టాలీవుడ్‌ హీరోల రెమ్యూనరేషన్‌!

 Tollywood top actors remuneration - Sakshi

తెలుగు సినిమా అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతోంది. తెలుగు టాప్‌ హీరోల సినిమాలు ఓవర్సీస్‌ మార్కెట్‌లోనూ పెద్ద మొత్తాలను రాబడుతున్నాయి. టాలీవుడ్‌లో స్టార్‌ వారసులదే హవా అని చెప్పాలి. ప్రస్తుతం అగ్రనటులుగా కొనసాగుతున్నవారిలో ఎక్కువమంది వారసులే. ఇక, తమిళ సినిమాతో పోల్చుకుంటే టాలీవుడ్‌లో పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందని ట్రేడ్‌ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. తమిళ సినిమాలు గొప్పగా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నా.. నిర్మాతలకు భారీ నష్టాలు తప్పడం లేదు. ఇందుకు కారణం తమిళ హీరోల రెమ్యూనరేషనేనని సినీ విమర్శకులు అంటున్నారు. హీరోలు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్‌ తీసుకుంటుండటంతో నిర్మాతలకు భారీ నష్టాలు తప్పడం లేదని అంటున్నారు. ఈ విషయమై స్టూడియో గ్రీన్‌ ఫేమ్‌ అధినేత, నిర్మాత జ్ఞానవేల్‌ రాజ బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘తెలుగు పెద్ద హీరోలు వందకోట్ల బిజినెస్‌ చేస్తున్నప్పటికీ వేతనంగా రూ. 15 కోట్లు మాత్రమే తీసుకుంటున్నారు. సహేతుకమైన రెమ్యూనరేషన్‌ తీసుకుంటూ ఎంత ఎదిగినా ఒదిగి ఉంటున్నారు. అదే కోలీవుడ్‌లో అయితే, టాలీవుడ్‌ హీరోల స్టేటస్‌ ఉన్న నటులు రూ. 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారు. మన హీరోలకు స్వప్రయోజనాలపైనే ధ్యాస ఎక్కువ. టాలీవుడ్‌ నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉంది’  అని జ్ఞానవేల్‌ రాజా అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. తాను తమిళంలో సినిమాలు తీయబోనని, తెలుగులోనే సినిమాలు నిర్మిస్తానని ఆయన హెచ్చరించారు.

ఇటీవల జరిగిన కోలీవుడ్‌ సమ్మె.. మొదట డిజిటల్‌ సర్వీస్‌ ప్రోవైడర్లకు వ్యతిరేకంగా ప్రారంభమవ్వగా.. ఆ తర్వాత ఇండస్ట్రీలోని అనేక అంతర్గత విషయాలు తెరమీదకు వచ్చాయి. ఇందులో హీరోలు భారీగా రెమ్యూనరేషన్లు పెంచడంపైనా తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ హీరోలు ఎంత రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారన్నది చర్చనీయాంశమైంది. ట్రేడ్‌ వర్గాల అంచనాల ప్రకారం తెలుగు హీరోలు తీసుకుంటున్న రెమ్యూనరేషన్‌ వివరాలివి..

మహేశ్‌బాబు
బాలనటుడిగా సినీ పరిశ్రమకు పరిచయం అయి.. తండ్రి బాటలోనే హీరో అయ్యాడు మహేశ్‌బాబు. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇటీవల తన రెండు సినిమాలు (బ్రహ్మోత్సవం, స్పైడర్‌) పరాజయం పాలవ్వడం నిరాశ కలిగించిందని ఆయన ఓపెన్‌గానే చెప్పారు. ఆయన తాజా సినిమా ‘భరత్‌ అనే నేను’ మొదటిరోజు నుంచి సూపర్‌హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్న హీరోల్లో మహేశ్‌బాబు ఒకరు. ఆయన సినిమాకు రూ. 18 కోట్ల వరకు తీసుకుంటారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌
గడిచిన కొన్నాళ్లుగా జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాలు వరుసగా సూపర్‌హిట్‌ అవుతున్నాయి. టెంపర్‌, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్‌, జైలవకుశ సినిమాలు ఆయనకు విజయాలు అందించాయి. ఇవి కమర్షియల్‌ సినిమాలు అయినప్పటికీ సామాజిక సందేశాన్ని అందించే ప్రయత్నం చేశారాయన. గడిచిన కొన్నాళ్లుగా రూ. 18 నుంచి 20 కోట్ల వరకు ఎన్టీఆర్‌ రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, ఎస్‌ఎస్‌ రాజమౌళితో సినిమాలు చేస్తున్న ఎన్టీఆర్‌ తన రెమ్యూనరేషన్‌ను మరింత పెంచే అవకాశముందని భావిస్తున్నారు.

పవన్‌ కల్యాణ్‌
పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సినిమాల్లోకి వచ్చి దాదాపు 22 ఏళ్లు అవుతోంది. 23 సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. 2017లో ఆయన సినిమా ఒక్కటే విడుదలైంది. ఈ సినిమాకు రూ. 18 కోట్లు రెమ్యూనరేషన్‌ తీసుకున్నారు. 2018లో వచ్చిన అజ్ఞాతవాసి బాక్సాఫీస్‌ను ముంచేసింది. ఈ సినిమా నష్టాలను మిగిల్చింది. ప్రస్తుతం పవన్‌ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.

ప్రభాస్‌..
టాలీవుడ్‌లో డార్లింగ్‌ అని ముద్దుగా పిల్చుకునే ప్రభాస్‌ ఇమేజ్‌ బాహుబలి సిరీస్‌తో అమాంతం ఆకాశానికి ఎగబాకింది. బాహుబలి-2కు ప్రభాస్‌ రూ. 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్‌ తీసుకున్నట్టు కథనాలు వచ్చాయి. ప్రస్తుతం ప్రభాస్‌ ‘సాహో’ సినిమాతోపాటు ఓ బాలీవుడ్‌ సినిమా చేస్తున్నారు. మహేశ్‌, పవన్‌ను మించి ప్రభాస్‌ రెమ్యూనరేషన్‌ ఉంటుందని భావిస్తున్నారు.

అల్లు అర్జున్‌
‘సరైనోడు’ సినిమాతో సూపర్‌హిట్‌తోపాటు దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు బన్నీ. ఈ సినిమా హిందీ డబ్బింగ్‌ యూట్యూబ్‌లో మోస్ట్‌ వాచెడ్‌ మూవీగా నిలిచింది. తాజాగా వచ్చిన ‘దువ్వాడ జగన్నాథం’ కూడా భారీ వసూళ్లతో సూపర్‌హిట్‌ అయింది. వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తున్న బన్నీ.. ఒక్కో సినిమాకు రూ. 14 కోట్ల వరకు రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. బన్నీ తాజా మూవీ ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ వచ్చే నెల 4న విడుదల కానుంది.

రాంచరణ్‌
చెర్రీ ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్దం అవుతోంది. ఇప్పటివరకు పది సినిమాలు చేశాడు. ఇందులో తొమ్మిది సినిమాలు హిట్టు. ఇటీవల తండ్రి చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్‌ 150’ని చెర్రీ స్వయంగా నిర్మించాడు. సినిమాకు రూ. 10 నుంచి 14 కోట్ల వరకు చెర్రీ వసూలు చేస్తున్నాడు. తాజా సినిమా ‘రంగస్థలం’ సూపర్‌హిట్‌ అయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటిస్తుండటంతో రెమ్యూనరేషన్‌ మరింత పెంచే అవకాశముంది.

రవితేజ
టాలీవుడ్‌ మాస్‌ మహారాజ రవితేజకు మంచి కమర్షియల్‌ ఇమేజ్‌ ఉంది. కొన్ని పరాజయాల అనంతరం ‘రాజా, దీ గ్రేట్‌’ సినిమాతో రవితేజ విజయాన్ని అందుకున్నాడు. ఇటీవల వచ్చిన ‘టచ్‌ చేసి చూడు’  నిరాశ పరిచింది. ఒక్కో సినిమాకు రవితేజ రూ. 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top