టాలీవుడ్‌ జేఏసీ కన్వీనర్‌ గా సుప్రియ

Supriya Yarlagadda Appointed As Convenor Of Tollywood JAC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టాలీవుడ్‌లో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో  కాస్టింగ్ కౌచ్, టాలీవుడ్ సమస్యలపై సినీ ప్రముఖులతో ఓ కమిటీని ఏర్పాటు అయింది. 21మంది సభ్యులతో ఏర్పాటు అయిన ఈ జాయింట్‌ యాక్షన్‌ కమిటీకి యార్లగడ్డ సుప్రియ కన్వీనర్‌గా నియమితులయ్యారు. ఈ కమిటీలో 24 విభాగాల అధ్యక్ష, కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. అలాగే దర్శకురాలు నందినీరెడ్డి, స్వప్నాదత్‌ సభ్యులుగా వ్యవహరిస్తారు. ఇకనుండి ఇండస్ట్రీకి సంబంధించిన ఏ నిర్ణయమైన ఈ కమిటీదే తుది నిర్ణయం.  ప్రస్తుతం సుప్రియ అన్నపూర్ణ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా వున్నారు.

క్యాష్ కమిటీ ఏర్పాటు ప్రక్రియ కూడా జరుగుతోందని, త్వరలో నివేదిక వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఈ కమిటీలో 21 మంది సభ్యులు ఉంటారని,  వారిలో సగం మంది బయటవాళ్లు (ప్రజా సంఘాలు,లాయర్లు) ఉంటారని సమాచారం. కాగా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై దాదాపు రెండు గంటల పాటు వివిధ అంశాలపై సినీ ప్రముఖులు చర్చించినట్టుగా తెలుస్తోంది. శనివారం అన్నపూర్ణ  స్టూడియోలో జరిగిన ఈ సమావేశంలో సినీరంగానికి చెందిన నిర్మాతలు, నటులు, దర్శకులతో పాటు 24 శాఖలకు చెందిన 80 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు.

కాగా తెలుగు సినిమా పరిశ్రమలో ‘కాస్టింగ్‌ కౌచ్‌’కు వ్యతిరేకంగా గళమెత్తిన శ్రీరెడ్డిపై పలువురు సినిమా ప్రముఖులు మండిపడగా, జూనియర్‌ ఆర్టిస్టులు, మహిళా సంఘాల నాయకులు ఆమెకు బాసటగా నిలిచిన విషయం తెలిసిందే. అనంతరం ఈ అంశం కాస్త పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిగత వివాదంగా మారి రోజుకో మలుపు తిరుగుతోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top