‘‘ప్రేక్షకుడు చాలా తెలివైనవాడు. విశ్లేషణాత్మకమైన పరిశీలన కలవాడు. సినిమాను పద్ధతిగా తీస్తే తప్పకుండా ఆదరిస్తాడు’’ అంటున్నారు నిర్మాత కేఎల్ దామోదరప్రసాద్.
'ఎవరి సినిమాకు వారే విమర్శకులవ్వాలి'
Sep 27 2013 1:49 AM | Updated on Aug 28 2018 4:30 PM
‘‘ప్రేక్షకుడు చాలా తెలివైనవాడు. విశ్లేషణాత్మకమైన పరిశీలన కలవాడు. సినిమాను పద్ధతిగా తీస్తే తప్పకుండా ఆదరిస్తాడు’’ అంటున్నారు నిర్మాత కేఎల్ దామోదరప్రసాద్. ‘అలామొదలైంది’, ‘అంతకుముందు ఆ తర్వాత’ చిత్రాల ద్వారా అభిరుచి గల నిర్మాతగా గుర్తింపుతెచ్చుకున్న దాము గురువారం హైదరాబాద్‌లో పత్రికల వారితో ముచ్చటించారు.
‘‘ఇటీవలే ‘అంతకుముందు ఆ తర్వాత’ ప్రచార పర్వంలో భాగంగా నిజామాబాద్ వెళితే... ఓ నేల టిక్కెట్ ప్రేక్షకుడు ‘మీ సినిమాలో ఫొటోగ్రఫీ బాగుంది సార్’ అన్నాడు. అతనికి కెమెరా డిటైల్స్ తెలీక పోవచ్చు. కానీ కెమెరా పనితనానికి కనెక్ట్ అయ్యాడు. అలాగే ఈ సినిమాలోనే ఓ అయిదు సెకన్ల పాటు ఓ మొబైల్ నంబర్ కనిపిస్తుంది.
అది మా సహ నిర్మాత నంబర్. అలా కనిపించి, ఇలా మాయమయ్యే ఆ నంబర్‌కి విపరీతమైన ఫోన్లు. అంటే ఒక సినిమాను ప్రేక్షకులు ఎంత పరిశీలనగా చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రేక్షకుని స్థాయికి తగ్గ సినిమాలే తీయాలని నిర్ణయించుకున్నాను’’ అని చెప్పారు దాము.
ఇంటిల్లిపాదీ మెచ్చే బాధ్యతాయుతమైన కథలతోనే ఇక నుంచి సినిమాలు తీస్తానని, ఎవరి సినిమాకు వారే విమర్శకులైనప్పుడు మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంటుందని దాము అభిప్రాయపడ్డారు. ఆరో వారంలో కూడా తమ సినిమాకు ప్రేక్షకాదరణ తగ్గలేదని, త్వరలోనే యాభైరోజుల వేడుకను కూడా ఘనంగా జరుపుతామని దాము తెలిపారు.
Advertisement
Advertisement