నా దగ్గర అమ్మ ఉంది

Special interview with anjana devi - Sakshi

బిడ్డకు జన్మ.. తల్లికి పునర్జన్మ. ప్రాణం పోతున్నా ప్రాణం పోసే సమయం అది. పురిటినొప్పులు కన్నీళ్లు పెట్టిస్తున్నా.. బిడ్డ తొలి ఏడుపును అమ్మ ఆస్వాదించే ఒకే ఒక్క సమయం అది. ఆ జన్మకు మళ్లీ కన్నీళ్లు ఉండకూడదని ఆశీర్వదించే సమయం అది. పుడమి చీల్చిన మొక్కకు సారం అమ్మ. మెగా వృక్షానికైనా ఆసరా అమ్మ. తుఫాన్‌ రోజు పుట్టాడు. తెలుగునాట అభిమాన తుఫానై వర్షిస్తున్నాడు. ‘ఇంతకంటే ఓ అమ్మకు ఏం కావాలి’ అని అంటే... ‘నాకు అమ్మకంటే ఎక్కువ ఇంకేం కావాలి’ అంటున్నారు చిరంజీవి.

ఈ 22న మీ అబ్బాయి బర్త్‌డే సందర్భంగా చాలా విశేషాలు తెలుసుకోవాలనిపించిందమ్మా..
అంజనాదేవి: చెప్పడానికి చాలా ఉన్నాయి. మా అబ్బాయితో కలిసి ఇలా (మీడియాతో) మాట్లాడటం ఇదే ఫస్ట్‌ టైమ్‌.

అయితే చిరంజీవిగారికి బర్త్‌డే గిఫ్ట్‌ అన్నమాట..
చిరంజీవి: మా అమ్మ నాకు ఎప్పుడో గిఫ్ట్‌ ఇచ్చేసినట్లే. జస్ట్‌ వారం పది రోజుల కిందటే ఇచ్చింది.
అంజనాదేవి: నేనా? ఏం ఇచ్చాను? గుర్తు లేదే.
చిరంజీవి: అది గిఫ్ట్‌ అని అమ్మకు కూడా తెలియదు. అమ్మ ఒంటరిగా ఇక్కడ ఈ ఇంట్లో ఉంటోంది. మేం ఇప్పుడు ఉంటున్న ఇంటిని కొంచెం రెన్నోవేషన్‌ చేయిస్తున్నాం. ఈ మధ్య అమ్మ ‘‘ఒంటరిగా ఉండాలంటే ఏదోలా ఉంటోందిరా. దిగులుగా ఉంది. ఇక నీ దగ్గరకు వచ్చేస్తా’’ అంది. అది విని నాకు పట్టలేనంత ఆనందం కలిగింది. ఎందుకంటే అమ్మ స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడింది. ఆమె నిర్ణయాన్ని  గౌరవించాం. ఇప్పుడు తనే స్వయంగా ‘వచ్చేస్తాను రా’ అంది. ఇప్పుడు చెప్పమ్మా.. ఇంతకంటే నాకు బెస్ట్‌ బర్త్‌డే గిఫ్ట్‌ ఉంటుందా?

చిరంజీవిగారు పుట్టినప్పుడు మీకు 15 ఏళ్లు అట. డెలివరీ అప్పుడు జోరున వర్షం అట కదా?
అంజనాదేవి: అప్పుడు నర్సాపురంలో ఉండేవాళ్లం. ఉదయం 4 గంటలకే నొప్పులు మొదలయ్యాయని మిషన్‌ హాస్పిటల్‌కి గుర్రపు బండిలో వెళ్లాం. ఒకవైపు వర్షం. ఎలాగో హాస్పిటల్‌కి చేరుకున్నాం. సోమవారం ఉదయం 10 గంటలకు పుట్టాడు.

మీరు ఆడుకునే వయసులో ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఆ బిడ్డ మెగాస్టార్‌ కావడంపై మీ ఫీలింగ్‌?
అంజనాదేవి: నా గర్వం నా పిల్లలే. ముఖ్యంగా నా పెద్దబ్బాయి చిన్నప్పటి నుంచి నా బాధ్యతలు కూడా పంచుకొని నాకు తోడుగా నిలబడ్డాడు.  
చిరు: చిన్నçప్పుడే అమ్మ నన్ను అలా ట్రైన్‌ చేసింది. కట్టెపుల్లలు ఎలాంటివి తీసుకురావాలి. మంచి చేపలు ఎలా తీసుకురావాలి. పచారి కొట్లో సామాన్లు ఎలా తీసుకురావాలి? అన్నీ నేర్పించింది. లిస్ట్‌ రాసిస్తే కిరాణా కొట్టుకి వెళ్లి సరుకులు తెచ్చేవాడ్ని.
అంజనాదేవి: పాతిక రూపాయలు ఇస్తే చక్కగా కూరగాయలు, ఇతర వస్తువులు రిక్షాలో పెట్టి జాగ్రత్తగా తీసుకొచ్చేవాడు.

తెచ్చినందుకు చాక్లెట్, బిస్కెట్‌ ఏమైనా?
అంజనాదేవి: అదేం లేదు.
చిరు: అడగాలని నాకు తెలియదు, ఇవ్వాలని అమ్మకు తెలియదు (నవ్వుతూ). 15 ఏళ్ల వయసులో అమ్మకు ఆడుకునే బొమ్మ అయినా కన్న బిడ్డ అయినా అన్నీ నేనే. నాన్న డ్యూటీకి వెళ్లిపోయేవారు. మాకు బంధువులు ఎక్కువగా లేరు. చుట్టం చూపుగా వచ్చి వెళ్లేవారంతే.  దాంతో నాకు, అమ్మకు అటాచ్‌మెంట్‌ ఎక్కువ. తనకు ఏం కావాలన్నా నేనే తెచ్చిపెట్టేవాడ్ని.

చిన్నప్పుడు మీ బర్త్‌డేలు ఎలా సెలబ్రేట్‌ చేసేవారు?
చిరు: నా చిన్న వయసు నుంచే అమ్మానాన్న నా బర్త్‌డేని గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసేవారు. ఒక కుర్చీలో నన్ను కూర్చోబెట్టి, చుట్టుపక్కల వాళ్లను పిలిచి అక్షింతలు వేయించేది. మరీ విచిత్రం ఏంటంటే.. లౌడ్‌ స్పీకర్‌ కూడా పెట్టించేది (నవ్వులు). ఆ రోజుల్లోనే వచ్చిన వాళ్లందరికీ రిటర్న్‌ గిఫ్ట్స్‌ ఇచ్చేది. శెనగలు, చలిమిడి, తాంబూలం ఏదో ఒకటి. మాకున్న స్థా్థయిలో. ప్రతి సంవత్సరం అలానే. అలా అమ్మ గ్రాండ్‌గా చేయడం మొదలుపెట్టిన నా బర్త్‌డేలు తర్వాత తర్వాత ఇంకా గ్రాండ్‌గా జరగడం మొదలైంది.

హీరోగా స్టార్ట్‌ అయినప్పుడు చెన్నైలో ఉండేవాళ్లం కదా. ఇక్కణ్ణుంచి అభిమానులు బస్సులు వేసుకుని వచ్చేవాళ్లు. ఇక్కడికొచ్చాక కూడా అలానే జరుగుతోంది. నాకే బర్త్‌డేలంటే కొంచెం ఇంట్రస్ట్‌ తగ్గింది.  అయితే బర్త్‌డేలు గ్రాండ్‌గా చేసుకోవాలని స్ఫూర్తి ఇచ్చింది అమ్మే. మిగతా బ్రదర్స్‌ చేసేవాళ్లు కాదు. వాళ్లకు ఆ అలవాటు లేదు. ఇంట్రస్ట్‌ కూడా తక్కువ. అమ్మా.. నీకు చెప్పడం మరచిపోయా. మొన్న (ఆగస్ట్‌ 13)  విజయ (చిరంజీవి చెల్లెలు) బర్త్‌డే. కానీ 15న ఫోన్‌ చేసి, హ్యాపీ బర్త్‌డే అన్నాను. ‘లేట్‌గా చెప్పా.. సారీ రా’ అంటే ‘నాకే గుర్తు లేదన్నయ్యా. మా అందరికీ బర్త్‌డే అంటే నీ బర్త్‌డేనే’ అంది. ఆ రకంగా నన్ను, నా బర్త్‌డేని సొంత బర్త్‌డే అన్నట్లుగా సెలబ్రేట్‌ చేసుకుంటారు.

మీ అబ్బాయిని ఇంత బాగా పెంచుకున్నారు కదా. కోడలు వచ్చేప్పుడు అబ్బాయి దూరమైపోతాడేమోనని భయపడ్డారా?
అంజనాదేవి: ఎప్పుడూ లేదు.
చిరు: నిజంగా.. మనసులో భయపడ్డావు కదూ..
అంజనాదేవి: లేదు నాన్నా. అసలు సురేఖ కొత్తలోనే బాగా కలిసిపోయింది. మమ్మల్ని సొంత అమ్మ, నాన్నలానే చూసుకుంటుంది. మాకేం కావాలో తనకు చెప్పక్కర్లేదు. భార్యకి చేయాలని లేకపోతే ‘ఇది చెయ్‌.. అది చెయ్‌..’ అని భర్త ఎంతసేపు చెబుతాడు. మా కోడలు తనే ముందు కల్పించుకొని ఇది చేస్తే బావుండు... అది చేస్తే బావుండు అని చేస్తుంది.
చిరు: మా బంధువుల పిల్లలకు చదువులు చెప్పించింది. పెళ్లిళ్లు చేసింది. ఫ్లాట్స్‌ కొని ఇచ్చింది. ఫైనాన్షియల్‌గా ఇబ్బంది అనిపిస్తే వాళ్ల అకౌంట్‌లోకి డబ్బులు వెళ్ళిపోయేలా చేస్తుంది. అందుకే మా ఫ్యామిలీలో సురేఖ అంటే అందరికీ గౌరవంతో కూడిన ప్రేమ. అమ్మయితే కూతురు అనే అంటుంది.
అంజనాదేవి: (మధ్యలో అందుకుంటూ) కూతురు కంటే ఎక్కువ మా కోడలు. ‘ఏంటి అత్తమ్మగారు.. ఎలా ఉన్నారు?’ అని, ఏం తింటున్నానో అడిగి తెలుసుకుంటుంది. ఏం తినాలో చెబుతుంది. ఏం మందులు వేసుకోవాలో చెబుతుంది. అంత శ్రద్ధ.
చిరు: ఆ మధ్య న ర్స్‌ని కూడా పెట్టింది అమ్మను చూసుకోవడానికి. ఆ రకంగా వాళ్లిద్దరికీ  మంచి అనుబంధం ఉంది. సురేఖకి నేను ఇలా చెయ్యి, వీళ్లను చూడు అని చెప్పలేదు. అలా చెప్పి ఎవరితోనూ ఏ పనీ చేయించలేం. స్వతహాగా ఉండాలి.

ఇంటికి వచ్చే పెద్ద కోడలికి అందర్నీ చూసే గుణం ఉంటే.. ఆ కుటుంబం బాగుంటుంది కదమ్మా..
అంజనాదేవి: కరెక్టే. అలాంటి అమ్మాయి కోడలైతే ఫ్యామిలీ మొత్తం కలిసి ఉంటుంది.

మీ అబ్బాయిలు యాక్టర్స్‌ కాకుండా మాములు జాబ్‌ చేస్తే ఉదయమే వెళ్లి సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తారు కదా అనిపిస్తుంటుందా?
అంజనాదేవి: లేదు. ఎంత మందికి ఈ చాన్స్‌ వస్తుంది. కోట్లమంది ఉంటారు ఉద్యోగస్తులు. కానీ ఒక స్టార్‌కి ఎంత ప్రజాదరణ ఉంటుందో తెలుసు కదా. ఇలా ఏ కొందరికో దక్కుతుంది. ఇది నా బిడ్డల అదృష్టం అని భావిస్తాను.

అన్నప్రాసన అప్పుడు చిరంజీవిగారు ఏం పట్టుకున్నారు?
అంజనాదేవి: కత్తి పట్టుకున్నాడు.
చిరు: అప్పుడు పట్టుకున్న కత్తి ‘ఖైదీ నంబర్‌ 150’ వరకూ వదల్లేదు. ఇప్పుడు ‘సైరా’కీ పట్టుకున్నాను (నవ్వుతూ).

చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్లడానికి ఏడ్చిన రోజులు?
అంజనాదేవి: చక్కగా వెళ్లిపోయేవాడు.
చిరు: నిడదవోలులో ‘అ ఆలు’ చదివించడం కోసం ఓ పంతులుగారి దగ్గరికి పంపింది. ఆయనేమో తొడపాసెం పెట్టేవాడు. అక్కడ ఎర్రగా అయ్యేది. ఎందుకమ్మా పంపుతున్నావు? అంటే.. చదువుకో నాన్నా అనేది. అయిష్టంగా వెళ్లేవాడిని. చదువు మీద ఇంట్రస్ట్‌ పోయే స్థితి వచ్చింది.

ఓకే.. చిరంజీవిగారు చిన్నప్పుడు చేసిన అల్లరి..
అంజనాదేవి: అబ్బో... చెప్పడానికి లేదు. ఆ అల్లరి భరించలేకపోయేదాన్ని. ఐదేళ్ల వయసులో అనుకుంటా. రోడ్డు మీదకు వెళ్లిపోయాడు. నిలబడి దిక్కులు చూస్తూ, అక్కడే నిద్రపోయాడు. నేనేమో ఎక్కడికి వెళ్లిపోయాడా అని వెతు క్కుంటూ వెళ్లా. అక్కడున్న వాళ్లు ‘ఏమ్మా పసిపిల్లోణ్ణి వదిలేసి, వెళతావా?’ అని గట్టిగానే తిట్టారు. బాధపడుతూనే ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చా. ఇక వీడితో వేగలేనని మంచం కోళ్లకు తువ్వాలుతో కట్టేసేదాన్ని.
చిరు: చాలా అరాచకం ఇది. ‘అమ్మా’నవీయం. చాలా దారుణం అమ్మా అది. పసిబిడ్డను ఎంత హింస పెట్టావు నువ్వు (తల్లివైపు అల్లరిగా చూస్తూ). అవునమ్మా అసలు రోడ్డు మీద నుంచి ఇంటికి నీ పిల్లోణ్ణే తెచ్చావా? వేరే వాళ్లను తెచ్చుకోలేదు కదా. (నవ్వుతూ). ఎందుకంటే మా ఇంట్లో కల్యాణ్, నాగబాబు, మాధవి, విజయ.. అందరూ తెల్లగానే ఉంటారు. నేనే కొంచెం డార్క్‌. సొంత కొడుకునేనా?
అంజనాదేవి: మా నాన్న పోలికలండీ వీడికి. ఆయన రంగు వచ్చింది. ఇప్పుడింత కామ్‌గా ఉన్నట్లు కనిపిస్తున్నాడు కదా.. తక్కువోడు కాదండీ. వీడంత అల్లరి ఎవరూ చేయలేదు.
చిరు: మా ఇంటి దగ్గర గుyì‡ ప్రహరీ గోడ కొంచెం వెడల్పుగా ఉండేది. దాని మీద నిలబడి విన్యాసాలు చేస్తూ, పరిగెడుతూ ఉండేవాడ్ని. ఒకసారి మా నాన్నగారు చూసి టెన్షన్‌ పడిపోయి, ఇంటికి తీసుకొచ్చారు. నాకు బడిత పూజ. అలా నన్ను వదిలేసినందుకు అమ్మకు తిట్లు. అప్పుడు అమ్మ ‘ఒరేయ్‌ వెళ్లకు రా.. నిన్ను ఇలా మంచానికి కట్టేయలేను. నీ హుషారుని ఆపలేను’ అనేది.

అదే ప్రహరీ మీద నేను చేసిన విన్యాసాలు నాకు కొన్ని లక్షల మంది ఫ్యాన్స్‌ని తెచ్చిపెట్టాయి. అది ‘దొంగ’ సినిమాలో అనుకుంటా. పది అంతస్తుల బిల్డింగ్‌ ప్రహరీ మీద నేను రోల్‌ అవుతూ సీన్‌ చేయాలి.  అది నాగబాబు చూశాడు. అన్నయ్య అంత రిస్క్‌ చేస్తున్నాడు అంటూ ఇంటికి వచ్చి ఏడ్చాడట. చిన్నప్పుడేమో ప్రహరీ గోడ మీద విన్యాసాలు చేస్తే తన్నులు పడ్డాయి. ఇప్పుడు చేస్తుంటే అభిమానుల ప్రేమ జల్లులు పడుతున్నాయి.

రిస్కులు చేస్తుంటే అమ్మానాన్న టెన్షన్‌ పడేవారా?
చిరు: ‘గూండా’లో మూవ్‌ అవుతున్న ట్రైన్‌ కింద రాడ్డు పట్టుకుని వెళ్లే సీన్‌. రైలు పట్టాల మీద ఉన్న రాళ్లు వీపుకి గుచ్చుకుంటున్నాయి. ఆ షూటింగ్‌కి నాన్న వచ్చారు. ప్రొడ్యూసర్‌ని పిలిచి కేకలేశారు.. ప్రాణాలతో చెలగాటమెందుకు? అని. ఆ నిర్మాతేమో ‘నువ్వు చేయొద్దయ్యా బాబు. మీ నాన్న నన్ను కేకలు వేస్తున్నారు?’ అనేవారు. అలా రిస్కీ సీన్స్‌ చేసినప్పుడు ‘నాన్నా.. నువ్వు వెళ్లిపో. నేను షూటింగ్‌ చేసుకొని వస్తా’ అని పంపించేసేవాడ్ని. చిన్నప్పుడు నేను చేసిన అల్లరి రూపాంతరం చెంది.. పెద్దయ్యాక కూడా అదే అల్లరి (షూటింగ్స్‌లో సీన్స్‌ గురించి) చేస్తున్నాను. కార్ల మధ్యలో పరిగెడుతున్నాను.
అంజనాదేవి: నాకంటే మావారు ఎక్కువగా భయపడేవారు. నేను మిగతా పిల్లలను చూసుకోవడంలో, ఇంటి పనుల్లో్ల పడి కొంచెం మర్చిపోయినా, పిల్లలు ఇంటికి వచ్చేదాకా.. అది రాత్రి 12 అవ్వనీ 2 అవ్వనీ అలా కూర్చుని ఉండేవారు.

పిల్లలకు ఏం కాకూడదని దేవుళ్లకు దండం పెట్టుకోవడం లాంటివి చేసేవారా?
చిరు: అమ్మ పూజలు, దైవ దర్శనాలు చేస్తుంది. తను కోరుకునేది ఒక్కటే. బిడ్డలు బాగుండాలని.

మీరు చిరంజీవిగారికి జన్మనిచ్చారు. ఆయనేమో స్టార్‌ అయి, నాగబాబు, పవన్‌ కల్యాణ్, రామ్‌చరణ్, వరుణ్‌ తేజ్, సాయిధరమ్, నిహారిక.. రేపు వైష్ణవ్‌ తేజ్‌ ఇలా వృక్షాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. ఇది ఊహించారా?
చిరు: డిగ్రీ అయ్యాక నాకేం చేయాలో తోచలేదు. ‘నాకు ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాలని ఉంది’. అన్నాను. మనకు ఎవరిస్తారు? అంది. నాకు ఉద్యోగాలు చేయబుద్ధి కావడంలేదని అమ్మానాన్నతో అన్నాను.
అంజనాదేవి: రిస్క్‌ కదా. నాన్న రికమెండ్‌ చేస్తారు. కొంచెం చదువుకుంటే డీయస్పీ రేంజ్‌ వరకూ వెళ్లొచ్చు అన్నాను.
చిరు: చివరికి నా ఇంట్రెస్ట్‌ చూసి నాన్నకు అమ్మ చెప్పింది. పగలంతా ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకొని రాత్రులు ఐసీడబ్ల్యూ ప్రిపేర్‌ అవుతాను అంటున్నాడు కదా. చూద్దాం. ట్రై చేసుకోనిద్దాం అని అమ్మానాన్న అనుకున్నారు. మద్రాస్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఒక్క సంవత్సరమే కోర్స్‌. వన్‌ ఇయర్‌లో ఫ్యూచర్‌ తెలిసిపోతుందిలే అని మద్రాస్‌లో జాయిన్‌ అయ్యాను. అమ్మానాన్న నా అభిలాషని అర్థం చేసుకుని ఎంకరేజ్‌ చేయడమే ఈరోజు నన్ను ఇంతటివాడ్ని చేసింది. ఇంతమంది ప్రేమను పొందేలా చేసింది. నా తర్వాత వచ్చిన నా కుటుంబ సభ్యులను కూడా అందరూ ఆదరించడం.. ఇదంతా దైవ కృప. అభిమానుల ఆశీస్సులు, నా తల్లిదండ్రుల నమ్మకం.

మీ అమ్మగారు చాలా స్ట్రాంగ్‌ లేడీ అనుకోవచ్చా?
చిరు: స్ట్రాంగ్‌ కాదు కానీ ప్యూర్‌ లవ్‌ ఉన్న పర్సన్‌. బిడ్డలైనా, కోడళ్లైనా, మనవళ్లైనా సమానమే. అమ్మలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే.. మేం ఎప్పుడైనా ఎక్కువ రోజులు కనిపించకపోతే, ‘ఏంట్రా రావడం లేదు. మర్చిపోయారు’ అని దెప్పడంలాంటివి చేయదు. తనే ఫోన్‌ చేస్తుంది. ‘చూడాలని ఉందిరా. ఎక్కడున్నావు? నేనే వస్తా’ అంటుంది. పిల్లలు ఎంత బిజీగా ఉంటారో అర్థం చేసుకుంటుంది. అమ్మ ఆలోచనలన్నీ ఆరోగ్యకరంగా ఉంటాయి.

ఆవిడకు ఆరోగ్యం బాగాలేనప్పుడు మానసికంగా డౌన్‌ అవుతుంటారా? అప్పుడు మీరేం చేస్తారు?
చిరు: ఈ మధ్య అమ్మ ఆరోగ్యం బాలేనప్పుడు చాలా డౌన్‌ అయింది. శారీరకంగా, మానసికంగా కూడా. నేను ‘ఖైదీ నంబర్‌ 150’తో, కల్యాణ్‌ పాలిటిక్స్‌తో, నాగబాబు టీవీ షోలతో బిజీ. ఆ టైమ్‌లో మేం పలకరించడం చాలా తగ్గిపోయింది. అప్పుడు కొంచెం ఒంటరితనం ఫీలయి, కొంచెం డిప్రెస్డ్‌ అయింది. నాన్న లేరు. ఆయన పోయాక మా అమ్మమ్మ, అమ్మ కలిసి కొన్ని రోజులు ఉన్నారు. ఆవిడ కూడా చనిపోయారు. బాగా దిగులు పడిపోయింది. ‘ఏంట్రా ఇది..’ అంటూ దిగాలుగా మాట్లాడింది. అప్పుడు ‘అమ్మా.. ఒక్కసారి ఆలోచించుకో.. ఎంతమంది తల్లులు నిన్ను చూసి స్ఫూర్తి పొందుతారో. చాలామందికి దక్కని అదృష్టం నీది అనుకుంటారు. అలాంటిది నువ్వే డిప్రెస్‌ అయితే ఎలా? నీ ముగ్గురు బిడ్డలు సూపర్‌ స్టేటస్‌లో ఉన్నారు. ఈ అదృష్టం ఎవరికీ లేదు. సురేఖకు కూడా లేదు. సురేఖకు భర్త ఒక స్టార్, కొడుకు ఒక స్టార్‌. కానీ నీకు నీ మనవళ్లు కూడా స్టార్సే’ అన్నాను.
అంజనాదేవి: అప్పుడు నువ్వు చెప్పిన ఆ మాటలు విన్నాక మనసు కుదుటపడిందిరా. నాకు నేను ధైర్యం తెచ్చుకున్నాను.
చిరు: ‘ఇక నుంచి నీతో పాటు నీ ఇంట్లోనే ఉంటా’ అని అమ్మ చెప్పాక నేను నాగబాబుకి ఫోన్‌ చేశాను. ‘‘మీ అందరి దగ్గర కార్లు ఉన్నాయి. బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఉంది. బంగ్లాలు ఉన్నాయి. పేరు, ప్రఖ్యాతులు ఉన్నాయి. నాకూ అన్నీ ఉన్నాయి. వాటికన్నా విలువైనది ఇంకోటి ఉంది. ‘మేరే పాస్‌ మేరే మా హై’ (నా దగ్గర అమ్మ ఉంది) అన్నాను. అందరం నవ్వుకున్నాం (తల్లి భుజం మీద తలవాల్చి).

మీ అబ్బాయి సినిమాల్లో మీకు బాగా నచ్చినవి?
అంజనాదేవి: ‘ఖైదీ నంబర్‌ 150’ చూసి ఎంత ఆనందపడ్డానో మాటల్లో చెప్పలేను.
చిరు: అమ్మ సినిమా అభిమాని. అందరి సినిమాలూ చూస్తుంది. అమ్మ బలమైన సినిమా పిచ్చి, నాన్నకు నటన మీదున్న ఇంట్రెస్ట్‌ నన్ను ఇలా యాక్టర్‌ని చేశాయేమో అనిపిస్తుంది.

మీ అబ్బాయికి ఎవరు పోటీ?
అంజనాదేవి: ఎవరూ లేరు. వాడికి వాడే పోటీ.

సినిమాల్లో మదర్‌ సెంటిమెంట్‌ సీన్స్‌ చేసినప్పుడు మీ అమ్మ గారు గుర్తుకువస్తారా?
చిరు: ‘ఘరానా మొగుడు’లో నేను అమ్మకు సేవలు చేసే సీన్స్‌ అప్పుడు అమ్మ గుర్తొచ్చింది.

మెగాస్టార్‌ కదా.. అమ్మకు కాళ్లు ఒత్తడం చేస్తుంటారా?
అంజనాదేవి: ఆ.. చేస్తూనే ఉంటాడు. బయట అందరికీ వాడు మెగాస్టార్‌ కావచ్చు. నాకు మాత్రం కొడుకే కదా. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. ఒకసారి ‘ఒరేయ్‌..’ అంటూ నేను మా అబ్బాయితో మాట్లాడుతుంటే, చరణ్‌ ఏమో ‘మా డాడీనే ఒరేయ్‌ అంటావా? ఎంత  ధైర్యం నీకు.. మెగాస్టార్‌ని ఒరేయ్‌ అంటావా’ అన్నాడు. ‘వాడెంత గొప్పవాడైనా నాకు కొడుకే కదరా. ఒరేయ్‌ అని పిలిస్తే తప్పా?’ అన్నాను. ఓ అదొకటా అని సరదాగా నవ్వాడు.

మీ పెద్దబ్బాయి డ్యాన్స్‌లు సూపర్‌. నచ్చుతాయా?
అంజనాదేవి: మావాడి తర్వాతే మా ఇంట్లో ఎవరైనా. బాగా డ్యాన్స్‌ చేస్తాడు. నాకిష్టం.

రామ్‌చరణ్‌ కూడా డ్యాన్సులు బాగా చేస్తారు. మనవడికి, కొడుక్కి పోటీ పెడితే..
అంజనాదేవి: అస్సలు ఒప్పుకోను. మా అబ్బాయే బెస్ట్‌. నా మనవడు బాగా డ్యాన్స్‌ చేస్తాడు. అది ఒప్పుకుంటాను.
చిరు: మీకో విషయం చెప్పాలి. అత్తా కోడళ్లకి ఏదైనా ఒకే ఒక్క  విషయంలో గొడవ జరుగుతుంది.  ‘నా కొడుకు గొప్ప అంటే నా కొడుకు గొప్ప’ అని వాదించుకుంటారు. ‘ఖైదీ నంబర్‌ 150’ 100 కోట్ల క్లబ్‌లో చేరినప్పుడు మా అమ్మ తన కోడలి దగ్గర గొప్పగా చెప్పుకుంది. ‘రంగస్థలం’ ఆ ఫీట్‌ సాధించాక ‘మా అబ్బాయి సినిమా కూడా సూపర్‌’ అని సురేఖ అంటే, కొన్ని నెలలు ఓపిక పట్టు.. మావాడి ‘సైరా’ వస్తుంది అంది (నవ్వుతూ).
అమ్మా.. ఇవాళే (ఆగస్ట్‌ 18, ఇంటర్వ్యూ జరిగిన రోజు) నా బర్త్‌డే అనుకొని బ్లెస్‌ చేయమ్మా (తల్లి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటూ).
అంజనాదేవి: ఇలానే ఇంకెన్నో బర్త్‌డేలు చేసుకొని పది కాలాల పాటు చల్లగా ఉండు నాన్నా (ఆశీర్వదిస్తూ ).

– డి.జి. భవాని

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top