breaking news
anjanadevi
-
నా సోదరి మరణం.. ఇప్పటికీ మరిచిపోలేను: చిరంజీవి
మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా మెగా ఉమెన్స్ పేరుతో మెగాస్టార్ ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. చిరంజీవి అమ్మగారు అంజనాదేవితో పాటు ఆయన సోదరీమణులు, సోదరుడు నాగబాబుతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి జీవితంలో జరిగిన అనేక సంఘటనలతో పాటు పలు సరదా విషయాలను వారు పంచుకున్నారు. అయితే, చిరు సోదరీమణులలో మాధవి రావు కూడా ఈ ఇంటర్వ్యూలో కనిపించడం విశేషం. వాస్తవంగా ఆమె మీడియాకు చాలా దూరంగా ఉంటారనే విషయం తెలిసిందే.మెగా బ్రదర్స్‌తో పాటు ఇద్దరు సోదరీమణులు ప్రస్తుతం ఉన్న విషయం తెలిసిందే. అయితే, తాము మొత్తం ఏనిమిది మంది అని చిరంజీవి తెలిపారు. చిన్న వయసులోనే తన సోదర,సోదరీమణులు ముగ్గురు చనిపోయారని ఆ ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. 'అమ్మకు మేము ఐదుగురు బిడ్డలం. అయితే, మరో ముగ్గురు బిడ్డలు చిన్న వయసులోనే చనిపోయారు. నేనే ఆరో తరగతి చదువుతున్నప్పుడు రమా అని నాకొక సోదరి ఉండేది. నాగబాబు, కల్యాణ్‌ల కంటే పెద్దది. చిన్న వయసులోనే ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. ఒకరోజు ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో పోన్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి అమ్మ, నేను కలిసి తీసుకువెళ్లాం. రెండురోజుల తర్వాత రమా చనిపోయింది. ఆ బిడ్డ శవాన్ని నా భుజాల మీద పెట్టుకొని రిక్షాలో అమ్మతో పాటు ఇంటికి వచ్చాను. ఆ దృశ్యాలు ఇప్పటికీ నన్ను కలిచివేస్తుంటాయి. నాన్న ఉద్యోగరీత్యా అందుబాటులో లేరు. ఈ విషయాన్ని ఆయనకు ఎలా తెలపాలో కూడా మాకు తెలియలేదు. ఎదోలా తెలిసిన వారి ద్వారా విషయాన్ని నాన్నకు చేరవేశాం. ఇంతలో చుట్టుపక్కల వాళ్లు సాయం చేయడంతో అంత్యక్రియలు పూర్తిచేశాం. ఆపై నాన్న వచ్చేసరికి అంతా అయిపోయింది. ఆ రోజు జరిగిన ప్రతి క్షణం నాకు ఇప్పటికీ గుర్తుంది. అది తలుచుకున్న ప్రతిసారి చాలా బాధగా ఉంటుంది.' అని చిరు కంటతడితో ఈ మాటలు చెప్పారు. -
International Womens Day 2024: ఆహారంలోనే ఆరోగ్యం.. మూడుతరాల కోడళ్ల ముచ్చట్లు
ఒక మహిళ శక్తిమంతురాలు... అని చెప్పడానికి ఒక నిదర్శనం ఆమె కుటుంబాన్ని నిర్వహించే తీరు. శక్తిమంతురాలైన మహిళ తన ఇంట్లో వ్యక్తుల మధ్య ఉండాల్సిన కుటుంబ బంధాలను చక్కగా నిర్వహించగలుగుతుంది. ఏ ఇంట్లో అయినా బంధాలు, బాంధవ్యాల నిర్వహణ బాధ్యత మహిళ భుజాల మీదనే ఉంటుంది. మగవాళ్లు పని ఒత్తిడిలో క్షణికావేశానికి లోనైనప్పుడు ఆ పరిస్థితిని చక్కదిద్దగలిగింది మహిళ మాత్రమే. ఆ మహిళ ఆ మగవ్యక్తికి తల్లి కావచ్చు, భార్య కావచ్చు, ఇంటి కోడలు కావచ్చు. ఒక ఇంట్లో తల్లి, కోడలు, కొత్తతరం కోడలు అందరూ అనుబంధాలకు విలువ ఇచ్చేవారైతే ఆ కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుందో ఈ ఫొటో చెప్తోంది. ఉపాసన, సురేఖ, అంజనాదేవి... కొణిదెల ఇంటి మూడు తరాల కోడళ్లు. తమ ఇంటి రుచుల అనుబంధాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్నారు. పిల్లలు తింటేనే నాకు బలం నాకు వంట చేయడం చాలా ఇష్టం. అయితే పెద్దగా ఓపికలేదిప్పుడు. పిల్లలు ఫోన్ చేసినప్పుడు ‘ఏమైనా వండి పంపించమంటావా’ అని అడుగుతాను. మొన్నొక రోజు చరణ్ ‘నాయనమ్మా రొయ్యల పలావు చేస్తావా’ అన్నాడు. రేపు ఎలా ఉంటుందో, చేయగలనా లేదా అని ఆ రోజు రాత్రి నిద్రపట్టలేదు. రొయ్యల పలావు వండి, చరణ్ తిని బాగుందన్న తర్వాత నెమ్మదించాను. ప్రతిదీ రుచిగా ఉండాలనుకుంటాను. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత కూడా మంచి కాఫీ కోసం నెల్లూరు, నిర్మలా కేఫ్ నుంచి కాఫీ పొడి తెప్పించుకునేదాన్ని. పిల్లలందరికీ చక్కగా వండి పెట్టడమే నాకు సంతోషం, అదే నా బలం. – అంజనాదేవి మా కోడలు నన్ను మార్చేసింది గత ఏడాది మహిళాదినోత్సవానికి – ఈ మహిళా దినోత్సవానికి మధ్య నా జీవితం ఓ కీలకమైన మలుపు తీసుకుంది. గృహిణిగా ఉన్న నన్ను ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చింది ఉపాసన. ‘అత్తమ్మాస్ కిచెన్’ ప్రారంభానికి మూలం కోసం నాలుగు దశాబ్దాల వెనక్కి వెళ్లాలి. మా పెళ్లయిన కొత్తలో చిరంజీవి షూటింగ్ కోసం పారిస్ వెళ్లినప్పుడు నేనూ వెళ్లాను. 47 రోజులు అక్కడ ఆయన మీట్, సాస్‌లు తినలేక ఇబ్బంది పడ్డారు. బయటి దేశాలకు వెళ్లినప్పుడు ఇంటి భోజనాన్ని ఎంజాయ్ చేయడం కోసం నేను కనుక్కున్న ఫార్ములానే ఈ ప్రీ కుక్డ్ ఫుడ్. అలాగే ఉపాసన ఆస్కార్ అవార్డు వేడుకలకు వెళ్లినప్పుడు తను ప్రెగ్నెంట్. భోజనం సరిగా తింటుందో లేదోనని ఇదే ఫార్ములా ఇన్స్టంట్ మిక్స్‌లు చేసిచ్చాను. తను చాలా సంతోషపడింది. ఇండియా వచ్చిన తరవాత తన ఆలోచన నాతో చెప్పింది. ఎంటర్ప్రెన్యూర్ అనే మాటే అప్పుడు నాకు అర్థం కాని విషయం. అయితే వంట వరకు నా పర్యవేక్షణలో జరుగుతుంది. ప్రభుత్వ అనుమతులు, మార్కెటింగ్ వంటివన్నీ ఉపాసన చూసుకుంటుంది. ఈ సందర్భంగా అరవై దాటిన మహిళలకు నేను చెప్పే మాట ఒక్కటే. యాభై దాటే వరకు మన ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకున్నా పట్టించుకోక పోయినా గడిచిపోతుంది. అరవైలలోకి వస్తున్నారంటే దేహం మీద దృష్టి పెట్టాలి. రోజుకో గంట సమయం వ్యాయామం కోసం కేటాయించాలి. ఎన్నాళ్లు బతుకుతామనేది కాదు, బతికినన్నాళ్లూ ఆరోగ్యంగా ఉండాలి. అలాగే మా ఉపాసన మాటలను విన్న తర్వాత నాకు తెలిసిందేమిటంటే... ఈ తరం మహిళలు ముఖ్యంగా గృహిణులు తమకంటూ ఓ గుర్తింపును కోరుకుంటారు. అలాగని అందరికీ పెద్ద పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించే వెసులుబాటు ఉండదు. ఆర్థిక సౌలభ్యం లేదని దిగులు చెందవద్దు. ఇంట్లోనే చేయగలిగే పచ్చళ్లు, హోమ్ఫుడ్తో చిన్నస్థాయిలో మొదలుపెట్టండి. మీ కృషితో మీ కుటీర పరిశ్రమను విస్తరించండి. మీకంటూ గుర్తింపు దానంతట అదే వస్తుంది. – సురేఖ అత్తమ్మ నా రోల్‌మోడల్ మీకు తెలుసా... అత్తమ్మ వెయిట్ లిఫ్టర్! రోజూ ఎక్సర్సైజ్లో భాగంగా వెయిట్ లిఫ్ట్ చేస్తారు. ఆమె ప్రతి విషయంలో ఎంత నిదానంగా, ఎంత జాగ్రత్తగా ఉంటారో, మాట్లాడే ముందు ఎంత ఆలోచిస్తారో... అన్నీ నాకు గొప్పగా అనిపిస్తాయి. ప్రీ కుక్డ్ ఫుడ్ ఫార్ములా తెలిసి ఎంత ఎగ్జయిట్ అయ్యానో చెప్పలేను. ట్రావెల్ చేసే వాళ్లకు ఎంత బాగా ఉపయోగపడుతుందో కదా, దీనిని అందరికీ పంచుదామన్నాను. ఇప్పటికే మార్కెట్లో ఉప్మా, పులిహోర వంటి మిక్స్‌లు ఉన్నప్పటికీ వాటిలో ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి. అలా క్రృతిమ ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా చేసిన మా అత్తమ్మ రెసిపీలను విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలనేదే నా ప్రయత్నం. ఇప్పుడు ఉప్మా, పులిహోర, రసం, పొంగల్ నాలుగు ఉత్పత్తులతో మార్కెట్లోకి వచ్చాం. మరో మూడు ప్రయోగాల దశ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మా పాపకు అందిస్తున్న చిరుధాన్యాలు, పప్పులతో ఇన్స్టంట్ ఫుడ్ పౌడర్‌ను కూడా మార్కెట్లోకి తీసుకువస్తాం. ఈ ఐడియాకి అత్తమ్మ గారింట్లో ఆశ్చర్యపోయారు. కానీ మా పుట్టింట్లో మహిళలందరూ ఎంటర్ప్రెన్యూర్లే కావడంతో వాళ్లు విన్న వెంటనే సంతోషంగా స్వాగతించారు. హెల్త్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయిని ఫుడ్ ఇండస్ట్రీలోకి రావడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. ఆహారంలోనే ఆరోగ్యం ఉంది. – ఉపాసన ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి; ఫోటో: నోముల రాజేశ్‌రెడ్డి -
జన్మజన్మలకు నీకు బిడ్డలుగానే పుట్టాలి: చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవికి ఇవాళ ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఆయనను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన అమ్మ అంజనా దేవి పుట్టినరోజు. ఈ సందర్భంగా చిరంజీవి జన్మనిచ్చిన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు చిరు. మాకు జన్మని, జీవితాన్ని ఇచ్చిన అమ్మ అంజనా దేవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో అమ్మతో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేశారు మెగాస్టార్. చిరంజీవి తన ఇన్‌స్టాలో రాస్తూ..' మాకు జన్మని, జీవితాన్ని ఇచ్చిన అమ్మ అంజనా దేవి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. జన్మజన్మలు నీకు బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్‌డే అమ్మ !' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు సోషల్ మీడియా వేదిక విషెస్ చెబుతున్నారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
అమ్మ కోసం చేపల వేపుడు
ఆ మధ్య తన తల్లి అంజనాదేవి కోసం చిరంజీవి దోసె వేశారు. దోసెను స్టయిల్‌గా పెనం మీద నుంచి పైకి ఎగరేస్తూ, వీడియోను షేర్ చేశారు. తాజాగా అమ్మ కోసం చిరంజీవి చేపల వేపుడు చేశారు. ఆ వీడియోను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ– ‘‘ఆదివారం ఖాళీగా ఉన్నాను. ఏమీ తోచకపోవడంతో ఏదో ఒకటి చేయాలనిపించింది. ఏం చేద్దామా? అని అనుకుంటుండగా.. వంట ఎందుకు చేయకూడదనిపించింది. వంట అనేసరికి నాకు ఒక్కసారి చిన్నప్పటి రుచులు గుర్తొచ్చాయి. చిన్న చిన్న చేపలను.. చింతకాయ తొక్కుతో కలిపి వేపుడు చేసి పెట్టేది మా అమ్మ. చాలా రుచిగా ఉండేది. మాకు ఇంత చేసి పెట్టిన అమ్మకి సరదాగా ఈ కూర నేను చేసి పెడితే ఎలా ఉంటుందనిపించింది. మరి తిడుతుందో.. బ్రహ్మాండంగా ఉంది అంటుందో చూద్దాం’’ అంటూ చేపల వేపుడును తల్లికి వడ్డించారు చిరు. ‘చాలా బాగుంది నాన్నా’ అని అమ్మ అనడంతో చిన్నపిల్లాడిలా సంబరపడిపోయారాయన. ఈ వీడియో బాగా వైరల్ అయింది. -
కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మే : చిరంజీవి
సాక్షి, హైదరాబాద్ : కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మేనని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. తన తల్లి అంజనాదేవి కరోనాపై పోరులో భాగంగా మాస్క్‌లు కుట్టారని వచ్చిన వార్తపై స్పష్టత ఇచ్చారు. అంజనాదేవి గత 3 రోజులుగా తన స్నేహితురాళ్లతో కలిసి 700 మాస్క్‌లు కుట్టారని, వీటిని అవసరమైన వారికి అందజేస్తున్నారనే వార్త సామాజిక మాధ్యమాల్లో ఫోటోలతోపాటూ వైరల్ అయ్యాయి. తన వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆమె సమాజం కోసం తనవంతు బాధ్యతను నెరవేరుస్తున్నారని నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ఆ ఫోటోల్లో ఉంది తన తల్లి అంజనాదేవి కాదని ట్విటర్లో స్పష్టత ఇవ్వడమే కాకుండా, ఆ ఫోటోల్లో ఉన్న మహిళను చిరంజీవి అభినందించారు. కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మేనని పొగడ్తలతో ముంచెత్తారు. It is reported in press & some media channels that my mother is doing this humanitarian work. I humbly seek to clarify that it is not my mother but whichever mother is engaged in this great act of compassion I heartily thank her for such kindness.కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మే pic.twitter.com/svN4RduRUg — Chiranjeevi Konidela (@KChiruTweets) April 11, 2020 -
అమ్మకు ‘చిరు’ ప్రేమతో..
తల్లి అంజనా దేవిపై ఇష్టాన్ని మెగాస్టార్ చిరంజీవి పలు సందర్భాలలో వెల్లడించిన సంగతి తెలిసిందే. తల్లిని ఎంతో ప్రేమగా చూసుకునే చిరంజీవి.. బుధవారం ఆమె బర్త్‌డే సందర్భంగా సరదాగా గడిపారు. తల్లితో సెల్ఫీ దిగుతూ ఉత్సాహంగా కనిపించారు. అలాగే తల్లి చేత కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, ఆయన భార్య సురేఖలతోపాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అలాగే నాయన్నమ్మకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ ఫొటోల్లో సుష్మిత, నిహారికలు నాయన్నమ్మ అంజనా దేవితో చాలా హుషారుగా గడుపుతూ కనిపించారు. మరోవైపు గతేడాది సైరా నరసింహారెడ్డి చిత్రంతో విజయాన్ని అందుకున్న చిరంజీవి.. ప్రస్తుతం కొరటాల శివ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా, ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా సంక్రాంతి పండగకు మెగాఫ్యామిలీ అంతా ఒకచోట చేరి సందడి చేసిన సంగతి తెలిసిందే. -
నా దగ్గర అమ్మ ఉంది
బిడ్డకు జన్మ.. తల్లికి పునర్జన్మ. ప్రాణం పోతున్నా ప్రాణం పోసే సమయం అది. పురిటినొప్పులు కన్నీళ్లు పెట్టిస్తున్నా.. బిడ్డ తొలి ఏడుపును అమ్మ ఆస్వాదించే ఒకే ఒక్క సమయం అది. ఆ జన్మకు మళ్లీ కన్నీళ్లు ఉండకూడదని ఆశీర్వదించే సమయం అది. పుడమి చీల్చిన మొక్కకు సారం అమ్మ. మెగా వృక్షానికైనా ఆసరా అమ్మ. తుఫాన్ రోజు పుట్టాడు. తెలుగునాట అభిమాన తుఫానై వర్షిస్తున్నాడు. ‘ఇంతకంటే ఓ అమ్మకు ఏం కావాలి’ అని అంటే... ‘నాకు అమ్మకంటే ఎక్కువ ఇంకేం కావాలి’ అంటున్నారు చిరంజీవి. ఈ 22న మీ అబ్బాయి బర్త్‌డే సందర్భంగా చాలా విశేషాలు తెలుసుకోవాలనిపించిందమ్మా.. అంజనాదేవి: చెప్పడానికి చాలా ఉన్నాయి. మా అబ్బాయితో కలిసి ఇలా (మీడియాతో) మాట్లాడటం ఇదే ఫస్ట్ టైమ్. అయితే చిరంజీవిగారికి బర్త్‌డే గిఫ్ట్ అన్నమాట.. చిరంజీవి: మా అమ్మ నాకు ఎప్పుడో గిఫ్ట్ ఇచ్చేసినట్లే. జస్ట్ వారం పది రోజుల కిందటే ఇచ్చింది. అంజనాదేవి: నేనా? ఏం ఇచ్చాను? గుర్తు లేదే. చిరంజీవి: అది గిఫ్ట్ అని అమ్మకు కూడా తెలియదు. అమ్మ ఒంటరిగా ఇక్కడ ఈ ఇంట్లో ఉంటోంది. మేం ఇప్పుడు ఉంటున్న ఇంటిని కొంచెం రెన్నోవేషన్ చేయిస్తున్నాం. ఈ మధ్య అమ్మ ‘‘ఒంటరిగా ఉండాలంటే ఏదోలా ఉంటోందిరా. దిగులుగా ఉంది. ఇక నీ దగ్గరకు వచ్చేస్తా’’ అంది. అది విని నాకు పట్టలేనంత ఆనందం కలిగింది. ఎందుకంటే అమ్మ స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడింది. ఆమె నిర్ణయాన్ని గౌరవించాం. ఇప్పుడు తనే స్వయంగా ‘వచ్చేస్తాను రా’ అంది. ఇప్పుడు చెప్పమ్మా.. ఇంతకంటే నాకు బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్ ఉంటుందా? చిరంజీవిగారు పుట్టినప్పుడు మీకు 15 ఏళ్లు అట. డెలివరీ అప్పుడు జోరున వర్షం అట కదా? అంజనాదేవి: అప్పుడు నర్సాపురంలో ఉండేవాళ్లం. ఉదయం 4 గంటలకే నొప్పులు మొదలయ్యాయని మిషన్ హాస్పిటల్‌కి గుర్రపు బండిలో వెళ్లాం. ఒకవైపు వర్షం. ఎలాగో హాస్పిటల్‌కి చేరుకున్నాం. సోమవారం ఉదయం 10 గంటలకు పుట్టాడు. మీరు ఆడుకునే వయసులో ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఆ బిడ్డ మెగాస్టార్ కావడంపై మీ ఫీలింగ్? అంజనాదేవి: నా గర్వం నా పిల్లలే. ముఖ్యంగా నా పెద్దబ్బాయి చిన్నప్పటి నుంచి నా బాధ్యతలు కూడా పంచుకొని నాకు తోడుగా నిలబడ్డాడు. చిరు: చిన్నçప్పుడే అమ్మ నన్ను అలా ట్రైన్ చేసింది. కట్టెపుల్లలు ఎలాంటివి తీసుకురావాలి. మంచి చేపలు ఎలా తీసుకురావాలి. పచారి కొట్లో సామాన్లు ఎలా తీసుకురావాలి? అన్నీ నేర్పించింది. లిస్ట్ రాసిస్తే కిరాణా కొట్టుకి వెళ్లి సరుకులు తెచ్చేవాడ్ని. అంజనాదేవి: పాతిక రూపాయలు ఇస్తే చక్కగా కూరగాయలు, ఇతర వస్తువులు రిక్షాలో పెట్టి జాగ్రత్తగా తీసుకొచ్చేవాడు. తెచ్చినందుకు చాక్లెట్, బిస్కెట్ ఏమైనా? అంజనాదేవి: అదేం లేదు. చిరు: అడగాలని నాకు తెలియదు, ఇవ్వాలని అమ్మకు తెలియదు (నవ్వుతూ). 15 ఏళ్ల వయసులో అమ్మకు ఆడుకునే బొమ్మ అయినా కన్న బిడ్డ అయినా అన్నీ నేనే. నాన్న డ్యూటీకి వెళ్లిపోయేవారు. మాకు బంధువులు ఎక్కువగా లేరు. చుట్టం చూపుగా వచ్చి వెళ్లేవారంతే. దాంతో నాకు, అమ్మకు అటాచ్మెంట్ ఎక్కువ. తనకు ఏం కావాలన్నా నేనే తెచ్చిపెట్టేవాడ్ని. చిన్నప్పుడు మీ బర్త్‌డేలు ఎలా సెలబ్రేట్ చేసేవారు? చిరు: నా చిన్న వయసు నుంచే అమ్మానాన్న నా బర్త్‌డేని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేవారు. ఒక కుర్చీలో నన్ను కూర్చోబెట్టి, చుట్టుపక్కల వాళ్లను పిలిచి అక్షింతలు వేయించేది. మరీ విచిత్రం ఏంటంటే.. లౌడ్ స్పీకర్ కూడా పెట్టించేది (నవ్వులు). ఆ రోజుల్లోనే వచ్చిన వాళ్లందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేది. శెనగలు, చలిమిడి, తాంబూలం ఏదో ఒకటి. మాకున్న స్థా్థయిలో. ప్రతి సంవత్సరం అలానే. అలా అమ్మ గ్రాండ్‌గా చేయడం మొదలుపెట్టిన నా బర్త్‌డేలు తర్వాత తర్వాత ఇంకా గ్రాండ్‌గా జరగడం మొదలైంది. హీరోగా స్టార్ట్ అయినప్పుడు చెన్నైలో ఉండేవాళ్లం కదా. ఇక్కణ్ణుంచి అభిమానులు బస్సులు వేసుకుని వచ్చేవాళ్లు. ఇక్కడికొచ్చాక కూడా అలానే జరుగుతోంది. నాకే బర్త్‌డేలంటే కొంచెం ఇంట్రస్ట్ తగ్గింది. అయితే బర్త్‌డేలు గ్రాండ్‌గా చేసుకోవాలని స్ఫూర్తి ఇచ్చింది అమ్మే. మిగతా బ్రదర్స్ చేసేవాళ్లు కాదు. వాళ్లకు ఆ అలవాటు లేదు. ఇంట్రస్ట్ కూడా తక్కువ. అమ్మా.. నీకు చెప్పడం మరచిపోయా. మొన్న (ఆగస్ట్ 13) విజయ (చిరంజీవి చెల్లెలు) బర్త్‌డే. కానీ 15న ఫోన్ చేసి, హ్యాపీ బర్త్‌డే అన్నాను. ‘లేట్‌గా చెప్పా.. సారీ రా’ అంటే ‘నాకే గుర్తు లేదన్నయ్యా. మా అందరికీ బర్త్‌డే అంటే నీ బర్త్‌డేనే’ అంది. ఆ రకంగా నన్ను, నా బర్త్‌డేని సొంత బర్త్‌డే అన్నట్లుగా సెలబ్రేట్ చేసుకుంటారు. మీ అబ్బాయిని ఇంత బాగా పెంచుకున్నారు కదా. కోడలు వచ్చేప్పుడు అబ్బాయి దూరమైపోతాడేమోనని భయపడ్డారా? అంజనాదేవి: ఎప్పుడూ లేదు. చిరు: నిజంగా.. మనసులో భయపడ్డావు కదూ.. అంజనాదేవి: లేదు నాన్నా. అసలు సురేఖ కొత్తలోనే బాగా కలిసిపోయింది. మమ్మల్ని సొంత అమ్మ, నాన్నలానే చూసుకుంటుంది. మాకేం కావాలో తనకు చెప్పక్కర్లేదు. భార్యకి చేయాలని లేకపోతే ‘ఇది చెయ్.. అది చెయ్..’ అని భర్త ఎంతసేపు చెబుతాడు. మా కోడలు తనే ముందు కల్పించుకొని ఇది చేస్తే బావుండు... అది చేస్తే బావుండు అని చేస్తుంది. చిరు: మా బంధువుల పిల్లలకు చదువులు చెప్పించింది. పెళ్లిళ్లు చేసింది. ఫ్లాట్స్ కొని ఇచ్చింది. ఫైనాన్షియల్‌గా ఇబ్బంది అనిపిస్తే వాళ్ల అకౌంట్లోకి డబ్బులు వెళ్ళిపోయేలా చేస్తుంది. అందుకే మా ఫ్యామిలీలో సురేఖ అంటే అందరికీ గౌరవంతో కూడిన ప్రేమ. అమ్మయితే కూతురు అనే అంటుంది. అంజనాదేవి: (మధ్యలో అందుకుంటూ) కూతురు కంటే ఎక్కువ మా కోడలు. ‘ఏంటి అత్తమ్మగారు.. ఎలా ఉన్నారు?’ అని, ఏం తింటున్నానో అడిగి తెలుసుకుంటుంది. ఏం తినాలో చెబుతుంది. ఏం మందులు వేసుకోవాలో చెబుతుంది. అంత శ్రద్ధ. చిరు: ఆ మధ్య న ర్స్ని కూడా పెట్టింది అమ్మను చూసుకోవడానికి. ఆ రకంగా వాళ్లిద్దరికీ మంచి అనుబంధం ఉంది. సురేఖకి నేను ఇలా చెయ్యి, వీళ్లను చూడు అని చెప్పలేదు. అలా చెప్పి ఎవరితోనూ ఏ పనీ చేయించలేం. స్వతహాగా ఉండాలి. ఇంటికి వచ్చే పెద్ద కోడలికి అందర్నీ చూసే గుణం ఉంటే.. ఆ కుటుంబం బాగుంటుంది కదమ్మా.. అంజనాదేవి: కరెక్టే. అలాంటి అమ్మాయి కోడలైతే ఫ్యామిలీ మొత్తం కలిసి ఉంటుంది. మీ అబ్బాయిలు యాక్టర్స్ కాకుండా మాములు జాబ్ చేస్తే ఉదయమే వెళ్లి సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తారు కదా అనిపిస్తుంటుందా? అంజనాదేవి: లేదు. ఎంత మందికి ఈ చాన్స్ వస్తుంది. కోట్లమంది ఉంటారు ఉద్యోగస్తులు. కానీ ఒక స్టార్‌కి ఎంత ప్రజాదరణ ఉంటుందో తెలుసు కదా. ఇలా ఏ కొందరికో దక్కుతుంది. ఇది నా బిడ్డల అదృష్టం అని భావిస్తాను. అన్నప్రాసన అప్పుడు చిరంజీవిగారు ఏం పట్టుకున్నారు? అంజనాదేవి: కత్తి పట్టుకున్నాడు. చిరు: అప్పుడు పట్టుకున్న కత్తి ‘ఖైదీ నంబర్ 150’ వరకూ వదల్లేదు. ఇప్పుడు ‘సైరా’కీ పట్టుకున్నాను (నవ్వుతూ). చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్లడానికి ఏడ్చిన రోజులు? అంజనాదేవి: చక్కగా వెళ్లిపోయేవాడు. చిరు: నిడదవోలులో ‘అ ఆలు’ చదివించడం కోసం ఓ పంతులుగారి దగ్గరికి పంపింది. ఆయనేమో తొడపాసెం పెట్టేవాడు. అక్కడ ఎర్రగా అయ్యేది. ఎందుకమ్మా పంపుతున్నావు? అంటే.. చదువుకో నాన్నా అనేది. అయిష్టంగా వెళ్లేవాడిని. చదువు మీద ఇంట్రస్ట్ పోయే స్థితి వచ్చింది. ఓకే.. చిరంజీవిగారు చిన్నప్పుడు చేసిన అల్లరి.. అంజనాదేవి: అబ్బో... చెప్పడానికి లేదు. ఆ అల్లరి భరించలేకపోయేదాన్ని. ఐదేళ్ల వయసులో అనుకుంటా. రోడ్డు మీదకు వెళ్లిపోయాడు. నిలబడి దిక్కులు చూస్తూ, అక్కడే నిద్రపోయాడు. నేనేమో ఎక్కడికి వెళ్లిపోయాడా అని వెతు క్కుంటూ వెళ్లా. అక్కడున్న వాళ్లు ‘ఏమ్మా పసిపిల్లోణ్ణి వదిలేసి, వెళతావా?’ అని గట్టిగానే తిట్టారు. బాధపడుతూనే ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చా. ఇక వీడితో వేగలేనని మంచం కోళ్లకు తువ్వాలుతో కట్టేసేదాన్ని. చిరు: చాలా అరాచకం ఇది. ‘అమ్మా’నవీయం. చాలా దారుణం అమ్మా అది. పసిబిడ్డను ఎంత హింస పెట్టావు నువ్వు (తల్లివైపు అల్లరిగా చూస్తూ). అవునమ్మా అసలు రోడ్డు మీద నుంచి ఇంటికి నీ పిల్లోణ్ణే తెచ్చావా? వేరే వాళ్లను తెచ్చుకోలేదు కదా. (నవ్వుతూ). ఎందుకంటే మా ఇంట్లో కల్యాణ్, నాగబాబు, మాధవి, విజయ.. అందరూ తెల్లగానే ఉంటారు. నేనే కొంచెం డార్క్. సొంత కొడుకునేనా? అంజనాదేవి: మా నాన్న పోలికలండీ వీడికి. ఆయన రంగు వచ్చింది. ఇప్పుడింత కామ్‌గా ఉన్నట్లు కనిపిస్తున్నాడు కదా.. తక్కువోడు కాదండీ. వీడంత అల్లరి ఎవరూ చేయలేదు. చిరు: మా ఇంటి దగ్గర గుyì‡ ప్రహరీ గోడ కొంచెం వెడల్పుగా ఉండేది. దాని మీద నిలబడి విన్యాసాలు చేస్తూ, పరిగెడుతూ ఉండేవాడ్ని. ఒకసారి మా నాన్నగారు చూసి టెన్షన్ పడిపోయి, ఇంటికి తీసుకొచ్చారు. నాకు బడిత పూజ. అలా నన్ను వదిలేసినందుకు అమ్మకు తిట్లు. అప్పుడు అమ్మ ‘ఒరేయ్ వెళ్లకు రా.. నిన్ను ఇలా మంచానికి కట్టేయలేను. నీ హుషారుని ఆపలేను’ అనేది. అదే ప్రహరీ మీద నేను చేసిన విన్యాసాలు నాకు కొన్ని లక్షల మంది ఫ్యాన్స్‌ని తెచ్చిపెట్టాయి. అది ‘దొంగ’ సినిమాలో అనుకుంటా. పది అంతస్తుల బిల్డింగ్ ప్రహరీ మీద నేను రోల్ అవుతూ సీన్ చేయాలి. అది నాగబాబు చూశాడు. అన్నయ్య అంత రిస్క్ చేస్తున్నాడు అంటూ ఇంటికి వచ్చి ఏడ్చాడట. చిన్నప్పుడేమో ప్రహరీ గోడ మీద విన్యాసాలు చేస్తే తన్నులు పడ్డాయి. ఇప్పుడు చేస్తుంటే అభిమానుల ప్రేమ జల్లులు పడుతున్నాయి. రిస్కులు చేస్తుంటే అమ్మానాన్న టెన్షన్ పడేవారా? చిరు: ‘గూండా’లో మూవ్ అవుతున్న ట్రైన్ కింద రాడ్డు పట్టుకుని వెళ్లే సీన్. రైలు పట్టాల మీద ఉన్న రాళ్లు వీపుకి గుచ్చుకుంటున్నాయి. ఆ షూటింగ్‌కి నాన్న వచ్చారు. ప్రొడ్యూసర్ని పిలిచి కేకలేశారు.. ప్రాణాలతో చెలగాటమెందుకు? అని. ఆ నిర్మాతేమో ‘నువ్వు చేయొద్దయ్యా బాబు. మీ నాన్న నన్ను కేకలు వేస్తున్నారు?’ అనేవారు. అలా రిస్కీ సీన్స్ చేసినప్పుడు ‘నాన్నా.. నువ్వు వెళ్లిపో. నేను షూటింగ్ చేసుకొని వస్తా’ అని పంపించేసేవాడ్ని. చిన్నప్పుడు నేను చేసిన అల్లరి రూపాంతరం చెంది.. పెద్దయ్యాక కూడా అదే అల్లరి (షూటింగ్స్‌లో సీన్స్ గురించి) చేస్తున్నాను. కార్ల మధ్యలో పరిగెడుతున్నాను. అంజనాదేవి: నాకంటే మావారు ఎక్కువగా భయపడేవారు. నేను మిగతా పిల్లలను చూసుకోవడంలో, ఇంటి పనుల్లో్ల పడి కొంచెం మర్చిపోయినా, పిల్లలు ఇంటికి వచ్చేదాకా.. అది రాత్రి 12 అవ్వనీ 2 అవ్వనీ అలా కూర్చుని ఉండేవారు. పిల్లలకు ఏం కాకూడదని దేవుళ్లకు దండం పెట్టుకోవడం లాంటివి చేసేవారా? చిరు: అమ్మ పూజలు, దైవ దర్శనాలు చేస్తుంది. తను కోరుకునేది ఒక్కటే. బిడ్డలు బాగుండాలని. మీరు చిరంజీవిగారికి జన్మనిచ్చారు. ఆయనేమో స్టార్ అయి, నాగబాబు, పవన్ కల్యాణ్, రామ్‌చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్, నిహారిక.. రేపు వైష్ణవ్ తేజ్ ఇలా వృక్షాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. ఇది ఊహించారా? చిరు: డిగ్రీ అయ్యాక నాకేం చేయాలో తోచలేదు. ‘నాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాలని ఉంది’. అన్నాను. మనకు ఎవరిస్తారు? అంది. నాకు ఉద్యోగాలు చేయబుద్ధి కావడంలేదని అమ్మానాన్నతో అన్నాను. అంజనాదేవి: రిస్క్ కదా. నాన్న రికమెండ్ చేస్తారు. కొంచెం చదువుకుంటే డీయస్పీ రేంజ్ వరకూ వెళ్లొచ్చు అన్నాను. చిరు: చివరికి నా ఇంట్రెస్ట్ చూసి నాన్నకు అమ్మ చెప్పింది. పగలంతా ఇన్స్టిట్యూట్లో నేర్చుకొని రాత్రులు ఐసీడబ్ల్యూ ప్రిపేర్ అవుతాను అంటున్నాడు కదా. చూద్దాం. ట్రై చేసుకోనిద్దాం అని అమ్మానాన్న అనుకున్నారు. మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఒక్క సంవత్సరమే కోర్స్. వన్ ఇయర్లో ఫ్యూచర్ తెలిసిపోతుందిలే అని మద్రాస్‌లో జాయిన్ అయ్యాను. అమ్మానాన్న నా అభిలాషని అర్థం చేసుకుని ఎంకరేజ్ చేయడమే ఈరోజు నన్ను ఇంతటివాడ్ని చేసింది. ఇంతమంది ప్రేమను పొందేలా చేసింది. నా తర్వాత వచ్చిన నా కుటుంబ సభ్యులను కూడా అందరూ ఆదరించడం.. ఇదంతా దైవ కృప. అభిమానుల ఆశీస్సులు, నా తల్లిదండ్రుల నమ్మకం. మీ అమ్మగారు చాలా స్ట్రాంగ్ లేడీ అనుకోవచ్చా? చిరు: స్ట్రాంగ్ కాదు కానీ ప్యూర్ లవ్ ఉన్న పర్సన్. బిడ్డలైనా, కోడళ్లైనా, మనవళ్లైనా సమానమే. అమ్మలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే.. మేం ఎప్పుడైనా ఎక్కువ రోజులు కనిపించకపోతే, ‘ఏంట్రా రావడం లేదు. మర్చిపోయారు’ అని దెప్పడంలాంటివి చేయదు. తనే ఫోన్ చేస్తుంది. ‘చూడాలని ఉందిరా. ఎక్కడున్నావు? నేనే వస్తా’ అంటుంది. పిల్లలు ఎంత బిజీగా ఉంటారో అర్థం చేసుకుంటుంది. అమ్మ ఆలోచనలన్నీ ఆరోగ్యకరంగా ఉంటాయి. ఆవిడకు ఆరోగ్యం బాగాలేనప్పుడు మానసికంగా డౌన్ అవుతుంటారా? అప్పుడు మీరేం చేస్తారు? చిరు: ఈ మధ్య అమ్మ ఆరోగ్యం బాలేనప్పుడు చాలా డౌన్ అయింది. శారీరకంగా, మానసికంగా కూడా. నేను ‘ఖైదీ నంబర్ 150’తో, కల్యాణ్ పాలిటిక్స్‌తో, నాగబాబు టీవీ షోలతో బిజీ. ఆ టైమ్‌లో మేం పలకరించడం చాలా తగ్గిపోయింది. అప్పుడు కొంచెం ఒంటరితనం ఫీలయి, కొంచెం డిప్రెస్డ్ అయింది. నాన్న లేరు. ఆయన పోయాక మా అమ్మమ్మ, అమ్మ కలిసి కొన్ని రోజులు ఉన్నారు. ఆవిడ కూడా చనిపోయారు. బాగా దిగులు పడిపోయింది. ‘ఏంట్రా ఇది..’ అంటూ దిగాలుగా మాట్లాడింది. అప్పుడు ‘అమ్మా.. ఒక్కసారి ఆలోచించుకో.. ఎంతమంది తల్లులు నిన్ను చూసి స్ఫూర్తి పొందుతారో. చాలామందికి దక్కని అదృష్టం నీది అనుకుంటారు. అలాంటిది నువ్వే డిప్రెస్ అయితే ఎలా? నీ ముగ్గురు బిడ్డలు సూపర్ స్టేటస్‌లో ఉన్నారు. ఈ అదృష్టం ఎవరికీ లేదు. సురేఖకు కూడా లేదు. సురేఖకు భర్త ఒక స్టార్, కొడుకు ఒక స్టార్. కానీ నీకు నీ మనవళ్లు కూడా స్టార్సే’ అన్నాను. అంజనాదేవి: అప్పుడు నువ్వు చెప్పిన ఆ మాటలు విన్నాక మనసు కుదుటపడిందిరా. నాకు నేను ధైర్యం తెచ్చుకున్నాను. చిరు: ‘ఇక నుంచి నీతో పాటు నీ ఇంట్లోనే ఉంటా’ అని అమ్మ చెప్పాక నేను నాగబాబుకి ఫోన్ చేశాను. ‘‘మీ అందరి దగ్గర కార్లు ఉన్నాయి. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. బంగ్లాలు ఉన్నాయి. పేరు, ప్రఖ్యాతులు ఉన్నాయి. నాకూ అన్నీ ఉన్నాయి. వాటికన్నా విలువైనది ఇంకోటి ఉంది. ‘మేరే పాస్ మేరే మా హై’ (నా దగ్గర అమ్మ ఉంది) అన్నాను. అందరం నవ్వుకున్నాం (తల్లి భుజం మీద తలవాల్చి). మీ అబ్బాయి సినిమాల్లో మీకు బాగా నచ్చినవి? అంజనాదేవి: ‘ఖైదీ నంబర్ 150’ చూసి ఎంత ఆనందపడ్డానో మాటల్లో చెప్పలేను. చిరు: అమ్మ సినిమా అభిమాని. అందరి సినిమాలూ చూస్తుంది. అమ్మ బలమైన సినిమా పిచ్చి, నాన్నకు నటన మీదున్న ఇంట్రెస్ట్ నన్ను ఇలా యాక్టర్‌ని చేశాయేమో అనిపిస్తుంది. మీ అబ్బాయికి ఎవరు పోటీ? అంజనాదేవి: ఎవరూ లేరు. వాడికి వాడే పోటీ. సినిమాల్లో మదర్ సెంటిమెంట్ సీన్స్ చేసినప్పుడు మీ అమ్మ గారు గుర్తుకువస్తారా? చిరు: ‘ఘరానా మొగుడు’లో నేను అమ్మకు సేవలు చేసే సీన్స్ అప్పుడు అమ్మ గుర్తొచ్చింది. మెగాస్టార్ కదా.. అమ్మకు కాళ్లు ఒత్తడం చేస్తుంటారా? అంజనాదేవి: ఆ.. చేస్తూనే ఉంటాడు. బయట అందరికీ వాడు మెగాస్టార్ కావచ్చు. నాకు మాత్రం కొడుకే కదా. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. ఒకసారి ‘ఒరేయ్..’ అంటూ నేను మా అబ్బాయితో మాట్లాడుతుంటే, చరణ్ ఏమో ‘మా డాడీనే ఒరేయ్ అంటావా? ఎంత ధైర్యం నీకు.. మెగాస్టార్‌ని ఒరేయ్ అంటావా’ అన్నాడు. ‘వాడెంత గొప్పవాడైనా నాకు కొడుకే కదరా. ఒరేయ్ అని పిలిస్తే తప్పా?’ అన్నాను. ఓ అదొకటా అని సరదాగా నవ్వాడు. మీ పెద్దబ్బాయి డ్యాన్స్‌లు సూపర్. నచ్చుతాయా? అంజనాదేవి: మావాడి తర్వాతే మా ఇంట్లో ఎవరైనా. బాగా డ్యాన్స్ చేస్తాడు. నాకిష్టం. రామ్‌చరణ్ కూడా డ్యాన్సులు బాగా చేస్తారు. మనవడికి, కొడుక్కి పోటీ పెడితే.. అంజనాదేవి: అస్సలు ఒప్పుకోను. మా అబ్బాయే బెస్ట్. నా మనవడు బాగా డ్యాన్స్ చేస్తాడు. అది ఒప్పుకుంటాను. చిరు: మీకో విషయం చెప్పాలి. అత్తా కోడళ్లకి ఏదైనా ఒకే ఒక్క విషయంలో గొడవ జరుగుతుంది. ‘నా కొడుకు గొప్ప అంటే నా కొడుకు గొప్ప’ అని వాదించుకుంటారు. ‘ఖైదీ నంబర్ 150’ 100 కోట్ల క్లబ్లో చేరినప్పుడు మా అమ్మ తన కోడలి దగ్గర గొప్పగా చెప్పుకుంది. ‘రంగస్థలం’ ఆ ఫీట్ సాధించాక ‘మా అబ్బాయి సినిమా కూడా సూపర్’ అని సురేఖ అంటే, కొన్ని నెలలు ఓపిక పట్టు.. మావాడి ‘సైరా’ వస్తుంది అంది (నవ్వుతూ). అమ్మా.. ఇవాళే (ఆగస్ట్ 18, ఇంటర్వ్యూ జరిగిన రోజు) నా బర్త్‌డే అనుకొని బ్లెస్ చేయమ్మా (తల్లి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటూ). అంజనాదేవి: ఇలానే ఇంకెన్నో బర్త్‌డేలు చేసుకొని పది కాలాల పాటు చల్లగా ఉండు నాన్నా (ఆశీర్వదిస్తూ ). – డి.జి. భవాని -
'మా అబ్బాయి సినిమా సూపర్బ్‌గా ఉంది'
హైదరాబాద్: తన తనయుడు, మెగాస్టార్ చిరంజీవి దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ 'ఖైదీ నంబర్ 150' సినిమాతో రీఎంట్రీ ఇవ్వడంపై తల్లి అంజనాదేవి ఆనందం వ్యక్తం చేశారు. తన కొడుకు సినిమా సూపర్బ్‌గా ఉందని ఆమె పేర్కొన్నారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్లలో ఆమె స్వయంగా సినిమా చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 'తొమ్మిదేళ్ల తర్వాత చిరంజీవి నటించిన 'ఖైదీ నంబర్ 150' సినిమా అద్భుతంగా ఉంది. 60 ఏళ్ల వయసులోనూ డ్యాన్స్, నటనతో చిరంజీవి అదరగొట్టాడు. అందరికీ నిజమైన సంక్రాంతి పండుగను అందించాడు' అని అన్నారు. చిరంజీవి రీఎంట్రీ ఇస్తూ రూపొందిన 'ఖైదీ నంబర్ 150' సినిమా మెగా ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడం.. మంచి టాక్ వస్తుండటంతో మెగాఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
సకలం... సుందరం
సుందరకాండ పరమ పవిత్రమైన పఠనీయ గ్రంథం, నిత్య పారాయణ దివ్య చరితం. ఏ సమయంలో ఎవరితో ఏ విధంగా నడచుకోవాలో సోదాహరణంగా, సవివరంగా చెప్పే వ్యక్తిత్వ వికాస విజ్ఞాన భాండాగారం. భగవద్గీత అనగానే శ్రీకృష్ణుడు గుర్తుకొచ్చినట్లుగానే, సుందరకాండ అనగానే హనుమంతుడు జ్ఞప్తికి రావడం సహజం. గీత లాగే సుందరకాండ కూడా చక్కటి వ్యక్తిత్వ వికాస గ్రంథం. వాల్మీకి శ్రీమద్రామాయణ రచన ప్రారంభించిన క్రమంలో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ పూర్తయ్యాయి. తర్వాతి కాండకు ఏం పేరు పెట్టాలా అని ఆలోచించాడు. కానీ మంచి పేర్లేమీ ఆయనకు తోచలేదు. అప్పుడు ఆయన మనసులో రామభక్తుడైన హనుమంతుడు మెదిలాడు. కొత్తకాండకు హనుమత్కాండ అని పేరు పెడదామనుకున్నాడు. అదే విషయాన్ని హనుమను పిలిచి ఆయనకు చెప్పబోతున్నాడు. ఇంతలో అంజనాదేవి ‘‘మహర్షీ! సుందరుడిని ఒకసారి నా వద్దకు పంపించు’’అని అనడం వాల్మీకికి వినిపించింది. వాల్మీకి మహర్షి ‘‘సుందరా! మీ తల్లిగారు పిలుస్తున్నారు, వెళ్లిరా నాయనా!’’అని చెప్పారు. హనుమకు కూడా ‘‘నాయనా, సుందరా! ఎక్కడున్నావు తండ్రీ’’ అంటున్న తల్లి గొంతు వినిపించింది. వెంటనే హనుమ తన తల్లి వద్దకు వెళ్లి, ‘‘అమ్మా! సుందరుడెవరు?’’ అని అమాయకంగా అడిగాడు. అప్పుడు అంజనాదేవి ‘‘నీకన్నా సుందరుడెవరు నాయనా? బాల్యంలో నువ్వు బాలభానుడిలా సుందరంగా భాసించేవాడివి. అందుకే నేను నీకు సుందరుడనే పేరే పెట్టాను. అయితే ఇంద్రుడు నీ హనువుపై వజ్రాయుధంతో కొట్టడం వల్ల నీకు హనుమంతుడనే పేరు వచ్చింది. మహర్షి రాయబోయే కాండకు నీ పేరు పెట్టడమే బాగుంటుంది. ఎందుకంటే ఆ కాండకు సంబంధించిన వారందరూ సుందరమైన వారే! రాముడు సుందరుడు, ఆయన సతీమణి సీత ఎంతో సుందరమైనది. వారిద్దరికీ సంబంధించిన ఈ కథ సుందరమైనది. ఆ తల్లి నివసించబోయే అశోకవనం కూడా సుందరమైనదే. ఆ కావ్యానికి అనుసంపుటి చేసిన గాయత్రీ మాత ఎంతో సుందరమైనది. అన్నింటికీ మించి ఆ కావ్యరచన సుందరంగా సాగుతోంది కాబట్టి ఆ కాండకు సుందరకాండ అని పేరు పెట్టడమే సముచితం’’ అంది అంజనాదేవి. ఈ సంభాషణనంతటినీ ఆలకిస్తున్న వాల్మీకి వెంటనే ఆ కాండకు సుందరకాండ అని పేరు పెట్టాడు. హనుమ గురించి అధికంగా ఉండే సుందరకాండ పరమ పవిత్రమైన పఠనీయ గ్రంథం, నిత్య పారాయణ దివ్య చరితం. ఏ సమయంలో ఎవరితో ఏ విధంగా నడచుకోవాలో సోదాహరణంగా, సవివరంగా చెప్పే వ్యక్తిత్వ వికాస విజ్ఞాన భాండాగారం. భక్తితో పారాయణ చేసిన వారి కోర్కెలను తీర్చే కల్పతరువు. ఈ గ్రంథాన్ని పారాయణ చేయాలంటే నియమాలను పాటించాలేమో అని చాలామంది భయపడతారు. అయితే ఏవైనా ప్రత్యేకమైన ప్రయోజనాలను ఆశించినప్పుడు నియమాలను పాటించక తప్పదు కానీ, మానసికానందం కోసం పఠించేవారు సర్వకాల సర్వావస్థలలోనూ హాయిగా చదువుకోదగ్గ సద్గ్రంథమిది. నేడు హనుమజ్జయంతి. భక్తి ప్రధానం అని గుర్తుంచుకోండి. ఈ వేళ అయినా ఈ గ్రంథ పారాయణ మొదలు పెట్టండి... ఆధ్యాత్మికానందంలో ఓలలాడండి. - డి.వి.ఆర్.