నచ్చితే మళ్లీ నటిస్తా..

Today Shobana Classical Dance Programme In Hyderabad - Sakshi

నటి, నృత్యకారిణి శోభన

నేడు సిటీలో ‘ట్రాన్స్‌’ పేరిట  ప్రదర్శన

సాక్షి, సిటీబ్యూరో : ‘శోభనా చంద్రకుమార్‌’ అంటే తెలియని వారు ఉండొచ్చు కానీ.. ‘శోభన’ అంటే తెలియని సినీ ప్రేమికులు అరుదే. దాదాపు 230 సినిమాల్లో నటించి, అన్ని భాషల సినీ ప్రేక్షకులకూ చిరపరిచితమైన నిన్నటి తరం నటి శోభన.. ఇప్పుడు మాత్రం సంప్రదాయ కళాభిమానులకు అభిమాన నృత్యకారిణి. సినీ కెరీర్‌కు విరామమిచ్చి సంప్రదాయ నృత్యంలో పేరు మోసిన ట్రావెన్‌కోర్‌ సిస్టర్స్‌ వంశ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఈ మేటి నటీ నర్తకి నృత్యానికి నగరంలోనూ ఆదరణ అధికమే. నగరానికి చెందిన ఎన్‌జీఓ వికేర్‌ ఆధ్వర్యంలో నేడు సాయంత్రం 7 గంటలకు శిల్పకళావేదికలో సరికొత్త శైలిలో ‘ట్రాన్స్‌–డ్యాన్సింగ్‌ డ్రమ్స్‌’ పేరిట నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఆమె పలు విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. 

సినిమాకు దూరం కాలేదు..
ఒక మంచి స్క్రిప్ట్‌తో ఎవరైనా సంప్రదిస్తే నటించడానికి అభ్యంతరం లేదు. అయితే దాన్నుంచి నేనేమైనా నేర్చుకునేది ఉంటుందా? అది నన్ను అభిమానించే ప్రేక్షకులను నిరాశపరచకుండా ఉంటుందా? ఇవన్నీ మన చేతుల్లో లేని విషయాలు కదా! అయితే సినిమాకు నేను పూర్తిగా మాత్రం దూరం కాలేదు. ఏదో రకంగా నా ప్రయాణం దానితో ముడిపడే సాగుతోంది. నేనూ స్క్రిప్ట్స్‌ రాస్తాను.. వింటాను. వాటి గురించి ఇతరులతో చర్చిస్తుంటాను. 

ప్రస్తుత సినిమాలపై..
నాకు ప్రస్తుతం సినిమాలు చూసే సమయం లేదు. ఇది కాస్త చికాకు తెప్పించేదే. అయితే కొచ్చిలో ఉన్న నా మేనల్లుడిని తరచుగా సిని మాల గురించి, సృజనశీలుర గురించిన విశేషాలు చెప్పమని అడుగుతుంటా. అయితే ఒకటి చెప్పగలను.. ప్రస్తుత తరం నటన ఒక కేటగిరీకి పరిమితమైంది కాదు. కొంత మంది సీనియర్‌ ఆర్టిస్టులను తమకు పునాదిగా మలచుకుంటుంటే కొందరు తమను తామే మోటివేట్‌ చేసుకుంటున్నారు.  

డ్యాన్సింగ్‌ డ్రమ్స్‌’ గురించి..
ప్రేక్షకులు ఎప్పుడూ నేను సృజనాత్మకంగా ఏం అందిస్తానా అని ఎదురు చూస్తుంటారు. నాకు తెలిసిన అన్ని మాధ్యమాలను మేళవించి ‘డ్యాన్సింగ్‌ డ్రమ్స్‌’ను నేను సృష్టించాను. అందుకే దీన్ని ట్రాన్స్‌ అంటున్నాను. నా గత ప్రదర్శనలు మాయా రావణ్, కృష్ణా.. కోసం ఏడాది పాటు పరిశోధించాల్సి వచ్చింది. అలాగే ఈ ట్రాన్స్‌–డ్యాన్సింగ్‌ డ్రమ్స్‌ కూడా ఎంతో మధనం నుంచి పుట్టిందే. ఇది రికార్డెడ్‌ ట్రాక్స్‌ కన్నా ఎక్కువగా ప్రత్యక్ష వాయిద్యాల మీద ఆధారపడుతుంది. ‘తవ్లి’ అనే వాయిద్యంతో పాటు ఇతర ఇన్‌స్ట్రుమెంట్స్‌ మీద ఐదేళ్లు పనిచేశా.  

నేటి మోడ్రన్‌.. రేపటి ట్రెడిషన్‌..
ఇండియన్‌ క్లాసికల్‌ని ఎలక్ట్రానిక్‌ మ్యూజిక్‌ని దీని కోసం మేళవింపు ఎందుకనే ప్రశ్నకు నా సమాధానం.. ఇప్పుడు ఏదైతే ఆధునికం అంటున్నామో కొన్ని తరాల తర్వాత అదే సంప్రదాయం అవుతుందనేది పరిశోధకులు కూడా అంగీకరించిన విషయం. ఆ ఆలోచనే ‘ట్రాన్స్‌’కు నేపథ్యం. కవిత్వం, హిందూ పురాణ కథలు, లైవ్‌–ప్రీ రికార్డెడ్‌ మ్యూజిక్, శివ, విష్ణు అవతారాలు.. వెరసి ఈ ప్రదర్శన గంటన్నర పాటు సాగుతుంది. నృత్యంతో పాటు కళాకారులు డ్రమ్స్‌ కూడా పలకిస్తుంటారు. ప్రస్తుతం ట్రాన్స్‌ వరల్డ్‌ టూర్‌లో భాగంగా కెనడా, నార్త్‌ అమెరికా పూర్తి చేసుకున్నా. మన దేశంలో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ తర్వాత అక్టోబరులో వైజాగ్‌లో ట్రాన్స్‌ ప్రోగ్రామ్‌ ఉంటుంది. కళ అంటే సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే అద్భుత ప్రదర్శన.  

తదుపరి ప్రాజెక్ట్
ప్రస్తుతం ఔత్సాహికులు, చిన్నారుల కోసం చెన్నైలో ‘కళార్పణ’ నృత్య పాఠశాల నిర్వహిస్తున్న విషయం మీకు తెలిసిందే. సీనియర్‌ నృత్యకళాకారుల కోసం భరతనాట్యంలో బాచిలర్స్, మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభించాలని అనుకుంటున్నాను.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top