
సమంతతో రొమాన్స్ చేయాలని...
ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్’తో ఫస్ట్ హ్యాట్రిక్ సాధించారు రాజ్ తరుణ్.
‘ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్’తో ఫస్ట్ హ్యాట్రిక్ సాధించారు రాజ్ తరుణ్. ఇప్పుడు చేసిన ‘సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు’ రెండో హ్యాట్రిక్‌కి నాంది అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో శ్రీమతి పూర్ణిమ ఎస్. బాబు సమర్పణలో ఎస్. శైలేంద్రబాబు, కేవీ శ్రీధర్ రెడ్డి, హరీశ్ దుగ్గిశెట్టి నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రాజ్ తరుణ్ చెప్పిన ముచ్చట్లు...
► ‘సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు’ ఐడియా నచ్చింది. శ్రీనివాస్ గవిరెడ్డి మంచి స్నేహితుడు. నా గత చిత్రాలకు భిన్నంగా, ఆ చిత్రాల తర్వాత నేనెలాంటి సినిమా చేస్తే బాగుంటుందో ఆలోచించి నా బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు ఈ కథ చేశాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథా చిత్రం ఇది. సీతమ్మ కోసం రాముడు అనే కుర్రాడేం చేశాడనేది కథ.
► వాస్తవానికి సోలో రిలీజైతే బాగానే ఉంటుంది. కానీ, అలా ఎప్పుడో ఒక్కసారే కుదురుతుంది. మొన్న సంక్రాంతికి 4 సినిమాలు విడుదలైతే, నాలుగూ ఆడాయి. సినిమాలో విషయం ఉంటే, అన్నీ ఆడతాయి. ఈరోజు విడుదలవుతున్న సినిమాలన్నీ ఆడాలని కోరుకుంటాను.
► నాకు సినిమా తప్ప వేరే ధ్యాస లేదు. అవకాశం ఉంటే 365 రోజులూ పని చేయాలనుకుంటాను. ఒక్కసారి సెట్‌లోకి అడుగుపెట్టానంటే ప్రపంచం మర్చిపోతాను. కనీసం ఫోన్ కూడా నా దగ్గర పెట్టుకోను. ఫ్రెండ్స్‌తో చిట్ చాట్ చేయను. పూర్తి దృష్టి షూటింగ్ పైనే ఉంటుంది.
► మాస్ హీరో అనిపించుకోవాలనే కోరిక లేదు. రెచ్చిపోయి ఫైట్స్ చేయాలనీ లేదు. మంచి నటుడు అనిపించుకోవాలన్నది నా ఆకాంక్ష. ప్రేమకథా చిత్రాలకన్నా మాస్ మూవీస్ చేస్తే కమర్షియల్‌గా డెవలప్ అవ్వొచ్చని అంటారు. కానీ, నా దృష్టిలో ప్రేక్షకులకు ఏది నచ్చితే అది కమర్షియల్ సినిమా అవుతుంది. ఉదాహరణకు ‘బొమ్మరిల్లు’, ‘కొత్త బంగారు లోకం’ వంటి ప్రేమకథా చిత్రాలను చెప్పుకోవచ్చు. అవి ప్రేక్షకులకు నచ్చడంవల్ల కమర్షియల్ మూవీస్ అయ్యాయి.
► నేను షూటింగ్స్‌కి ఆలస్యంగా వస్తాననే వార్త ప్రచారంలో ఉంది. ఆ వార్తలో ఎంత నిజం ఉందో నా దర్శక-నిర్మాతలను అడిగితే తెలుస్తుంది. ఇలాంటి రూమర్స్ వస్తున్నాయంటే.. నా గురించి ఏదో రకంగా అందరూ మాట్లాడుకుంటున్నారనే కదా అర్థం. సో.. రూమర్స్ వస్తే హ్యాపీనే.
► ఇప్పుడు నాకంటూ గుర్తింపు వచ్చింది కాబట్టి, పేరున్న హీరోయిన్ల సరసన నటించవచ్చు. నాకు సమంత అంటే చాలా ఇష్టం. ఏదైనా సినిమాలో ఆమెతో రొమాన్స్ చేసే ఛాన్సొస్తే, ఆనందపడతా. సమంతకు తమ్ముడిగా చేయమని ఎవరైనా కథ తీసుకొస్తే, వాళ్లను చంపేస్తా (నవ్వుతూ).
► ప్రస్తుతం మంచు విష్ణుతో ఓ పంజాబీ రీమేక్‌లో నటిస్తున్నా. విష్ణుని నా బ్రదర్‌లా భావిస్తున్నాను. ఈ సినిమా కాకుండా మరికొన్ని అవకాశాలు ఉన్నాయి. గీతా ఆర్ట్స్‌లో, ‘దిల్’ రాజుగారి బ్యానర్‌లో సినిమాలు ఒప్పుకున్నా.