
కోల్‌కతా: బెంగాలీ ప్రముఖ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ తపస్‌పాల్ (61) గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మంగళవారం ఉదయం నాలుగు గంటలకు కన్నుమూసినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. తపస్‌పాల్ తన కుమార్తెను చూడటానికి ముంబై వెళ్లి తిరిగి విమానంలో కొల్‌కతాకు వచ్చేటప్పుడు.. విమానాశ్రయంలో ఛాతిలో నొప్పి వస్తోందని సిబ్బందికి తెలిపారు. దీంతో ఆయనను జుహులోని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ.. తపస్‌పాల్ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. గతంలో కూడా తపస్‌పాల్ గుండె జబ్బుల కారణంగా పలుమార్లు ఆస్పత్రి పాలయ్యారు. తపస్పాల్‌కు భార్య నందిని, కుమార్తె సోహిని పాల్ ఉన్నారు.
కాగా తపస్‌పాల్ పశ్చిమ బెంగాల్‌లోని చందన్‌నగర్‌లో జన్మించారు. హూగ్లీ మొహ్సిన్ కాలేజీలో బయోసైన్స్ చదివారు. సినిమాల మీద మక్కువతో ..1980లో దర్శకుడు తరుణ్ మజుందార్ దర్శకత్వంలో తెరకెక్కిన దాదర్ కీర్తి సినిమాతో బెంగాలీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. పలు విజయవంతమైన సినిమాల్లో నటించారు. 1984లో తపస్‌పాల్.. మాధురీ దీక్షిత్‌తో కలిసి అబోద్ చిత్రంలో నటించారు. హిరెన్ నాగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా గుర్తింపు పొందారు. సినిమాల్లోనే కాకుండా తపస్‌పాల్ రాజకీయాల్లో కూడా రాణించారు. ఆయన తృణముల్ కాంగ్రెస్‌లో ఎంపీగా గెలిచి సేవలందించారు.