దేశీ టచ్‌తో విదేశీ కథలు

Two American Films Are Remake In Hindi - Sakshi

దక్షిణాది చిత్రాలు ఉత్తరాదిన రీమేక్‌ కావడం... ఉత్తరాది హిట్లు దక్షిణాదిన రీమేక్‌ కావడం సహజం. అయితే విదేశీ చిత్రాలు ఇక్కడ రీమేక్‌ కావడం అరుదుగా జరుగుతుంటుంది. అలాంటిది ఒకేసారి రెండు అమెరికన్‌ చిత్రాలు, ఒక జర్మన్‌ థ్రిల్లర్, ఒక సౌత్‌ కొరియన్‌ మూవీ హిందీలో రీమేక్‌ కావడం విశేషం. ఈ విదేశీ కథలకు దేశీ టచ్‌ ఇచ్చి రీమేక్‌ చేస్తున్నారు. ఆ నాలుగు చిత్రాల కథా కమామీషు తెలుసుకుందాం.

కొరియా ఈసారైనా కలిసొచ్చేనా?
ఓ ధనవంతుడి నిజస్వరూపాన్ని బయట పెట్టేందుకు డిటెక్టివ్‌గా మారనున్నారు సల్మాన్‌ ఖాన్‌. సౌత్‌ కొరియాలో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల టాప్‌ టెన్‌ లిస్ట్‌లో ఉన్న ‘వెటరన్‌’ (2015) హిందీ రీమేక్‌లోనే ఆయన డిటెక్టివ్‌గా కనిపించనున్నారు. ‘వెటరన్‌’ హిందీ రీమేక్‌ హక్కులను దర్శక–నిర్మాత, నటుడు అతుల్‌ అగ్నిహోత్రి దక్కించుకున్నారు. వ్యాపారం ముసుగులో ఓ యువ వ్యాపారవేత్త నేరాలకు పాల్పడుతుంటాడు. ఆ నేరాలను నిరూపించేందుకు ఓ డిటెక్టివ్, అతని బృందం ప్రయత్నాలు చేస్తుంటారు. ఫైనల్‌గా ఈ కేసును డిటెక్టివ్‌ ఎలా పరిష్కరించాడన్నదే కథ. సల్మాన్‌కి తొలి సౌత్‌ కొరియన్‌ చిత్రం కాదిది.  2017లో విడుదలైన సౌత్‌ కొరియన్‌ మూవీ ‘ఓడ్‌ టు మై ఫాదర్‌’ హిందీ రీమేక్‌ ‘భారత్‌’లో ఆయన హీరోగా నటించారు. ‘భారత్‌’ బాక్సాఫీసు వద్ద సరైన ఫలితం ఇవ్వలేదు. మరి.. సల్మాన్‌ కమిట్‌ అయిన మరో సౌత్‌ కొరియన్‌ మూవీ ‘వెటరన్‌’ రీమేక్‌ హిట్‌ అవుతుందా? వేచి చూడాలి.

లాల్‌సింగ్‌ ప్రయాణం 
ఆరు ఆస్కార్‌ అవార్డులు దక్కించుకున్న అమెరికన్‌ ఫిల్మ్‌ ‘ది ఫారెస్ట్‌గంప్‌’ (1994). విన్‌స్టన్‌ గ్రూమ్‌ రాసిన ‘ఫారెస్ట్‌ గంప్‌’ నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. ఈ సినిమా ఇప్పుడు హిందీలో ‘లాల్‌సింగ్‌ చద్దా’గా రీమేక్‌ అవుతోంది. ఆమిర్‌ ఖాన్‌ టైటిల్‌ రోల్‌లో అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక.. ‘ఫారెస్ట్‌గంప్‌’ కథ విషయానికి వస్తే... ఓ పిల్లాడు మానసిక సమస్యతో ఇబ్బందిపడుతుంటాడు. పైగా కాళ్లు సరిగా ఉండవు. ఓ సందర్భంలో అతని కాళ్లు బాగుపడతాయి. ఆ తర్వాత అతను మిలటరీకి వెళతాడు. అక్కడ ఓ స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం వారి కుటుంబ సభ్యుల బాగోగులకు బాధ్యత వహిస్తాడు. మిలటరీ నుంచి రిటైర్‌ అయిన తర్వాత ఓ బోటు ఓనర్‌గా మారి ధనవంతుడు అవుతాడు. ఆ తర్వాత తన గురించి తాను తెలుసుకోవడానికి దేశంలో సుదీర్ఘ దూరం పరిగెడతాడు. ప్రేయసిని వెతుక్కుంటూ వెళతాడు. ఇలా ఓ వ్యక్తి జీవితంలోని ముఖ్యమైన సంఘటనల సమాహారమే ‘ది ఫారెస్ట్‌ గంప్‌’ చిత్రం.
ప్రియుడి కోసం సాహసం 
ప్రియుడి క్షేమం కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధం అంటున్నారు హీరోయిన్‌ తాప్సీ. ‘లూప్‌ లపేటా’ చిత్రంలో తన లవర్‌ కోసం సాహసాలు చేయబోతున్నారామె. 1998లో వచ్చిన జర్మన్‌ థ్రిల్లర్‌ ‘రన్‌ లోలా రన్‌’కి ‘లూప్‌ లపేటా’ హిందీ రీమేక్‌. ఈ చిత్రానికి ఆకాష్‌ భాటియా దర్శకత్వం వహిస్తారు. 71వ ఆస్కార్‌ వేడుకల్లో ‘రన్‌ లోలా రన్‌’ చిత్రం ఉత్తమ విదేశీ విభాగంలో నామినేషన్‌ ఎంట్రీ పోటీలో నిలిచింది. అయితే నామినేషన్‌ దక్కకపోయినా ‘రన్‌ లోలా..’ మంచి సినిమాగా ప్రేక్షకుల కితాబులందుకుంది. ఈ చిత్రకథ విషయానికి వస్తే... ఒకతను డబ్బు ఉన్న బ్యాగుతో ట్రైన్‌లో ప్రయాణిస్తుంటాడు. కానీ అది అక్రమ సొత్తు. డబ్బు ఉన్న ఆ బ్యాగుని రైల్వే అధికారులు పరిశీలిస్తారనే భయంతో అతను ఆ బ్యాగును ట్రైన్‌లో వదిలి వెళ్లిపోతాడు. ఇంతలో అతని బాస్‌ ఫోన్‌ చేసి 20 నిమిషాల్లో తన డబ్బు తనకు కావాలని బెదిరిస్తాడు. జరిగిన విషయాన్ని తన ప్రేయసికి చెబుతాడు అతను. ఆమె తన తండ్రి దగ్గర లేదా ఏదైనా బ్యాంకులో డబ్బు కోసం ప్రయత్నిద్దామని చెబుతుంది. కుదరకపోవడంతో వారు ఓ సూపర్‌మార్కెట్‌లో దొంగతనం చేయాల్సి వస్తుంది. కానీ ఇద్దరిలో ఒకర్ని పోలీసులు పట్టుకుంటారు. ఒకర్ని తుపాకీతో కాలుస్తారు. మరి.. బాస్‌కు డబ్బు అందిందా? ప్రియుడ్ని ఆ యువతి ఎలా రక్షించుకుంది? అన్నదే కథ.
మిస్సింగ్‌ మిస్టరీ 
అమెరికన్‌ మిస్టరీ థ్రిల్లర్‌ మూవీ ‘ద గాళ్‌ ఆన్‌ ద ట్రైన్‌’ (2016). రచయిత పౌలా హాకిన్స్‌ రాసిన నవలల్లో అత్యధికంగా అమ్ముడుపోయిన నవల ‘ద గాళ్‌ ఆన్‌ ద ట్రైన్‌’ (2016) ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. హిందీలో అదే టైటిల్‌తో ఈ సినిమా రీమేక్‌ అవుతోంది. రిబుదాస్‌ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పరిణీతీ చోప్రా నటిస్తున్నారు. ఓ మహిళకు మద్యం తీసుకునే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు వల్ల ఆమె వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితంలో చాలా సమస్యలు తలెత్తుతాయి. ఓ మిస్సింగ్‌ కేసులోనూ ఇరుక్కుంటుంది. అసలు.. ఈ మిస్టరీ వెనక ఉన్న సూత్రధారి ఎవరు? ఈ సంఘటన తర్వాత ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది? అన్నదే కథ. విదేశీ కథలు మనకు నచ్చుతాయా? అంటే మన నేటివిటీకి తగ్గట్టు ఉంటే నచ్చుతాయి. ఈ నాలుగు చిత్రాల దర్శకులు కథలో మార్పులు చేశారు. మరి.. ఈ రీమేక్స్‌ బాక్సాఫీస్‌ వద్ద గెలుస్తాయా? వేచి చూద్దాం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top