‘నా జీవితానికి శక్తినిచ్చిన ‘రాక్షసుడు’’

Tamil Actor Vinod Kumar About Rakshasudu - Sakshi

అవకాశాలు అంత తొందరగా రావు. వాటి కోసం పోరాడి సాధించుకుని నలుగురుని మెప్పిస్తే కలిగే సంతోషమే వేరు. మరో విషయం ఏమిటంటే కొన్ని పాత్రలు కొందరు చేస్తేనే నప్పుతాయి. అందుకే ఒక భాషలో వచ్చిన చిత్రాన్ని మరో భాషలో రీమేక్‌ చేసినా, అందులో ఒరిజినల్‌ చిత్రంలో పాత్ర పోషించిన నటుడినే వరిస్తాయి. నటుడు వినోద్‌సాగర్‌ విషయంలోనూ అదే జరిగింది.

తమిళంలో విష్ణువిశాల్, అమలాపాల్‌ జంటగా నటించిన చిత్రం రాక్షసన్‌. రామ్‌కుమార్‌ తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఇందులో వినోద్‌సాగర్‌ ఉపాధ్యాయుడి పాత్రలో నటించి విలనిజాన్ని రక్తికట్టించాడు. ఆ పాత్రలో మంచి పేరు తెచ్చుకున్నాడు. కాగా అదే చిత్రం తెలుగులో రాక్షసుడు పేరుతో రీమేక్‌ అయ్యింది.

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్‌ నటించారు. ఈ సినిమాలో విలన్‌ పాత్ర మాత్రం తమిళంలో నటించిన వినోద్‌సాగర్‌నే వరించింది. తమిళంలో మాదిరిగానే తెలుగులోనూ ఆయన నటనకు మంచి పేరు వచ్చింది. ఈ ఆనందాన్ని ఆయన పంచుకుంటూ తాను దుబాయ్‌లో రేడీయో జాకీగా పని చేసి ఆ తరువాత చెన్నైకి వచ్చానన్నారు. ఇక్కడ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా చేరి ఆపై నటుడిగా మారానని తెలిపారు.

తన సినీ జీవితంలో ఇంటిని, తల్లిదండ్రుల్ని చాలా మిస్‌ అయ్యానని చెప్పారు. అలాంటి సమయంలో రాక్షసన్‌ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందన్నారు. ఆ చిత్రం తెలుగులోనూ రీమేక్‌ కావడంతో అందులోని ఉపాధ్యాయుడి పాత్రను మీరే పోషించాలని అడిగారన్నారు. అందుకు అంగీకరించి నటించినట్లు తెలిపారు. అంతకు ముందు బిచ్చైక్కారన్‌ చిత్ర అనువాదంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తనకు రాక్షసుడు చిత్రం చాలా మంచి పేరు తెచ్చిపెట్టిందన్నారు.

ఇలాంటి చిత్రాల్లో నటించాలన్నది తనకు చిరకాల ఆశ అని చెప్పారు. రాక్షసుడు చిత్రం తనకు జీవితంలో మరచిపోలేనంతగా గుర్తింపు తెచ్చి పెట్టిందన్నారు. ప్రేక్షకుల స్పందన తెలుచుకోవడానికి థియేటర్లకు వెళ్లగా చిత్రం చూసిన వారు తనను తిట్టుకుంటున్నారని అన్నారు. తాను గడ్డం పెంచుకుని ఉండటంతో అక్కడ తననెవరూ గుర్తించలేదని అన్నారు.

అలా వారి ఒక్కో తిట్టును అభినందనగా భావిస్తున్నానని అన్నారు. రాక్షసుడు చిత్రం తన జీవితానికి పెద్ద శక్తినిచ్చిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ చిత్రంతో తెలుగులో పలు అవకాశాలు వస్తున్నట్లు తెలిపారు. అయితే సవాల్‌తో కూడిన పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నట్లు వినోద్‌సాగర్‌ అంటున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top