
పుల్లెల గోపీచంద్‌గా నటిస్తా!
మా మామయ్య కృష్ణగారు నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ ఎవర్‌గ్రీన్ మూవీ. ఆ టైటిల్‌తో సినిమా చేయడమంటే సాహసమే.
‘‘మా మామయ్య కృష్ణగారు నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ ఎవర్‌గ్రీన్ మూవీ. ఆ టైటిల్‌తో సినిమా చేయడమంటే సాహసమే. అయితే క్రేజ్ కోసం ఈ టైటిల్ పెట్టలేదు. కథానుగుణంగా ఇదే కరెక్ట్‌గా ఉంటుంది కాబట్టి, పెట్టాం’’ అని హీరో సుధీర్‌బాబు అన్నారు. బోస్ నెల్లూరి దర్శకత్వంలో సుధీర్‌బాబు, నందిత జంటగా చక్రి చిగురుపాటి నిర్మించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధీర్‌బాబు మాట్లాడుతూ -‘‘ఈ సినిమా విషయంలో నాకు సవాలుగా అనిపించింది ఏంటంటే.. ‘పోకిరి’లో మహేశ్‌బాబు చేసినట్లుగా చాలా సటిల్ పెర్ఫార్మెన్స్ చేయాలి.
పెద్దగా అరవకుండా, చిన్న చిన్న సంభాషణలతో, కూల్‌గా నటించాలి. సరిగ్గా కుదురుతుందో లేదోనని భయం ఓ వైపు, ఉద్వేగం ఇంకో వైపు కలిగాయి. చివరికి బాగా చేయగలిగాను’’ అన్నారు. ‘మీ డ్రీమ్ రోల్స్ అంటూ ఏమైనా ఉన్నాయా?’ అనడిగితే - ‘‘ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా ఓ సినిమా చేయాలనుకుంటున్నా. కష్టపడి పైకొచ్చిన గోపీచంద్ జీవితం చాలామందికి ఆదర్శంగా నిలుస్తుంది. ఈ బయోపిక్ విషయంలో గోపీచంద్‌కి కూడా ఎలాంటి అభ్యంతరం లేదు. ఆయన జీవితం ఆధారంగా తీసే సినిమాలో నేను నటిస్తే బాగుంటుందని అన్నారు. కాకపోతే మంచి టీమ్‌తో చేయాలి. అలాంటి టీమ్ కోసం ఎదురు చూస్తున్నా’’ అన్నారు.