్‌బిస్కెట్‌’ రీజనల్స్‌ సమర్పణ. సుహాస్, మసాలా సందీప్‌ తారాగణం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement