వైనాట్‌ స్టూడియో పదేళ్ల ప్రస్థానం

YNOT Studios 10 Year Journey In Film Industry - Sakshi

సాధారణంగా హీరోల పేర్లు చెప్తే సినిమాల కోసం ఎదురు చూస్తుంటారు. కానీ ఈ బ్యానర్‌ పేరు చెప్తే ఆ సినిమాపై నమ్మకంతో థియేటర్‌కు దారిపడతారు చాలా మంది. డిఫరెంట్‌ సినిమాలతో, ప్రజలు మెచ్చే కథలతో జనాల్లోకి చొచ్చుకుపోయింది వైనాట్‌ స్టూడియో. ఇది ఆవిర్భవించి నేటికి సరిగ్గా పదేళ్లవుతోంది. 2010లో నిర్మాత ఎస్‌. శశికాంత్‌ వైనాట్‌ సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ బ్యానర్‌ నుంచి వెలువడ్డ తొలి సినిమా ‘తమిజ్‌ పదమ్‌’. సీఎస్‌ అముధన్‌ దర్శకత్వంలో శివ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు అందరి దృష్టినీ ఆకట్టుకుంది. అలా తొలి సినిమానే విజయం సాధించడంతో తమ బ్యానర్‌ నుంచి వచ్చే సినిమాలు తప్పకుండా ప్రజలను ఎంటర్‌టైన్‌ చేసేలా, ఆకట్టుకునేలా ఉండాలని ఆ నిర్మాతలు నిర్ణయించుకున్నారు.

హద్దులు చెరిపేస్తూ..
సినిమాకు ఆయువుపట్టైన స్క్రిప్ట్‌ను పరిశీలించిన తర్వాత, అది బలంగా ఉందని నమ్మితేనే ఆయా చిత్రాలు నిర్మిస్తారు. ఇప్పటివరకు ఈ బ్యానర్‌పై 18 సినిమాలు తెరకెక్కాయి. హద్దులు చెరిపేసుకుంటూ తమిళ, తెలుగు, మలయాళం, హిందీ సినిమాల్లోనూ భాగస్వామ్యం అయింది. ఏఆర్‌ రెహ్మాన్‌, రాజ్‌కుమార్‌ హిరానీ, ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ వంటి పలువురు ప్రముఖులతో పనిచేసింది. ‘గురు’, ‘గేమ్‌ ఓవర్‌’ వంటి వైవిధ్యభరిత చిత్రాలు ఈ బ్యానర్‌ నుంచి వచ్చినవే. ఈ చిత్రాలతో కమర్షియల్‌ హిట్‌ను సాధించిందీ బ్యానర్‌.

మరింతగా విస్తరించిన సంస్థ
వైనాట్‌ స్టూడియో కాలానికనుగుణంగా విస్తరించింది. వైనాట్‌ సంస్థ 2018లో వ్యాపార దిగ్గజం అనిల్‌ అంబానీతో జత గట్టి సంయుక్తంగా సినిమాలను నిర్మించడమే కాక డిస్ట్రిబ్యూట్‌ రంగంలోకి ప్రవేశించింది. వైనాట్‌ఎక్స్‌(YNOTX) ద్వారా మార్కెటింగ్‌ అండ్‌ డిస్ట్రిబ్యూట్‌ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వైనాట్‌ మ్యూజిక్‌ రంగంలోకి కూడా ప్రవేశించింది. ఈ పది సంవత్సరాల ప్రయాణానికి కారణమైన ప్రతి ఒక్కరికీ వైనాట్‌ వ్యవస్థాపకుడు శశికాంత్‌ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశాడు. అందరూ అందించిన ప్రోత్సాహాభిమానాలతో మరిన్ని మంచి సినిమాలతో ముందుకు సాగుతామని పేర్కొన్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top