
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం జానకి వర్సెస్ స్టేర్ ఆఫ్ కేరళ. ఈ మూవీ రిలీజ్‌కు ముందే చిక్కుల్లో పడింది. దీనికి ప్రధాన కారణం ఆ మూవీ టైటిల్. సినిమా టైటిల్‌లో జానకి పేరు ఉపయోగించడంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీతాదేవికి మరో పేరైన జానకి టైటిల్ మారిస్తేనే సెన్సార్ చేస్తామని నిర్మాతలకు సూచించింది. దీంతో ఈ పంచాయతీ కాస్తా కోర్టుకు చేరింది.
అయితే ఈ వివాదంపై నిర్మాత సురేశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది విడుదలైన మోహన్ లాల్ చిత్రం ఎంపురాన్-2 పేరును ప్రస్తావించారు. ఆ సినిమా వల్లే ఈ పరిస్థితులు ఎదురయ్యాయని ఆరోపించారు. ఎంపురాన్ మూవీ విడుదల తర్వాత వివాదం తలెత్తడంతో సెన్సార్ బోర్డ్ మరోసారి సెన్సార్ చేయాల్సి వచ్చిందన్నారు. అందుకే సెన్సార్ బోర్డు మరింత జాగ్రత్తగా వ్యవహరించిందని.. ఈ సమస్య అంతా ఆ సినిమాతోనే ప్రారంభమైందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉన్నందున మాకు అనుకూలంగానే తీర్పు వస్తుందని భావిస్తున్నట్లు నిర్మాత జి సురేశ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా.. పృథ్వీరాద్ సుకుమారన్ డైరెక్షన్‌లో వచ్చిన ఎంపురాన్-2 బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.