విలక్షణమైన, వైవిధ్యభరితమైన సినిమాలు, అద్బుతమైన నటనతో సినీ అభిమానులను అలరించే ప్రముఖ నటుడు కమలహాసన్ ఉత్తమ విలన్ సినిమా ప్రమోషన్ సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చెన్నై: విలక్షణమైన, వైవిధ్యభరితమైన సినిమాలు, అద్బుతమైన నటనతో సినీ అభిమానులను అలరించే ప్రముఖ నటుడు కమలహాసన్ ఉత్తమ విలన్ సినిమా ప్రమోషన్ సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తన సినిమాలు వివాదాస్పదం కావడం, విడుదల లేటవ్వడంపై స్పందించారు. తనను కావాలనే టార్గెట్ చేసి, నిరంతరం ఇబ్బంది పెడుతున్నారని , అయినా తాను వెరవనన్నారు. ''నా దారి ముళ్లదారి..సమస్యలు, సవాళ్లు నాకు అలవాటే... అయినా నా పయనం ఆగదు'' అంటున్నారు ఈ 60 ఏళ్ల సీనియర్ నటుడు. పాపనాశం సినిమా వివాదం ఎవరు సృష్టించారో తనకు తెలుసన్నారు. సాండియార్ టైటిల్ ఇలా సినిమా ప్రకటించానో అలా వివాదం మొదలైందని... మరి అదే పేరుతో సినిమా విడుదలైనా ఎవరూ ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. పాపనాశం, విశ్వరూపం -2 సినిమాల ఆలస్యానికి కూడా ఇలాంటి వివాదాలే కారణమన్నారు.
మరోవైపు సినిమాలో కీలకమైన సెన్సార్ బోర్డుపై ఆయన విమర్శలు గుప్పించారు. ముంబై ఎక్స్ప్రెస్ సినిమా టైటిల్ వివాదాన్ని గుర్తు చేశారు. ముంబై అనే మాట తమిళభాషలో లేదని అభ్యంతరం చెప్పారనీ, మరి తమిళ భాషలో ముంబైని ఏమంటామని ఆయన ప్రశ్నించారు. సెన్సార్ బోర్డు భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని మండిపడ్డారు. కళాకారుడినైన తనకు ఏదైనా మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కు ఉంటుందని తెలిపారు.
''నేను పనీపాటా లేకుండా కూర్చోలేను. ప్రేక్షకులను మంచి సినిమాలతో ఆకట్టుకోవడకోవడమే నా ఆశయం. నానుంచి వారు ఆశిస్తున్న దాన్ని అందించడంకోసం నిరంతరం తపన పడతాను'' అన్నారు కమల్. విశ్వరూపంలో సినిమా ముస్లింలను కించపరిచేలా ఉందని వివాదం చెలరేగడంతో వినూత్న రీతిలో డీటీహెచ్ మీడియా ద్వారా సినిమాను విడుదల చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా కమల్ తమిళంలో మరోనూతన ప్రాజెక్టు పనులు ప్రారంభించినట్టు తెలుస్తోంది.