‘‘దెయ్యం వేట, ఫ్యామిలీ ఎమోషన్, భక్తి, శివుడు గురించి కథలు... ఇలా చాలా లేయర్స్ ఉన్న చిత్రం ‘జటాధర’. అరుణాచల ప్రస్తావన కూడా ఉంది. మన పురాణాల్లో ఉన్న కొన్ని కథలకి సొల్యూషన్‌గా ఈ మూవీ చేశాం. ఈ సినిమా చేయడానికి ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ నన్ను చాలా ఎగ్జయిట్ చేసింది. యాక్షన్, ఫ్యామిలీ, మైథాలజీ... ఇలా అన్ని భావోద్వేగాలు కుదిరిన సినిమా ‘జటా ధర’’ అని సుధీర్ బాబు తెలిపారు.
వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వంలో సుధీర్‌బాబు హీరోగా నటించిన చిత్రం ‘జటాధర’. సోనాక్షీ సిన్హా, శిల్పా శిరోద్కర్ తదితరులు కీలక పాత్రధారులు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేశ్ కుమార్ బన్సల్, శివన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ, శిల్పా సింఘాల్, నిఖిల్ నంద నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సుధీర్‌బాబు పంచుకున్న విశేషాలు...
→ చిన్నప్పుడు మనం జానపద, చందమామ కథలు విని ఉంటాం. గతంలో బ్యాంకులు లేని సమయంలో ధనాన్ని భూమిలో పాతి, ఒక బంధనం వేసేవారని, దానికి ఒక పిశాచి కాపలాగా ఉండేదని ఓ కథ ప్రచారంలో ఉండేది. అలాంటి కథని ప్రజెంట్ టైమ్‌లోకి తీసుకొచ్చి మా ‘జటాధర’లో చాలా ఆసక్తిగా చూపించాం. ఈ చిత్రకథ విన్నప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూడదగ్గ కథలా అనిపించింది. ఈ సినిమాలో దెయ్యాల వేటగాడిలా కనిపిస్తాను. అయితే తనకి మాత్రం దెయ్యాలున్నాయంటే నమ్మకం ఉండదు. దేవునిపై నమ్మకం ఉంటుంది. సైన్స్‌ని నమ్ముతాడు. అలా ఎందుకు? అనేది సినిమాలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఏ, బీ, సీ సెంటర్ అనే తేడా లేకుండా అందరికీ నచ్చే సినిమా ఇది. ధన పిశాచి పాత్రలో సోనాక్షీ సిన్హా నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. శిల్పా శిరోద్కర్‌గారు శోభ అనే బలమైన పాత్రలో అద్భుతంగా నటించారు.
→ రాజీవ్ అద్భుతమైన సంగీతం, నేపథ్య సంగీతం ఇచ్చారు. ఈ మూవీలో శివతాండవం ఎపిసోడ్ ఉంటుంది. నేనెప్పుడూ క్లాసికల్ డ్యాన్స్ చేయలేదు. ఆ సీక్వెన్స్ కోసం దాదాపు పది రోజులు ప్రాక్టీస్ చేసి, చేశాను. చిత్ర పరిశ్రమలో బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లకి అవకాశాలు సులభం అని... కొత్తవాళ్లకి, ఇండస్ట్రీ నేపథ్యం లేనివారికి కష్టం అనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. నిజానికి బయటవాళ్లకే కాదు.. నాకు కూడా కష్టమే.
→ మా సినిమాలో శివుడు కనిపించే ఒక ఎపిసోడ్ ఉంది. అక్కడ సూపర్‌స్టార్ కృష్ణ గారిని చూపించాలనుకున్నాం. కానీ వీఎఫ్‌ఎక్స్‌కి ఎక్కువ సమయం కుదరలేదు. ఈ మూవీలో కృష్ణగారు కానీ, మహేశ్ బాబుగారు కానీ కనిపించరు. ఇక నా తర్వాతి చిత్రం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఉంటుంది. కాన్సెప్ట్ పరంగా అది ఒక ‘బాహుబలి’ లాంటి సినిమా. అలాగే బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ కూడా చేయాల్సి ఉంది.


