నేను అమ్మకూచిని: బిగ్‌బాస్‌ విన్నర్‌

Sidharth Shukla Says Staying Away From Mom Is Toughest Part Of Bigg Boss - Sakshi

తాము కోరుకున్నవి తెచ్చిపెట్టేందుకు తన తల్లి రీతూ శుక్లా ఎన్నో త్యాగాలు చేసిందని హిందీ బిగ్‌బాస్‌-13 విజేత, నటుడు సిద్దార్థ్‌ శుక్లా అన్నాడు. భర్త దూరమైనా ఏనాడు తనను తాను బలహీనురాలిగా భావించలేదని.. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ముందుకు సాగిందని పేర్కొన్నాడు. ‘‘బాలికా వధు’’ సీరియల్‌ ఫేం సిద్ధార్థ్‌ శుక్లా బిగ్‌బాస్‌-13 ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. రూ.40 లక్షల ప్రైజ్‌మనీతో పాటు లగ్జరీ కారును కూడా అతడు సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబేతో ముచ్చటించిన సిద్దార్థ్‌... తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి తన తల్లి రీతూ శుక్లా అని పేర్కొన్నాడు. రీతూ కేవలం తనకు తల్లి మాత్రమే కాదని.. బెస్ట్‌ ఫ్రెండ్‌ కూడా అని చెప్పుకొచ్చాడు. కఠిన పరిస్థితులను ఆమె ఎదుర్కొన్న తీరు తనకు స్ఫూర్తిదాయకమని తెలిపాడు. తల్లికి దూరంగా బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఉండటం తన జీవితంలోని అత్యంత కఠిన సమయాల్లో ఒకటని పేర్కొన్నాడు.(బిగ్‌బాస్‌ విన్నర్‌: ఊహించిందే నిజమైన వేళ..)

‘‘నన్ను చూసి అందరూ ఎంతో గంభీరంగా ఉంటానని అనుకుంటారు. నిజానికి మా అమ్మ విషయంలో నేను చాలా సున్నితంగా ఉంటాను. ముగ్గురు సంతానంలో నేను చిన్నవాడిని. ఇద్దరు అక్కలతో పాటు అల్లరి చేసేవాడిని. అయితే చిన్నప్పటి నుంచీ నేను అమ్మకూచిని. తను కనబడకపోతే ఏడుపు అందుకునే వాడిని. ఎల్లప్పుడూ తన చేతిని పట్టుకుని ఉండేవాడిని. పెరిగి పెద్దయ్యే కొద్దీ అమ్మ నాకు స్నేహితురాలిగా కూడా మారింది. మంచీచెడుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించి చెప్పేది. నిజాయితీగా ఎలా ఉండాలో నేర్పించేది. పదిహేనేళ్ల క్రితం మా నాన్న చనిపోయినపుడు.. మమ్మల్ని కాచే గొడుగు కొట్టుకుపోయినట్లుగా బాధలో కూరుకుపోయాం. అప్పుడు అమ్మ కుంగిపోకుండా మాకోసం ధైర్యంగా నిలబడింది. తను మాకెప్పుడూ బలహీనురాలిగా కనిపించలేదు. ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉన్న ఇంటిని చక్కగా నడిపించింది. మా ముగ్గురినీ కంటికి రెప్పలా కాచుకుంది. మాకేం కావాలన్నా తెచ్చిపెట్టేది. అందుకోసం తాను ఎన్ని త్యాగాలు చేసిందో ఊహించలేను’’అని సిద్దార్థ్‌ శుక్లా పేర్కొన్నాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top