
బాలీవుడ్ దర్శక, నిర్మాత రాకేష్ రోషన్ ముద్దుల తనయ, హీరో హృతిక్ రోషన్ సోదరి సునయన అనారోగ్యంతో బాధ పడుతున్నారంటూ బీ-టౌన్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆమె బైపోలార్ డిజార్డర్‌తో బాధ పడుతున్నారని, అందుకోసం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనేది వాటి సారాంశం. అయితే ఇవన్నీ గాలి వార్తలేనని కొట్టిపారేశారు సునయన. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. ప్రస్తుతం స్నేహితులతో కలిసి గోల్ఫ్ క్లబ్‌లో ఎంజాయ్ చేస్తున్నాని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తన పెంపుడు కుక్కతో సరదాగా గడుపుతున్న ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశారు. ‘ ఇప్పుడు చెప్పండి నిజంగా అనారోగ్యంగా కనిపిస్తున్నానా అంటూ క్యాప్షన్ జతచేశారు.
ఇంతవరకు బాగానే ఉంది గానీ.. తన తండ్రి ఇంట్లో ఉండటం నరకంలా ఉంటుందంటూ సునయన చేసిన వ్యాఖ్యలు రోషన్ ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్నాయి. గత 20 రోజులుగా ఓ హోటల్‌లో బస చేస్తున్న సునయన.. ఇందుకు గల కారణాల గురించి చెబుతూ..‘ వాళ్ల(తల్లిదండ్రులు రాకేష్-పింకీ రోషన్) ఇంట్లోకి వెళ్లేందుకు నాకోసం ప్రత్యేక ద్వారం ఉంటుంది. అదొక నరకం. అవును మా ఇంట్లో కొన్ని చికాకులు ఉన్నాయి. కానీ వాటి గురించి నన్నేం అడగొద్దు. నా కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేయడం నాకిష్టం లేదు’ అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడారు. దీంతో అసలు విషయం ఏమై ఉంటుందా అంటూ హృతిక్ ఫ్యాన్స్ ఆరా తీసే పనిలో పడ్డారు.
Do I look critically ill ..... pic.twitter.com/zI1kJJQsMy
— Sunaina Roshan (@sunainaRoshan22) June 10, 2019