స్ట్రెయిట్‌ ఫ్రమ్‌ స్టవ్‌ | Straight from stove | Sakshi
Sakshi News home page

స్ట్రెయిట్‌ ఫ్రమ్‌ స్టవ్‌

Dec 31 2018 5:54 AM | Updated on Dec 31 2018 5:54 AM

Straight from stove - Sakshi

పొయ్యి మీద నుంచి డైరెక్ట్‌గా కంచంలో పడిన వంటకం ఎలా ఉంటుంది? అలాగే ఉంటున్నాయి ఈ వెబ్‌ చానెల్స్‌ షోస్‌ కూడా. మధ్యలో చల్లారబెట్టే సెన్సార్‌బోర్డ్‌ లాంటి వ్యవస్థ ఏదీ వీటికి లేదు.

ఇదివరకు ఇంగ్లిష్‌ ‘ఎ’ సర్టిఫికెట్‌  సినిమాలు ఊరవతల ఉన్న టాకీసుల్లో రిలీజ్‌ అయ్యేవని చెప్పుకునేవారు. ఎవరికీ తెలియకుండా ఆ సినిమాలు చూడాలి అనుకునేవారు. సీక్రెట్‌గా పొలిమేరలకు వెళ్లేవాళ్లు. ఆ తర్వాత పదేళ్లకు ఊళ్లోనే సెంటర్‌లో ఉన్న సినిమా హాళ్లకే ట్రాన్స్‌ఫర్‌ అయ్యాయి అవి. కాకపోతే కొన్ని సెలెక్టెడ్‌ థియేటర్స్‌లోనే స్క్రీనింగ్‌ ఉండేది. అనంతరం పదేళ్లకు ప్రైవేట్‌ చాన్సల్‌ రాకతో ఇంగ్లిష్‌ సినిమాలు ఇంట్లోకే వచ్చేశాయి. ఇప్పుడు.. ఇంగ్లీష్‌ సినిమాలే కాదు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, మరాఠీ, పంజాబీ, హిందీ ఎట్‌సెట్రా భాషల సినిమాలతోపాటు సీరియల్స్‌ కూడా అరచేతిలో షో చేస్తున్నాయి. యెస్‌.. డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అది. వాడుక భాషలో వెబ్‌ చానెల్స్‌.

ఈ యేటి సాంకేతిక ఉప్పెన! ఇవి చూపించేవన్నీ ‘ఎ’ సర్టిఫికెట్‌  చిత్రాలే. సేక్రెడ్‌ గేమ్స్, లస్ట్‌ స్టోరీస్, ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌..  వంటివి కొన్ని ఉదాహరణలు. ఆడియెన్స్‌ క్రేజ్‌ను క్యాచ్‌ అండ్‌ క్యాష్‌ చేసుకుంటున్న బొమ్మలు. పొయ్యి మీద నుంచి డైరెక్ట్‌గా కంచంలో పడిన వంటకం ఎలా ఉంటుంది? అలాగే ఉంటున్నాయి ఈ వెబ్‌ చానెల్స్‌ షోస్‌ కూడా. మధ్యలో చల్లారబెట్టే సెన్సార్‌బోర్డ్‌ లాంటి వ్యవస్థ ఏదీ వీటికి లేదు. గల్లీలో గాలియా (వీధిలో తిట్లు) నుంచి గోలియోంకి రాస్‌లీలా దాకా.. అన్నీ ఉన్నవి ఉన్నట్టే.. వినిపిస్తూ కనిపిస్తాయి. సిల్వర్‌ స్క్రీన్‌ పాటించే సోకాల్డ్‌ మర్యాద, పట్టింపుల గ్రామర్‌  బెడద వెబ్‌ చానెల్స్‌కు లేదు. తూటాలు కణతల్లోంచి దూసుకుపోయే సీన్‌.. ట్రాన్స్‌జెండర్‌ న్యూడ్‌ లుక్, డ్రెస్సింగ్‌ రూమ్‌లో చీర్‌ గర్ల్‌తో సెక్స్‌..  ఎలాంటి పరదా, బ్లర్‌ ఇమేజ్‌ లేకుండా చాలా సామాన్య దృశ్యాలుగానే రోల్‌ అవుతాయి.

సినిమాల కన్నా హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంటున్నాయి. అందుకే  సినిమా బడ్జెట్‌కేమీ తీసిపోకుండా.. ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమా స్టార్స్‌ను పెట్టీ మరీ వెబ్‌ మూవీస్‌ను, వెబ్‌ సిరీస్‌ను నిర్మిస్తున్నాయి వెబ్‌ చానెల్స్‌.  క్రైమ్‌ అయినా, శృంగారం అయినా.. అనురాగం అయినా.. ముసుగు లేకుండా చూపించడమే వీటి సిగ్నేచర్‌. సిల్వర్‌ స్క్రీన్‌.. ప్రేక్షకుల చాయిస్‌. కాని టీవీ.. నట్టింటి వినోదం. ఇలాంటి షోస్‌ పాస్‌వర్డ్‌ రక్షణతో పరిణతి లేని వాళ్లకు ఇన్‌విజబుల్‌గా ఉండే అవకాశం ఉందా? ఒక ఒరవడి 24 గంటల ఆయువునే రాసుకుని వస్తున్న కాలంలో ఉన్నాం.  అవకాశాలు ఎప్పుడు  ప్రమాదాలవుతాయో.. ప్రమాదాలు  ఎలాంటి ప్రమోదాలుగా మారుతాయో తెలియని.. గ్రహించలేని వేగంలో కొట్టుకుపోతున్నాం. ఫలితాలను బేరీజు వేసుకొని సమీక్షించేంత టైమ్‌ కూడా ఉండట్లేదు. అన్నిటికీ వీక్షకులమే.. వెబ్‌ చానెల్స్‌కైనా.. రేపు వచ్చే ఇంకో కొత్త ట్రెండ్‌ మీడియానికైనా!

– సరస్వతి రమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement