స్పేస్‌ స్టార్స్‌..!

Special story to Space movies - Sakshi

ఇన్ని రోజులు మన సినిమాల్లో పురాణాలు చూశాం. జానపద కథలను వీక్షించాం. ఫ్యామిలీ డ్రామాలు ఎంజాయ్‌ చేశాం.ఫ్యాక్షన్‌ సినిమాలకు జై కొట్టాం. బయోపిక్‌లు ఓకే చేశాం. అన్నీ అయ్యాయి. ఇంకేం మిగిలింది? రోదసి! రాకెట్‌ వేసుకొని స్పేస్‌లోకి వెళ్లాలంటే చాలా ఖర్చు.  కానీ టికెట్టు ఖరీదు మీదే అక్కడకు తీసుకెళ్లగలిగితే? అందుకే మనచేత అంతరిక్ష ప్రయాణం చేయించడానికి కొందరు దర్శకులు సిద్ధం అయ్యారు. పెద్ద హీరోలు అందుకు తోడయ్యారు.  నక్షత్రాల మధ్య సినీ స్టార్స్‌ కలెక్షన్లతో వార్‌ చేయనున్నారు.

నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ 1969లో చందమామ మీద అడుగుపెట్టక ముందే సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌లో ‘2001 స్పేస్‌ ఒడిస్సీ’ (1968) స్పేస్‌ మూవీ రూపొందించాడు హాలీవుడ్‌ దర్శకుడు స్టాన్లీ కుబ్రిక్స్‌. అలా మొదలైంది సిల్వర్‌ స్క్రీన్‌ స్పేస్‌ ట్రావెల్‌. ఆ తర్వాత ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇంటర్‌స్టెల్లార్, గ్రావిటీ, మార్టియన్, అవతార్‌ లాంటివి చాలా పెద్ద హిట్‌ అయ్యాయి.  ఇప్పుడు హాలీవుడ్‌ నుంచి ఈ రోదసి యాత్ర ఇండియాకి వచ్చింది. మన దగ్గర స్పేస్‌ జానర్‌ కొత్త. ఈ జానర్‌లోకి లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా వస్తున్నాం అంటున్నారు మన ఇండియన్‌ ఫిల్మ్‌ మేకర్స్‌. ఫస్ట్‌ ఇండియన్‌ స్పేస్‌ మూవీగా వచ్చిన తమిళ చిత్రం ‘టిక్‌ టిక్‌ టిక్‌’ విజయం సాధించింది. ఆ ఊపులో ఆన్‌ సెట్స్‌లో మరికొన్ని స్పేస్‌ మూవీస్‌ వేగంగా చిత్రీకరణ పొందుతున్నాయి.

స్పేస్‌కి ఫస్ట్‌ టిక్‌
దర్శకుడు సౌందర్‌రాజన్, హీరో ‘జయం’ రవి కలిసి మొదట ‘మిరుతన్‌’ పేరుతో ఒక సినిమా తీశారు. ఇది తమిళంలో మొదటి ‘జాంబీ’ (చనిపోయి తిరిగి ప్రాణం పొందిన వారు) ఫిల్మ్‌గా గుర్తింపు పొందింది. ఈ ఉత్సాహంతో వారిద్దరూ కలిసి మొదటి భారతీయ స్పేస్‌ ఫిల్మ్‌గా ‘టిక్‌ టిక్‌ టిక్‌’ ను రూపొందించారు. కథ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. చెన్నై సమీపంలో ఓ పెద్ద ఆస్ట్రోయిడ్‌ ఢీ కొంటుంది. అది జరిగిన కొన్ని రోజులకే మరో పెద్ద ఆస్త్రోయిడ్‌ ఢీ కొనే ప్రమాదం ఉందని తెలుసుకున్న సైంటిస్టులు ఆ ప్రమాదాన్ని తప్పించడానికి హీరో  ‘జయం’ రవితో పాటు ఓ టీమ్‌ను తయారు చేస్తారు. వీళ్లు ఆ ముప్పును ఎలా తప్పించే ప్రయత్నం చేశారన్నదే చిత్రకథ. నివేథా పేతురాజ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ‘జయం’ రవి కుమారుడు ఆరవ్‌ రవి సిల్వర్‌ స్క్రీన్‌కు పరిచయం అయ్యాడు. సుమారు 80 నిమిషాల గ్రాఫిక్స్‌తో నిండి ఉన్న ఈ చిత్రానికి పాజిటివ్‌ టాకే లభించింది.

ముందు సముద్రగర్భం... తర్వాత అంతరిక్షం 
తొలి సినిమాతోనే సముద్ర గర్భానికి వెళ్లి, చరిత్ర తవ్వి తీసిన ‘ఘాజీ’ దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి మలి చిత్రాన్ని అంతరిక్షంలో సెట్‌ చేశారు. ఇందులో వరుణ్‌ తేజ్, అదితీ రావ్‌ హైదరీ, లావణ్యా త్రిపాఠి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ‘ఫిదా, తొలిప్రే మ’తో లవర్‌బాయ్‌గా వరుస సక్సెస్‌లు సాధించిన వరుణ్‌ తేజ్‌ ఈ సినిమాలో వ్యోమగామిగా (ఆస్ట్రోనాట్‌) కనిపిస్తారు. తనతో పాటు అంతరిక్షంలో విహారానికి అదితీ కూడా ఉన్నారు. ఈ సినిమాను ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రాజీవ్‌ రెడ్డి సాయిబాబు నిర్మిస్తున్నారు. స్పేస్‌లో గ్రావిటీ ఉండనందు వల్ల గాల్లో తేలుతూనే ఉంటాం అన్నది తెలిసిన విషయమే. సినిమాలో ఎక్కువ శాతం సన్నివేశాలు  స్పేస్‌లో ఉండటంతో జీరో గ్రావిటీ కోసం వరుణ్‌ తేజ్‌ మరియు కొంత మంది చిత్రబృందం ట్రైనింగ్‌  తీసుకున్నారు. ఈ సినిమా షూటింగ్‌ కోసం పెద్ద స్పేస్‌ స్టేషన్‌ సెట్‌ కూడా రూపొందించారు. గత రెండు షెడ్యూల్స్‌లో అదితీరావ్‌ హైదరీ, వరుణ్‌ మీద కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. జార్జియాలో ఎక్కువ శాతం షూటింగ్‌ జరుపుకోనున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో థియేటర్స్‌లోకి తీసుకొస్తున్నాం అని చిత్రబృందం ప్రకటించింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కోసం హీరో వరుణ్, అదితీలపై 3డీ స్కానింగ్‌ జరిపారు. హాలీవుడ్‌ సినిమాలకు పని చేసిన స్టంట్‌ కొరియోగ్రాఫర్స్‌ ఈ సినిమాకు కూడా వర్క్‌ చేస్తున్నారు. డూప్‌ లేకుండా వరుణ్‌ తేజ్‌ ఇందులో స్టంట్స్‌ చేస్తున్నారని చిత్రబృందం పేర్కొంది. ‘రంగస్థలం’ కోసం    980ల ఊరి సెట్‌ను  డిజైన్‌ చేసిన రామకృష్ణ, మోనిక ఈ స్పేస్‌ చిత్రానికి ఆర్ట్‌ డైరెక్టర్స్‌. ఈ చిత్రానికి ‘అంతరిక్షం’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారట.

చందమామ దూర్‌ కే 
‘చందమామ రావే జాబిల్లి రావే..’ అని గోరు ముద్దలు తినిపిస్తారు. పెద్దయ్యాక చందమామ రాదని మనకు తెలిసిపోతుంది. వెళ్లే అవకాశం రియల్‌గా సాధ్యం కాదు. రీల్‌కి ఏదైనా సాధ్యమే. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌కి ఆ చాన్స్‌ దక్కింది. ‘ధోని’ బయోపిక్‌లో యాక్ట్‌ చేసిన హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కూడా ఓ స్పేస్‌ మూవీకి సిద్ధమయ్యారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్, మాధవన్, నవాజుద్దిన్‌ సిద్దిఖీ ముఖ్య పాత్రల్లో సంజయ్‌ పూరణ్‌ సింగ్‌ చౌహాన్‌ తెరకెక్కించనున్న హిందీ చిత్రం ‘చందమామా దూర్‌ కే’ ఈ సినిమా షూటింగ్‌ మొదలు కాకపోయినా సుశాంత్‌ తన పాత్ర కోసం ఇప్పటికే శిక్షణ మొదలుపెట్టారు. ఇంటర్‌నేషనల్‌ స్పేస్‌ సెంటర్‌కు వెళ్లి ట్రైనింగ్‌ కూడా తీసుకుంటున్నారాయన. స్పేస్‌లో ఆస్ట్రోనాట్స్‌ వాడేటువంటి స్పేస్‌ సూట్‌నే సినిమా షూటింగ్‌లో వాడనున్నారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కోసం 11 లేయర్స్‌ ఉన్న స్పేస్‌ సూట్‌ను డిజైన్‌ చేశారట. అయితే బడ్జెట్‌ కారణాల వల్ల సినిమా తీయాలా? వద్దా? అనే పరిస్థితి ఉందట. కానీ ఈపాటికే స్పేస్‌ మూవీ మీద మక్కువ పెంచుకున్న సుశాంత్‌ ఒకవేళ ఇది ఆగినా, తప్పకుండా స్పేస్‌ మూవీ చేస్తానని పేర్కొన్నారు. 

శర్మకు సెల్యూట్‌ 
స్పేస్‌లో ట్రావెల్‌ చేసిన ఫస్ట్‌  ఇండియన్‌ పైలట్‌ రాకేశ్‌ శర్మ అందించిన సేవలకు సెల్యూట్‌ చేయకుండా ఉండలేం. ఇప్పుడు ఆయన కథనే మనందరికీ  చూపించి ఆడియన్స్‌తో క్లాప్‌ కొట్టించడమే కాకుండా సెల్యూట్‌ చేయించదలిచారు నూతన దర్శకుడు మహేశ్‌ మతాయ్‌.స్పేస్‌లో ప్రయాణం చేసిన తొలి భారతీయుడిగా రాకేశ్‌ శర్మ చరిత్ర సృష్టించారు. ఇప్పుడు అదే చరిత్రను తెర మీద పునఃసృష్టించదలిచారు. సెప్టెంబర్‌ నుంచి రాకేశ్‌ శర్మ పాత్రలోకి మారనున్నారు షారుక్‌ ఖాన్‌. తన రీసెర్చ్‌లో భాగంగా స్పేస్‌లో సుమారు ఏడున్నర రోజులు ఉన్నారు రాకేశ్‌ శర్మ. అక్కడ జరిగిన వీడియో కాల్‌లో స్పేస్‌ నుంచి ఇండియా ఎలా కనబడుతుంది అని ఇందిరా గాంధీ అడిగిన ప్రశ్నకు ‘సారే జహాసే అచ్చా  హిందూ సితా హమారా’ అని సమాధానమివ్వడం విశేషం. ఇలాంటి సీన్స్‌ కచ్చితంగా ఆడియన్స్‌ని మెస్మరైజ్‌ చేయడం గ్యారెంటీ.  ప్రస్తుతం ‘జీరో’ సినిమాతో బిజీగా ఉన్న షారుక్‌ సెప్టెంబర్‌ నుంచి సెల్యూట్‌ సినిమాను సెట్స్‌ మీదకు తీసుకువెళ్లనున్నారు. రోనీ స్క్రూవాలా, సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది. 

కల్పన కథతో...
స్పేస్‌లోకి వెళ్లిన ఫస్ట్‌ ఇండియన్‌ ఉమెన్‌గా హిస్టరీ క్రియేట్‌ చేశారు కల్పనా చావ్లా. నెల రోజుల పాటు స్పేస్‌లో ట్రావెల్‌ చేసి తిరిగి భూమి మీద ల్యాండ్‌ అయ్యే సమయంలో చనిపోయారు.  ఇప్పుడు ఆమె కథను కూడా స్క్రీన్‌ మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది బాలీవుడ్‌ ఇండస్ట్రీ. ఈ బయోపిక్‌లో కల్పనా చావ్లా పాత్రను ప్రియాంకా చోప్రా పోషించనున్నారని టాక్‌. హాలీవుడ్‌ టీవీ సిరీస్, సినిమాల్లో యాక్ట్‌ చేస్తున్న ప్రియాంక రెండేళ్ల గ్యాప్‌ తర్వాత హిందీలో ‘భారత్‌’ సినిమాలో యాక్ట్‌ చేస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమాను సెట్స్‌ మీదకు తీసుకువెళ్లనున్నారు చిత్రబృందం.

భారీ గ్రాఫిక్స్‌.. బోలెడు సీజీ 
స్పేస్‌ సినిమాలు తీయడానికి కచ్చితంగా స్పేస్‌ సెట్‌ వేసి తీరాల్సిందే. దానికి తోడు చాలా షాట్స్‌ను సీజీ (కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌) చేయాల్సి ఉంటుంది.  అక్కడ ఉండే వాతావరణం ఎలా ఉంటుందో అనే విషయాల్ని చదవడం లేదా వీడియోలో చూడటం తప్పిస్తే ఎవరికీ ఎక్కువగా తెలియదు. సో రచయిత, దర్శకుడు తమ అవగాహన మేర తెరకెక్కించుకోవడమే. కానీ ఎంత  సినిమా అయినా కొన్ని గ్రౌండ్‌ రూల్స్‌ పాటించక తప్పదు. సైన్స్‌ ఫిక్షన్‌లో ఎంత ఫిక్షన్‌ ఉన్నప్పటికీ కొంత సైన్స్‌ అవగాహన మాత్రం కంపల్సరీ. ఫిక్షన్‌ అనే గాల్లో ఎంతలా వేలాడినా సైన్స్‌ అనే గ్రావిటీని అందుబాటులో పట్టుకోకపోతే ఇబ్బందే. కమర్షియల్‌  సినిమాల్లోలా కొన్ని లాజిక్స్‌ని పట్టించుకోకపోయినా కొన్నింటిని వదిలేస్తే మాత్రం దారి తప్పిన రాకెట్‌ అవుతుంది ప్రయాణం. దాని పర్యావసనం ఎంటో అప్పుడు ఎక్కడ తేలుతుందో ఎవ్వరికీ తెలియదు. మూడు గంటల సినిమాలో సగానికి పైగా స్పేస్‌లో అది కూడా సింగిల్‌ కాస్ట్యూమ్స్‌లో (ఎక్కువ శాతం) ఆడియన్స్‌ను ఎంత వరకు కట్టిపడేస్తారని దర్శకుడు ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. స్పేస్‌లో డ్యూయెట్‌లు పాడుకునే వీలు కూడా ఉండదు. అంతకు రిస్క్‌ చేసి పాలపుంతల్లో పాట పాడించి ఒప్పించడం దర్శకుడు మీద ఆధారపడి ఉంటుంది. స్పేస్‌లో కథ నడుస్తున్నప్పుడు దర్శకుడు కథ చెప్పడంలో దృష్టి పెట్టడం ఉంటుంది. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఇరికించడానికి స్పేస్‌లో స్పేస్‌ ఉండకపోవచ్చు. ఏది ఏమైనా మన దర్శకులు చేస్తున్న స్పేస్‌ జానర్‌ ప్రయత్నాన్ని ఆడియన్స్‌ కచ్చితంగా ఆదరించి తమ హృదయాల్లో కొంచెం స్పేస్‌ ఇస్తారని ఆశిద్దాం. 

అమృతం చందమామలో
2014లోనే గుణ్ణం గంగరాజు స్పేస్‌ జానర్‌లో సినిమా తీసే ప్రయత్నం చేశారు కానీ పూర్తి స్థాయిలో కాదు. కొంత పోర్షన్‌ వరకే.  ‘అమృతం’ సీరియల్‌తో కితకితలు పెట్టిన ఆయన స్పేస్‌లో కూడా తన అమృతం హోటల్‌ వంట రుచి చూపించదలిచారు. అమృతంలా అవసరాల శ్రీనివాస్, అంజి పాత్రలో హరీష్, సర్వర్‌గా వాసు ఇంటూరినే కనిపించారు. విలన్‌ అప్పాజి పాత్రలో సీరియల్‌లో కనిపించిన శివన్నారాయణ పెద్దినే చేశారు. బిజినెస్‌ను ఎక్స్‌టెండ్‌ చేసే పనిలో తమ ‘అమృత విలాస్‌’ స్పెషల్‌ బ్రాంచ్‌ను చందమామ మీద కూడా ఏర్పాటు చేయాలనుకుంటారు అమృతం, అంజి. ఈ కథాంశంతో రూపొందిన ‘అమృతం చందమామలో’ సినిమాలో కొంత పోర్షన్‌ మేరకు స్పేస్‌ సీన్స్‌ ఉన్నాయి.  
– గౌతమ్‌ మల్లాది

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top