నా రూటే సపరేటు అంటున్న హీరో | Vijay Antony Releases First 7 Minutes Of Upcoming Movie Kaasi | Sakshi
Sakshi News home page

నా రూటే సపరేటు అంటున్న హీరో

May 15 2018 5:51 PM | Updated on Oct 22 2018 6:10 PM

Vijay Antony Releases First 7 Minutes Of Upcoming Movie Kaasi - Sakshi

ఈ రోజుల్లో సినిమా తీయడమే చాలా కష్టమైన పని అంటే.. విడుదలయ్యే వరకు దాన్ని గోప్యంగా ఉంచడం మరింత కష్టమైపోతుంది. కొన్ని కోట్లు ఖర్చుపెట్టి తీసే సినిమాలో విడుదలకు ముందే ఏవైనా సన్నివేశాలు బయటకు వస్తే చాలా ఇబ్బంది అవుతుంది దర్శక, నిర్మాతలకు. గతంలో పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ల సినిమా ‘అత్తారింటికి దారేది’ విడుదలకు ముందే తొలి భాగం లీక్‌ అయ్యి గందరగోళం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఓ హీరో ధైర్యం చేసి తన సినిమాలోని తొలి ఏడు నిమిషాలను తానే స్వయంగా విడుదల చేస్తున్నాడంటే నిజంగానే సాహసం చేస్తున్నాడని అనాలి. ఈ సాహసం చేస్తున్న నటుడు, నిర్మాత విజయ్‌ ఆంటోని. ఈ తమిళ హీరో త్వరలో విడుదల కాబోయే తన ‘కాశీ’ సినిమా కోసం ఇంత సాహసం చేస్తున్నట్లు సమాచారం.

తాను మూస సినిమాలు చేయనని ‘బిచ్చగాడు’ చిత్రంతో నిరూపించుకున్నాడు విజయ్‌ ఆంటోని. విజయ్‌ నటించిన సినిమా అంటేనే ఏదో ప్రత్యేకత ఉంటుందనే అభిప్రాయాన్ని ప్రేక్షకుల్లో కలిగించాడు. అలానే సినిమా ప్రచార కార్యక్రమాలను కూడా వినూత్న రీతిలో చేస్తుంటాడు. అలానే త్వరలో విడుదల కాబోతున్న ‘కాశీ’ సినిమా ప్రచార కార్యక్రమాలను కూడా ఇదే విధంగా నిర్వహించనున్నట్లు సమాచారం. ఈసారి ఏకంగా సినిమాలోని మొదటి ఏడు నిమిషాల సన్నివేశాలను సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది.

ఉదయనిధి దర్శకత్వంలో విజయ్‌ ఆంటోని హీరోగా నటించిన చిత్రం ‘కాశీ’. అంజలి కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. భావోద్వేగాలకు, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌కు ఈ సినిమాలో పెద్దపీట వేసినట్లు విజయ్‌ ఆంటోని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement