ప్రతినాయకుడిగా డాక్టర్ శరవణన్

ప్రతినాయకుడిగా డాక్టర్ శరవణన్


నిజ జీవితంలో ఎందరో రోగుల ప్రాణాల్ని కాపాడుతున్న వైద్యుడిని తన చిత్రంలో విలన్‌గా చూపించానని దర్శకుడు శ్రీ మహేశ్ తెలిపారు. ఇంతకుముందు శరత్‌కుమార్ హీరోగా చత్రపతి చిత్రాన్ని తెరకెక్కించిన ఈయన చాలా గ్యాప్ తరువాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం చరిత్తిరం పేసు. అయ్యనార్ ఫిలింస్ పతాకంపై యోగేశ్వరన్ బోస్ నిర్మిస్తూ ఒక కథా నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా పసంగ చిత్రం ఫేమ్ ధరణి నటించారు.



మరో యువ జంటగా కృప, కన్నిక నటించారు. డాక్టరు శరవణన్ ప్రతి నాయకుడిగా నటించిన ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ చరిత్తరం పేసు కమర్షియల్ అంశాలతో కూడిన విభిన్న కథా చిత్రం అన్నారు. ఈ చిత్రంలో గౌరవం కోసం క్రూరంగా హత్యలు చేసే విలన్ పాత్రలో డాక్టర్ శరవణన్ నటించారన్నారు. నిజ జీవితంలో ఎందరో రోగుల ప్రాణాలకు కాపాడుతూ హీరోగా పేరొందిన డాక్టర్ శరవణన్ ఇందులో విలన్‌గా చూపించడం విశేషం అన్నారు. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రం తుది ఘట్ట సన్నివేశాల చిత్రీకరిస్తున్న సమయంలో తాను అనారోగ్యానికి గురవ్వగా చెన్నై నుంచి మదురైకి అంబులెన్స్‌లో తీసుకెళ్లి తన వైద్యంతో ప్రాణాలను కాపాడిన గొప్ప మానవతావాది శరవణన్ అని తెలిపారు.



అలా ఆయన ఎందరో రోగులకు ప్రాణభిక్ష పెట్టారన్న విషయం తెలుసుకున్నానని చెప్పారు. ఇక చరిత్తిరం పేసు చిత్రం విషయానికొస్తే ఒక యువతి ప్రేమ కారణంగా హీరోకు, విలన్‌కు జరిగే పోరాటమే చిత్ర కథ అని తెలిపారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం గీతాలావిష్కరణ కార్యక్రమం గురువారం జరిగాయి. నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను చిత్ర ఆడియోను ఆవిష్కరించగా తొలి ప్రతిని దర్శకుడు పేరరసు అందుకున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top